త్యాగధనుల పోరాటాలు వృధాకావు
కడియాల వీరాచారి ఆశయాలను కొనసాగించాలి : సంతాప సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
నవతెలంగాణ -నల్లబెల్లి
కమ్యూనిస్టుల ఉద్యమాలతోనే సమాజంలోని అసమానతలు తొలగిపోతాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. గురువారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం శనిగరం గ్రామంలో కడియాల మనోహర్ అధ్యక్షతన నిర్వహించిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కడియాల వీరాచారి సంతాప సభలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అట్టడుగు స్థానంలోని కూలీలు నేటికీ పేదరికంతో దుర్భర జీవితాలను కొనసాగిస్తున్నారన్నారు. కోట్లాది మంది కార్మికులు, రైతులు తమ జీవితాలను పణంగా పెట్టి బతుకీడుస్తున్నారని తెలిపారు. వీరిందరి శ్రమను దోపిడి చేస్తూ కార్పొరేట్ శక్తులు పబ్బం గడుపుతున్నాయని విమర్శించారు. కార్పొరేట్ రంగాలకు 2 శాతం పన్ను విధిస్తే అందరికీ ఉచిత విద్య, వైద్యం ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు. డిగ్రీలు పుచ్చుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనందున నిరుద్యోగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత విద్య, వైద్యంతోపాటు బతకడానికి పని కల్పించని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలకు ఇండ్లు లేవన్నారు. బూర్జువా, భూస్వామ్య ప్రభుత్వాలు మాయమాటలు చెబుతూ అధికారాన్ని చేజిక్కుంచుకొంటూ కార్మికులు, రైతులు, కష్టజీవులకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కమ్యూనిస్టులు నిరంతరం ఉద్యమాలు చేస్తూ తమ జీవితాలను త్యాగం చేస్తున్నారని తెలిపారు.
ఇదే కోవలో కడియాల వీరాచారి తన జీవితాంతం ప్రజల కోసం పరితపించారన్నారు. ఎర్ర జెండా నేతృత్వంలో ఈ ప్రాంతంలోని పోడు భూములు, ఇండ్ల స్థలాలు పేదలకు దక్కాలని చేపట్టిన పోరాటాలు జీవితాంతం గుర్తుండిపోతాయన్నారు. కమ్యూనిస్టు త్యాగధనుల పోరాటాలు ఎన్నటికీ వృధాకావన్నారు. వారి ఆశయ సాధనకై ప్రజా సమస్యలపై పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.నాగయ్య మాట్లాడుతూ.. నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి కడియాల వీరాచారి అని అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు జీవిత కాలం మొత్తం పోరాటాలు చేపట్టారన్నారు. అనేక ఆటుపోట్లు, విచ్చిన్నం వచ్చినా ఎదుర్కొంటూ నిలబడ్డారని కొనియాడారు. ఆసరవెల్లి, మూడుచెక్కలపల్లి ప్రాంతంలోని పోడు భూములు పంచడంలో ముఖ్య పాత్ర పోషించారన్నారు. ఆయన చనిపోయే వరకు ఎర్ర జెండా వీడలేదన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. విజ్ఞాన దర్శిని రాష్ట్ర అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ.. సమాజం కోసం జీవితాంతం పోరాడిన వీరాచారి తాను చనిపోయాక కూడా వైజ్ఞానిక పరిశోధనలకై ఉపయోగపడాలని తన దేహాన్ని ఆస్పత్రికి అప్పగించాలని భావించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు భూక్య సమ్మయ్య, ఈసంపెల్లి బాబు, సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు చింత కింది కుమారస్వామి, ఎంసీపీ(ఐ)యూ మండల కార్యదర్శి దామ సాంబయ్య, సీపీఐ(ఎం) మండల నాయకులు హనుమకొండ శ్రీధర్, సాయిలు, కృష్ణారెడ్డి, దుర్గయ్య, కుమారస్వామి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.



