Thursday, August 6, 2026
E-PAPER
Homeజాతీయంరాజకీయ పార్టీ కాదు ప్రజా ఉద్యమ వేదికే

రాజకీయ పార్టీ కాదు ప్రజా ఉద్యమ వేదికే

- Advertisement -

ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నిస్తాం
సీజేపీపై ఊహాగానాలకు అభిజిత్‌ దీప్కే తెర
దేశవ్యాప్తంగా ఉద్యమ విస్తరణకు కార్యాచరణ

ఛత్రపతి శంభాజీనగర్‌ : కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) రాజకీయ పార్టీగా మారబోదని ఆ సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్‌ ‌దీప్కే స్పష్టం చేశారు. ఇది ప్రజా సమస్యలపై ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రజా ఉద్యమ వేదికగానే కొనసాగుతుందని చెప్పారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో జరుగుతున్న రెండు రోజుల వ్యూహ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో సీజేపీ ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెడుతుందనే ప్రచారానికి ఈ ప్రకటనతో తెరపడినట్టయ్యింది. కేవలం రెండు నెలల క్రితం వ్యంగ్యాత్మక ఆలోచనతో ప్రారంభమైన కాక్రోచ్‌ జనతా పార్టీ… అతి తక్కువ కాలంలోనే యువత సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకున్న ఉద్యమ వేదికగా గుర్తింపు పొందింది. పరీక్షల అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులను సమీకరించే ప్రయత్నం చేసింది. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో జరిగిన విద్యార్థి ఉద్యమాలకు దీప్కే నాయకత్వం వహించడం ద్వారా సీజేపీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

​రాజకీయాలకు దూరం ….
రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన ప్రస్తుతం తమకు లేదని దీప్కే స్పష్టం చేశారు. ‘‘పార్టీగా మారాలన్న ఆసక్తి కంటే మీడియాకే ఆ అంశంపై ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది. మేము ప్రజల సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నించే, ఒత్తిడి తీసుకొచ్చే ప్రజా వేదికగానే కొనసాగుతాం’’ అని తెలిపారు. యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో అవకతవకలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం వంటి అంశాలపై పోరాటాన్ని మరింత విస్తరిస్తామని చెప్పారు.

​దేశవ్యాప్తంగా ‘లిజనింగ్‌ టూర్‌’
సీజేపీని దేశవ్యాప్తంగా విస్తరించే కార్యాచరణను ప్రారంభిస్తున్నట్టు దీప్కే తెలిపారు. యువత సమస్యలు, అభిప్రాయాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా ‘లిజనింగ్‌ టూర్‌’ చేపట్టనున్నట్టు వెల్లడించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడినా వారికి అండగా నిలుస్తామని చెప్పారు. ప్రస్తుతం జార్ఖండ్‌లో జేపీఎస్సీ సివిల్స్‌ పరీక్షలో అక్రమాల ఆరోపణలపై కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమానికి సంఘీభావం ప్రకటించే అంశాన్ని కూడా సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలిపారు. అవసరమైతే అక్కడికి వెళ్లి మద్దతు ఇస్తామని చెప్పారు. జంతర్‌మంతర్‌ ఆందోళన సందర్భంగా 26 రోజులపాటు నిరాహార దీక్ష చేసిన సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ తమ ఉద్యమానికి మార్గదర్శిగా ఉన్నారని వివరించారు. జార్ఖండ్‌ విద్యార్థి నాయకులతో వాంగ్‌చుక్‌ ఇప్పటికే మాట్లాడి సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, సీజేపీ సమావేశం జరుగుతున్న రోజే జార్ఖండ్‌లో విద్యార్థులు ఆందోళన విరమించడం గమనార్హం.

​యువత ఐక్యతే బలం
సీజేపీ వ్యూహ సమావేశంలో సంస్థ ప్రతినిధులు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రంకాతో పాటు సుమారు 50 మంది కీలక వాలంటీర్లు పాల్గొన్నారు. యువత సమస్యలను ఒకే వేదికపైకి తీసుకురావడం, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాలపై ప్రజా ఒత్తిడి పెంచడమే సంస్థ లక్ష్యమని వారు తెలిపారు. ‘‘యువత ఐక్యంగా పోరాడితే మార్పు సాధ్యమేనని ఈ ఉద్యమం నిరూపించింది’’ అని సౌరవ్‌ దాస్‌ అన్నారు. వ్యంగ్య వేదికగా ప్రారంభమైన సీజేపీ… ప్రస్తుతం యువత సమస్యలపై జాతీయ స్థాయి ఉద్యమ వేదికగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండి ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని ఆ సంస్థ తీసుకున్న నిర్ణయం ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -