టాప్-4లో నిలిచేందుకు గట్టి పోటీ
లీగ్ దశ ఆఖరు వారం రసవత్తరం
నవతెలంగాణ క్రీడావిభాగం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. గతంలో ఎన్నో సీజన్లలో లీగ్ దశ ఆఖరు మ్యాచ్‌లకు ప్రాధాన్యత లేకపోవటంతో ప్లే ఆఫ్స్ పద్దతిని తీసుకొచ్చి.. టాప్-2 జట్లకు ఫైనల్‌కు చేరుకునేందుకు రెండు అవకాశాలు కల్పించింది. దీంతో ప్లే ఆఫ్స్ జట్లు ఖరారైనా.. టాప్-2లో చోటు కోసం ఆఖరు దశ మ్యాచ్‌లకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సీజన్‌లో టాప్-4 బెర్తులే ఇంకా ఖరారు కాలేదు. ప్లే ఆఫ్స్‌తో పాటు టాప్-2 జట్లపై ఉత్కంఠ కొనసాగుతుంది. లీగ్ దశలో శనివారంతో 60 మ్యాచ్‌లు ముగిశాయి. మరో 10 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ దశలో టాప్-4లో నిలిచేందుకు ఏకంగా ఎనిమిది జట్లు పోటీపడుతున్నాయి. ఇందులో కొన్ని జట్లకు ఎక్కువ అవకాశాలు, కొన్ని జట్లకు తక్కువ అవకాశాలు ఉన్నప్పటికీ.. రేసులోనే నిలువటంతో ఉత్కంఠ రేగుతోంది. లీగ్ దశ మ్యాచ్‌లు ఆఖరు వారంలోకి అడుగుపెట్టినా.. ప్లే ఆఫ్స్ సమీకరణాలు తేలలేదు.
ఆ రెండు ఖరారు!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌లు పాయింట్ల పట్టికలో టాప్-2లో కొనసాగుతున్నాయి. 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించిన ఈ రెండు జట్లు దాదాపుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నట్టే. కానీ, మరో నాలుగు జట్లు గరిష్టంగా 16 పాయింట్లు సాధించే అవకాశం ఉంది. దీంతో చివరి రెండు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లోనైనా విజయం అనివార్యం. ఓ గెలుపుతో ప్లే ఆఫ్స్‌తో పాటు టాప్-2లో చోటు పదిలం చేసుకోవచ్చు. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడితే.. అదే సమయంలో ఇతర జట్లు విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్ సమీకరణాలు నెట్ రన్‌రేట్‌పై ఆధారపడతాయి. అప్పడు టాప్-4 నుంచి బయటకు వెళ్లే ప్రమాదం సైతం ఉంది. ఆర్‌సీబీ చివరి రెండు మ్యాచ్‌లు బయట ఆడాల్సి ఉంది. ఈ సీజన్లో బయట ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడింట పరాజయం పాలైన ఆర్‌సీబీకి ఈ రెండు మ్యాచ్‌లకు ప్రతిష్టాత్మకంగా మారాయి.
రేసులోనే ఆ రెండు
ఓ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం పదిలం అనుకున్న పంజాబ్ కింగ్స్ ఇప్పడు ఏకంగా టాప్-4లో నిలుస్తుందా? అనే దుస్థితికి చేరుకుంది. వరుసగా ఐదు పరాజయాలు పంజాబ్ కింగ్స్ అవకాశాలను దారుణంగా దెబ్బతీశాయి. 12 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లు సాధించిన పంజాబ్ కింగ్స్ చివరి రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా నెగ్గి తీరాలి. అప్పడే ఆ జట్టు 17 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోగలదు. ఓ మ్యాచ్‌లో ఓడి, ఓ మ్యాచ్‌లో నెగ్గినా.. 15 పాయింట్లతో అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. పంజాబ్ కింగ్స్ అవకాశాలు పూర్తిగా ఆ జట్టు చేతిలోనే ఉన్నాయి. వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌కు చేరుతుందా? ఓటమి బాటలోనే నడిచి నిష్ర్కమిస్తుందా? చూడాలి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లు సాధించింది. చివరి రెండు మ్యాచ్‌లు ప్లే ఆఫ్స్ రేసులోనే నిలిచిన చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో నెగ్గితే 18 పాయింట్లతో టాప్-2లో చోటు సాధిస్తుంది. కనీసం ఓ మ్యాచ్‌లో నెగ్గినా 16 పాయింట్లతో టాప్-4లో నిలిచే అవకాశం ఉంది. రెండింటా ఓడితే.. ఇతర జట్ల ఫలితాలు, నెట్‌రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది.
ఆశలు సజీవం
సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన జట్టు రాజస్తాన్ రాయల్స్. ఇప్పడు వరుస పరాజయాలతో సతమతం అవుతోంది. 11 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు సాధించిన రాయల్స్.. మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మూడింటా నెగ్గితే 18 పాయింట్లతో టాప్-2లో నిలుస్తుంది. రెండింట నెగ్గినా.. 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోనుంది. ఇతర జట్లతో పోల్చితే ఓ మ్యాచ్ అదనంగా ఆడాల్సి ఉండటం రాయల్స్ అవకాశాలను మెరుగుపర్చుతుంది. 12 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు సాధించిన చెన్నై సూపర్‌కింగ్స్ సైతం ప్లే ఆఫ్స్‌పై ఆశలు వదులుకోలేదు. చివరి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గితే చెన్నై గరిష్టంగా 16 పాయింట్లు సాధించగలదు. కానీ ఒక్క మ్యాచ్‌లో ఓడినా ఆ జట్టు 14 పాయింట్లతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పడు నెట్‌రన్‌రేట్ ఆధారంగా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోవటం సూపర్‌కింగ్స్‌కు మరింత కఠినంగా మారుతుంది.
అద్భుతం జరగకపోదా?
ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ఏడు పరాజయాలు చవిచూడగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆరు ఓటములు చవిచూసింది. ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లు, నైట్‌రైడర్స్ 9 పాయింట్లతో ఉన్నాయి. క్యాపిటల్స్ మరో రెండు మ్యాచ్‌లు నెగ్గితే గరిష్టంగా 14 పాయింట్లు సాధించగలదు. నైట్‌రైడర్స్ చివరి మూడు మ్యాచ్‌లు నెగ్గితే గరిష్టంగా 15 పాయింట్లకు చేరుకోగలదు. మిగిలిన మ్యాచ్‌ల్లో నెగ్గినా ఈ రెండు జట్లకు నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలు స్వల్పం. ఇప్పటికే టాప్-4 రేసులో ముందంజలో నిలిచిన జట్లు ఓడటంతో పాటు ఈ జట్లు నెట్‌రన్‌రేట్‌ను భారీగా మెరుగుపర్చుకోవాలి. లేదంటే, విజయాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పకోవాల్సిందే.
ఆశలు ఆవిరి
లక్నో సూపర్‌జెయింట్స్, ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పకున్నాయి. 12 మ్యాచ్‌ల్లో 8 ఓటములు చవిచూసిన లక్నో, ముంబయిలు నాలుగు విజయాలు మాత్రమే సాధించాయి. టెక్నికల్‌గానూ ఈ రెండు జట్లకు అవకాశాలు లేకపోవటంతో.. చివరి రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థుల అవకాశాలను దెబ్బతీయనున్నాయి. ముంబయి ఇండియన్స్‌తో రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌లు ఆడనుండగా.. లక్నో సూపర్‌జెయింట్స్‌తో పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడనున్నాయి.



