Saturday, July 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం

అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం

- Advertisement -

ఓటర్ల సమాచారాన్ని చోరీ చేసింది
2020 పోల్స్‌పై ట్రంప్ 
అవాకులు చవాకులు
మధ్యంతర ఎన్నికలలో లబ్ది పొందేందుకేనంటున్న విశ్లేషకులు
బీజింగ్ ప్రభావం లేదని ఇప్పటికే 
తేల్చి చెప్పిన నిఘా వర్గాలు
వాషింగ్టన్ :
అమెరికా ఎన్నికలలో చైనా జోక్యం చేసుకుంటోందని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆరోపించారు. తన వాదనకు మద్దతుగా ఆయన కొన్ని పత్రాలను గురువారం బయటపెట్టారు. 2020 ఎన్నికలపై బీజింగ్ ప్రభావం చూపినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఒకవైపు అమెరికా నిఘా వర్గాలు తేల్చి చెబుతున్నప్పటికీ ట్రంప్ మాత్రం చైనాపై అవాకులు చవాకులు పేలుతూనే ఉన్నారు. 2020 అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. నవంబరులో జరగబోయే మధ్యంతర ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ట్రంప్ తమ విమర్శలకు పదును పెడుతున్నారు. ఎన్నికల భద్రతను ఓ ప్రధాన రాజకీయ అంశంగా మార్చేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాన్ని ఇరవై ఐదు నిమిషాల ఆయన తాజా ప్రైమ్ – టైమ్ ప్రసంగం బహిర్గతం చేసింది. కాంగ్రెస్‌లో స్వల్ప ఆధిక్యతను కొనసాగిస్తున్న రిపబ్లికన్లు మధ్యంతర ఎన్నికలలో దానిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
రిపబ్లికన్లపై ట్రంప్ ఒత్తిడి
అమెరికా ఎన్నికలలో మోసం జరగడం చాలా అరుదని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ కొత్త ఓటర్ల గుర్తింపు, పౌరసత్వ నిబంధనలకు సంబంధించిన చట్టాన్ని ఆమోదించాలంటూ ఆయన కాంగ్రెస్‌లోని రిపబ్లికన్లపై ఒత్తిడి తెస్తున్నారు. అందులో భాగంగానే ఈ తాజా ప్రసంగాన్ని చూడాల్సి ఉంటుంది. డెమొక్రాట్ల తీవ్ర వ్యతిరేకత కారణంగా ఈ బిల్లు ప్రస్తుతం సెనెట్‌లోనే ఆగిపోయింది.
రాజకీయ ప్రచారాస్త్రంగా
‘ఎన్నికల భద్రత’
బహిర్గతమైన సమాచారం మన ఎన్నికల మౌలిక సదుపాయాలలో దిగ్భాంతికరమైన బలహీనతలను బయటపెడుతోందని ట్రంప్ అన్నారు. అయితే ట్రంప్ బయటపెట్టిన పత్రాలను పరిశీలిస్తే అలాంటిదేమీ లేదని స్పష్టమవుతోంది. పైగా ఆ పత్రాలు అమెరికా ఎన్నికల మౌలిక సదుపాయాలకు ఏ మాత్రం సంబంధం లేనివిగా ఉన్నాయి. ఇరాన్ యుద్ధానికి ప్రజామోదం లేకపోవడం, ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడం వంటి పరిణామాల కారణంగా ట్రంప్ రేటింగ్ దారుణంగా పడిపోతోంది. యుద్ధంలో గెలవబోతున్నామని ఊదరకొట్టిన ట్రంప్‌కు ఇప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో తెలియని పరిస్థితి. పన్నుల కోతలు, వలసదారులపై కఠిన చర్యలు వంటి విజయాలను గతంలో ఏకరువు పెట్టిన ట్రంప్ ఇప్పుడు ఎన్నికల భద్రత అంశాన్ని తలకెత్తుకున్నారు.

ఆధారాలే లేని ఆరోపణలు
పేర్లు, చిరునామాలు, ఇతర వివరాలు సహా 22 కోట్ల అమెరికా ఓటర్ల ఫైళ్లను చైనా అక్రమంగా చోరీ చేసిందని నిరూపించే సున్నితమైన సమాచారాన్ని తాను బహిర్గతం చేశానని ట్రంప్ చెప్పారు. చైనా కార్యకలాపాల పరిధికి సంబంధించిన సమాచారాన్ని అమెరికా నిఘా వర్గాలు ఉద్దేశపూర్వకంగానే దాచి పెట్టాయని ఆరోపించారు. అయితే ఇక్కడ ఓ విషయాన్ని ప్రస్తావించాల్సి ఉంది. ఓటర్ల నమోదు, బ్యాలెట్లు, ఓట్ల లెక్కింపు, ఫలితాలు సహా 2020 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఏదైనా సాంకేతిక అంశాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నాలు జరిగినట్లు లేదా వాటిలో విజయం సాధించినట్లు నిరూపించే ఆధారాలేవీ లేవని అమెరికా నిఘా సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. అప్పటి ట్రంప్ జాతీయ నిఘా డైరెక్టర్, ప్రస్తుత సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ ఆధ్వర్యంలో ఈ నిర్ధారణ జరగడం గమనార్హం. పైగా చైనా వద్ద ఉన్న అమెరికా ఓటర్ల సమాచారం రహస్యమైనదేమీ కాదని, రాజకీయ సలహాదారులు ఓటర్ల ఫైళ్లను కొనుగోలు చేస్తుంటారని, వాటిని తారుమారు చేయడం సాధ్యం కాదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


జోక్యం లేదు : ట్రంప్ వ్యాఖ్యలపై వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి లియూ చాంగ్ వ్యాఖ్యానిస్తూ అమెరికా అధ్యక్ష ఎన్నికలలో చైనా ఎన్నడూ జోక్యం చేసుకోలేదని, మున్ముందు చేసుకోబోదని చెప్పారు.
చైనా రాయబారి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -