Friday, August 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా సంస్థలపై చైనా ఆంక్షలు

అమెరికా సంస్థలపై చైనా ఆంక్షలు

- Advertisement -

ప్రతిచర్యకు దిగిన బీజింగ్‌
ఆంక్షల జాబితాలో మరో ఆరు అమెరికా కంపెనీలు.. తగ్గనున్న డ్రోన్‌ ఎగుమతులు

బీజింగ్‌ : అమెరికా, దాని సంస్థలకు వ్యతిరేకంగా చైనా పలు చర్యలను ప్రకటించింది. చైనా కంపెనీలను లక్ష్యంగా చేసుకొని అమెరికా ఇటీవల తీసుకున్న చర్యలకు ప్రతిగా బీజింగ్ ఈ నిర్ణయానికి వచ్చింది. వచ్చే నెలలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికాలో పర్యటించనున్న తరుణంలో ఈ ఆంక్షల ప్రకటన వెలువడడం గమనార్హం. బయోటెక్ వనరుల విశ్లేషణ సంస్థ సహా పలు అమెరికా కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నామని, అమెరికాకు డ్రోన్లు, వాటికి సంబం ధించిన భాగాలు, సాంకేతిక పరిజ్ఞానం ఎగుమతులపై నియంత్రణను కఠినతరం చేస్తున్నామని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యుఘర్, ఇతర మైనారిటీ సమూహాలపై మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న ఆరోపణపై గత వారం 43 చైనా కంపెనీల నుంచి దిగుమతులను నిషేధిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రతిగా చైనా తన ఆంక్షల జాబితాలో తాజాగా ఆరు అమెరికా కంపెనీలను చేర్చింది. చైనాలో తయారయ్యే కొత్త హ్యూమనాయిడ్, చతుష్పాద రోబోలు, అలాగే విద్యుత్ కన్వర్టర్ల దిగుమతులపై గత నెలలో అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) విధించిన నిషేధంతో సంబంధమున్న ఓ కంపెనీని కూడా బీజింగ్ తన ఆంక్షల జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో ఉన్న సంస్థలతో చైనా కంపెనీలు కానీ లేదా వ్యక్తులు కానీ ఎలాంటి వ్యాపారాలూ చేయకూడదు.

వాటికి సహకరించకూడదు. కాగా విదేశీ సాఫ్ట్‌వేర్‌ను కలిగిన కార్యాలయ పరికరాల దిగుమతులపై జాతీయ భద్రతా విచారణను ప్రారంభించడం, అమెరికాతో ఫ్యాక్టరీ ట్రాకింగ్ తనిఖీలకు సంబంధించి కొనసాగుతున్న సహకారాన్ని నిలిపివేయడం వంటి చర్యలను కూడా చైనా తీసుకుంది. బీజింగ్ సంస్థలను లక్ష్యంగా చేసుకొని ఇటీవల అమెరికా తీసుకున్న చర్యలకు ప్రతిగా అవసరమైన చర్యలు తీసుకోవడం మినహా తమకు మరో దారి లేదని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పారు. సంబంధిత చర్యలను తక్షణమే ఉపసంహరించు కోవాలని, తప్పుడు చర్యలు ఆపాలని, నిర్మాణాత్మకమైన, స్థిరమైన ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించేందుకు కలసి పనిచేయాలని అమెరికాను కోరుతున్నామని తెలిపారు. చైనాపై కొత్తగా ఆంక్షలు విధించాలని అమెరికా కోరుకుంటే అందుకు ప్రతిగా తామూ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పాలీసిలికాన్‌ ఉత్పత్తులపై అమెరికా టారిఫ్‌
వాషింగ్టన్‌ : సోలార్‌ ప్యానల్స్‌, సెమీకండక్టర్లలో ఉపయోగించే కీలక ముడిపదార్థం పాలీసిలికాన్‌తో తయారైన ఉత్పత్తులపై పదిహేను శాతం సుంకాన్ని, దిగుమతి చేసుకునే ఆ ఉత్పత్తుల ధరలను డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. చిప్‌ సరఫరాల వ్యవస్థపై పెరుగుతున్న చైనా ఆకాంక్షలకు అడ్డుకట్ట వేసి దేశీయ పాలీసిలికాన్‌ ఫ్యాక్టరీలను కాపాడడమే ఈ చర్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. పాలీసిలికాన్‌, వేఫర్లు, సెల్స్‌-మాడ్యూల్స్‌, సోలార్‌ ప్యానల్స్‌ కనీస దిగుమతి ధరలను ప్రభుత్వం నిర్ణయించింది. పునరుద్పాదక ఇంధనానికి ట్రంప్‌ తన మద్దతును వెనక్కి తీసుకున్న నేపథ్యంలో పాలీసిలికాన్‌పై చేపట్టిన దర్యాప్తు దేశీయ సౌర ఉత్పత్తి పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -