Monday, May 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఎబోలా వైరస్ కలకలం

ఎబోలా వైరస్ కలకలం

- Advertisement -

హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
కాంగోలో 88 మంది మృతి

మరణాల శాతం ఎక్కువ : వైద్య అధికారులు

కాంగో: ప్రాణాంతక ఎబోలా వైరస్‌ ఆఫ్రికా దేశం కాంగోలో మరోసారి కలకలం రేపుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆరోగ్య సంక్షోభాన్ని అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ఆదివారం ప్రకటించింది. ఈ రకం వైరస్‌కు టీకా అందుబాటులో లేదని అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.కాగా, అత్యంత వేగంగా వ్యాపించే ఎబోలా వైరస్ కారణంగా కాంగోలో 88 మంది మరణించారు. మరో 336 మందికి ఎబోలా వైరస్ సోకిందని ఆఫ్రికాలోనే అతిపెద్ద ప్రజారోగ్య కేంద్రం సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) శనివారం తెలిపింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. బండిబుగ్యో ఎబోలా వైరస్ రకం వల్ల సంభవించిన ఈ వ్యాప్తి అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే విషయమని డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడింది. ఎబోలా కేసుల సంఖ్య, వ్యాప్తి వాస్తవ పరిస్థితిపై స్పష్టత లేదని తెలిపింది. ఈ క్రమంలో అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, ఇది అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం రెండో అత్యున్నత హెచ్చరిక స్థాయి.

కాంగోలో ఆందోళనకరంగా వైరస్ వ్యాప్తి : డబ్ల్యూహెచ్ఓ
ఎబోలా సంక్రమించిన వ్యక్తుల వాస్తవ సంఖ్య, భౌగోళిక వ్యాప్తికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ ఎబోలా వైరస్ వల్ల ప్రపంచ దేశాలకు తక్షణ ముప్పు లేకపోయినా, కాంగో పొరుగు దేశాలకు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది.

కాంగో హెల్త్ మినిస్టర్ ఏమన్నారంటే?
తమ దేశంలో ఎబోలా వైరస్ వ్యాప్తిపై కాంగో ఆరోగ్య మంత్రి శామ్యూల్ రోజర్ కంబా స్పందించారు. బుండిబుగ్యో రకం ఎబోలా వైరస్‌కు వ్యాక్సిన్ లేదన్నారు. ఈ వైరస్ వ్యాప్తికి నిర్దిష్ట చికిత్స లేదని చెప్పారు. ఈ వైరస్ సోకిన మొదటి రోగి ఒక నర్సు అని తెలిపారు. ఆమె ఈ ఏడాది ఏప్రిల్ 24న ఇటూరి ప్రావిన్స్ రాజధాని బునియాలోని ఒక ఆరోగ్య కేంద్రానికి ఎబోలా లక్షణాలతో వచ్చారని వెల్లడించారు. ఈ వ్యాధి సోకితే జ్వరం, రక్తస్రావం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయని a.
ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందడాన్ని అత్యంత ఆందోళనకరంగా వైద్య సహాయక బృందం డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఎంఎస్ఎప్) పేర్కొంది. ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఎబోలా కేసులు నమోదవ్వడం, మరణాలు అత్యంత ఆందోళన కలిగించే విషయమని అభిప్రాయపడింది. ఈ సంస్థ ప్రస్తుతం ఎబోలా వైరస్ వ్యాప్తి చెందిన ఇటూరి ప్రాంతానికి వైద్య, సహాయక సిబ్బందిని తరలిస్తోంది.

మరణాల శాతం ఎక్కువ : వైద్య అధికారులు
మరోవైపు, వైద్య అధికారులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ రకం ఎబోలా వైరస్‌ సోకితే మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. వ్యాధి సోకిన వారిలో మరణాల రేటు 50 శాతం వరకు చేరవచ్చని అంచనా వేశారు. 2007లో తొలిసారిగా ఈ స్ట్రెయిన్‌ను గుర్తించారని చెప్పారు. కాంగోకు పొరుగున ఉన్న ఉగాండాలోని ఓ వ్యక్తిని ఈ వైరస్ తొలిసారి బలిగొందని వెల్లడించారు. 1976లో గుర్తించిన జైర్ రకం ఎబోలా వైరస్‌కు మాత్రమే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందని హెచ్చరించారు.

50 ఏండ్లల్లో 15వేల మంది మృతి
ఎబోలా వైరస్‌ వల్ల ఆఫ్రికాలో గత 50 ఏండ్లల్లో సుమారు 15,000 మంది చనిపోయారు. ఈ వైరస్ సోకి గతేడాది ఆగస్టులో మధ్య ఆఫ్రికాలో 34 మంది మరణించారు. 2018- 2020 మధ్య కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి చెంది దాదాపు 2,300 మంది చనిపోయారు. కాగా, గబ్బిలాల నుంచి మనషులకు ఈ ఎబోలా వ్యాధి వ్యాపిస్తుంది. తీవ్రమైన రక్తస్రావం, అవయవ వైఫల్యానికి కారణమవుతుంది. ఈ వైరస్‌ సోకిన వ్యక్తి శారీరక ద్రవాలు, రక్తాన్ని తాకినప్పుడు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ ప్రాణాంతకమైన ఎబోలా వైరస్‌ 21 రోజులపాటు రోగిలో సజీవంగా ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -