అంతిమంగా టెహ్రాన్‌కే ప్రయోజనమన్న విశ్లేషకులు
హామీలను అమెరికా అమలు చేస్తేనే జలసంధిని తెరుస్తాం : ఇరాన్ స్పష్టం
టెహ్రాన్ : హార్ముజ్ జలసంధిపై ఇరాన్, ఒమన్ మధ్య ఒప్పందం కుదరబోతోంది. జలసంధిలో వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేందుకు చేపట్టాల్సిన చర్యలను ఈ ఒప్పందంలో ప్రతిపా దించారు. తాత్కాలిక ఒప్పందంలో భాగంగా హార్ముజ్‌ను తిరిగి తెరిచే అవకాశాలు ఉన్నాయి. జలసంధిలో నౌకాయానానికి కొత్త మార్గాలను ఏర్పాటు చేసే విషయంలో ఒమన్‌తో సమన్వయం చేసుకు నేందుకు అంగీకరించామని ఇరాన్ గురువారం తెలియజేసింది. ప్రతిపాదిత ఒప్పందంపై అనేక వారాలుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. అమెరికా, ఇరాన్ మధ్య జూన్ 17న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి, వ్యూహాత్మక జలమార్గంలో నౌకాయానంపై నెలకొన్న వివాదాలను పరిష్కరించడానికి, ఇరాన్ అణు కార్యక్రమం సహా కీలక అంశాలపై విస్తృత చర్చలకు వీలు కల్పించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది.
హామీలను అమెరికా అమలు చేస్తేనే…: ఇరాన్
ఒప్పందం ‘తుది దశలలో ఉంది’ అని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘై చెప్పారు. అంతకుమించి ఆయన ఇతర వివరాలేవీ వెల్లడించలేదు. ఒప్పందం కుదిరినంత మాత్రాన హార్ముజ్ దానంతట అదే తెరుచుకోదని, ఇచ్చిన హామీలను అమెరికా నెరవేర్చినప్పుడే జలసంధిలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఇరాన్ ఓడరేవులపై విధించిన దిగ్బంధాన్ని ఎత్తివేయాలని, ఇరాన్‌పై విధించిన…ముఖ్యంగా చమురు రంగంపై విధించిన ఆంక్షలను తొలగించాలని, లెబనాన్‌లో సుస్థిరతకు కృషి చేయాలని, అప్పుడే హార్ముజ్ తెరుచుకుంటుందని ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాజెమ్ ఘరీబబాడీ తేల్చి చెప్పారు.
టెహ్రాన్‌కే అనుకూలం
ఇరాన్, ఒమన్ మధ్య కుదురుతున్న ఒప్పందం… హార్ముజ్ జలసంధి మీదుగా గల్ఫ్‌లో ప్రవేశించే నౌకలపై టెహ్రాన్‌కే నియంత్రణను కట్టబెడుతోందని సమాచారం. ఇరాన్‌పై ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయిల్ ప్రారంభించిన యుద్ధం చివరికి టెహ్రాన్‌కు అనుకూలంగా ముగియబోతోందని విశ్వసనీయ వర్గాలు వ్యాఖ్యానించాయి. యుద్ధానికి ముందు ఈ జలసంధిలో అన్ని నౌకలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించాయి. వాటి నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయలేదు. హార్ముజ్‌లో ప్రయాణించే నౌకలు ఇరాన్ జలాల మీదుగానే రాకపోకలు సాగించాల్సి ఉంటుందని టెహ్రాన్ చెబుతోంది. ఇరాన్, ఒమన్ మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ కీలక అంశాలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని, హార్ముజ్‌ను తక్షణమే తెరుస్తారన్న ట్రంప్ ప్రకటన ప్రస్తావనే అందులో లేదని తెలుస్తోంది. హార్ముజ్‌ను ఉపయోగించే నౌకల ధరను బట్టి ఐదు నుంచి ఏడు శాతం రుసుము వసూలు చేయాలని ఇరాన్ భావిస్తోంది.
రెండు అంశాల పైనే దృష్టి
హార్ముజ్‌లో గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న విషయం తెలిసిందే. వాణిజ్య నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సోమవారం కేవలం ఎనిమిది నౌకలు మాత్రమే హార్ముజ్‌ను దాటాయి. అమెరికా-ఇరాన్ యుద్ధానికి ముందు ప్రతి రోజూ సుమారు 130 నౌకలు జలసంధిలో రాకపోకలు సాగించేవి. నౌకాయానానికి చాలా కాలంగా ఎదురవుతున్న అడ్డంకుల కారణంగా చమురు ధరలు పెరగవచ్చునన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కనీసం తాత్కాలిక ఒప్పందమైనా కుదిరేలా చేయడానికి మధ్యవర్తులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. చర్చలు ప్రధానంగా రెండు అంశాలపై సాగాయని తెలుస్తోంది. హార్ముజ్‌పై నియంత్రణ ఎవరికి ఉండాలి, జలసంధిలో ప్రయాణించే వాణిజ్య నౌకల నుంచి రుసుము వసూలు చేసేందుకు ఇరాన్‌ను అనుమతించాలా…ఈ రెండింటి పైనే ప్రధానంగా దృష్టి సారించారు.



