రాష్ట్రానికి ప్రత్యేక బృందాన్ని పంపాలని విజ్ఞప్తి
రైతాంగం నీటి సౌకర్యం చూసుకొని పంటలు వేసుకోవాలి ధరణి అక్రమాలపై ఎస్‌ఈటీ ఏర్పాటు
టెండర్ల కోసం యూనిఫైడ్ విధానం దానికోసం హైలెవల్ కమిటీ నియామకం
మున్సిపల్ కార్పొరేషన్లలో కో ఆప్టెడ్ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్లు
జీపీ నిధులు ఇక స్థానిక బ్యాంకుల్లోనే జమ: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ నిర్ణయాలు పలు అంశాలపై సుదీర్ఘ చర్చ
నవతెలంగాణ-హైదరాబాద్ బ్యూరో
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. పంటల సాగు వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రభావం, తాగు, సాగునీటి ఇబ్బందులు, ఉపాధి కూలీల పరిస్థితులను ఆ లేఖలో సమగ్రంగా వివరించనున్నారు. ఇక్కడి పరిస్థితుల్ని పరిశీలించి, కరువు తీవ్రతను అంచనా వేసేందుకు తక్షణం రాష్ర్టానికి కేంద్రం నుంచి ప్రత్యేక బృందాన్ని పంపాలని కోరారు. అలాగే రాష్ర్టానికి ఎల్‌నినో కంటింజెన్సీ ప్రణాళికల అమలు కోసం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలని మంత్రివర్గం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారంనాడిక్కడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ర్ట సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మంత్రివర్గ నిర్ణయాలను రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావుతో కలిసి మీడియాకు వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో దాదాపు 40 శాతం వర్షపాతం లోటు ఉందని చెప్పారు. తొలి ప్రాధాన్యత తాగునీరు, విద్యుత్‌కు ఇస్తామన్నారు. సాగునీరు, వ్యవసాయం, ఇతర అవసరాల కోసం ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
కమిటీల ఏర్పాటు
కరువు పరిస్థితి అంచనాల కోసం ఉమ్మడి పదిజిల్లాల ప్రాతిపదికగా రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మెన్ జీ చిన్నారెడ్డి నేతృత్వంలో వ్యవసాయ నిపుణులు, అధికారులు, శాస్ర్తవేత్తలతో కలిసి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు అనుకూలమైన పంటలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటలతో పాటు పశువుల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలతో నివేదిక అందించాలని కోరింది. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నందున, అన్ని శాఖలు ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు చేసే ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని మంత్రివర్గం ఆరుతడి పంటలు సాగుచేయండి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల సాగును రైతులు నివారించి, తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు రాష్ర్ట మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది. ఎల్‌నినో ప్రభావంపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని, వర్షాభావ పరిస్థితులు, అందుబాటులో ఉన్న నీటి వనరులు, రైతులు పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు విస్తృతంగా తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం సూచించింది. దానిలో భాగంగా ఈ నెల 20వ తేదీ ఉమ్మడి జిల్లాల వారీగా జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో అక్కడి ప్రజా ప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి జిల్లా ఇన్ ఛార్జీ మంత్రితో పాటు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారికి ఈ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు.
ధరణి అక్రమాలపై ‘సిట్’ ఏర్పాటు
భూముల రికార్డులు, భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణకు ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన 2020 అక్టోబర్ 29 నుంచి రాష్ట్రంలో జరిగిన భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూముల బదలాయింపులు సహా అన్ని అనుమానాస్పద లావాదేవీలను ‘సిట్’ లోతుగా పరిశీలించాలని మంత్రివర్గం పేర్కొంది. ఇప్పటికే చేపట్టిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో దాదాపు 10 వేలకుపైగా అనుమానాస్పద లావాదేవీలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. భూముల లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ రికార్డులు, లాగిన్ వివరాలు, రికార్డుల్లో చేసిన మార్పులు, అధికారుల అనుమతులు, భూముల వర్గీకరణ మార్పులు, లబ్ధిదారుల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని సిట్‌కు దిశానిర్దేశం చేసింది. ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఇన్‌ఫ్రాస్ర్టక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ పాత్రతో పాటు, పోర్టల్ నిర్వహణ సంస్థ ఎంపిక, టెండర్ ప్రక్రియ, వెండర్‌కు కాంట్రాక్టు కేటాయింపు, పోర్టల్ రూపకల్పన, సిస్టమ్ ఆర్కిటెక్చర్, డేటా భద్రతలో ఉన్న లోపాలపై విచారణ జరపాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
టెండర్ల కోసం యూనిఫైడ్ విధానం
ప్రభుత్వం చేపట్టే ఇంజినీరింగ్ పనుల్లో పరిపాలన అనుమతులతో పోలిస్తే అంచనాలు రోజురోజుకు పెరిగి పోతున్నాయని మంత్రివర్గం ఆందోళన వ్యక్తం చేసింది. అంచనా వ్యయానికి, చేస్తున్న ఖర్చుకు మధ్య పొంతన కుదరటం లేదనీ, ఫలితంగా సకాలంలో పనులు పూర్తి కావట్లేదనీ, మంజూరైన అంచనాలు, సవరించిన అంచనాల వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగిపోతున్నదని అభిప్రాయపడింది. అందుకే పనుల అప్రైజల్ నుంచి ప్రాజెక్టు ప్రపోజల్, భూసేకరణ, టెండర్లు, బిల్లుల చెల్లింపు విధివిధానాలన్నింటికీ ఒక యూనిఫైడ్ విధానాన్ని రూపొం దించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్వర్యంలో వీటన్నింటి సమగ్ర సమీక్షకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టుల రూపకల్పన, భూసేకరణ, ల్యాండ్ అసెంబ్లీ, కొనుగోళ్లు, కాంట్రాక్టు నిర్వహణ వరకు అన్ని దశలను పరిశీలించేలా నిర్దిష్ట విధివిధానాలపై ఈ కమిటీ పరిశీలన చేసి, నివేదిక ఇవ్వాలని కోరారు.
కో-ఆప్టెడ్ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్లు
రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు సహా ఇతర ఎన్నికైన సంస్థల్లో ట్రాన్సెజెండర్లను కో-ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేసేందుకు తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం–2019ను సవరించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనివల్ల ట్రాన్స్‌జెండర్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
జీపీ నిధులు ట్రెజరీకి వద్దు
గ్రామపంచాయతీల నిధుల నిర్వహణకు సంబంధించి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గ్రామపంచా యతీలకు అందే నిధులను ట్రెజరీలో జమ చేసే విధానం ఉంది. ఈ నిబంధనను మార్చి సమీపంలో ఉన్న జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో ఈ నిధులను జమ చేసుకునేలా ప్రతిపాదించిన సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లో సవరణను ఆమోదించింది.
రైల్ హబ్ ఏర్పాటు
హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు ప్రతిపాదించిన మూడు హైస్పీడ్ రైల్ కారిడార్ల అలైన్‌మెంట్లు, స్టేషన్ల స్థానాలను ఆర్ అండ్ బీ విభాగం రాష్ట్ర క్యాబినెట్ కు తెలియజేసింది. శంషాబాద్ సమీపంలో రైల్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్–పుణె–ముంబైకి ఒక రూట్, హైదరాబాద్–బెంగుళూరు మరో రూట్, హైదరాబాద్–అమరావతి–తిరుపతి–చెన్నై మరో రూట్ బుల్లెట్ రైళ్లకు కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది.
‘ముక్తేశ్వర్’కు గ్రీన్‌సిగ్నల్
ముక్తేశ్వర్ ఎత్తిపోతల పథకం (చిన్న కాళేశ్వరం) పూర్తి చేసేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గోదావరి నదిపై కన్నెపల్లి నుంచి 4.50 టీఎంసీల నీటిని ఎత్తిపోసి మంథని నియోజకవర్గంలో 45 వేల ఎకరాలకు సాగునీటిని అందించే ఈ పథకాన్ని పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటికే పూర్తయిన పనులను అంచనా వేసుకొని, మిగిలిన పనులకు ఆమోదం తెలిపింది.



