Saturday, July 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబీఆర్ఎస్ సదస్సుకు 
హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

బీఆర్ఎస్ సదస్సుకు 
హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

- Advertisement -

నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలని ఆదేశం
​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 18న నిర్వహించనున్న “యువ సంగ్రామ సదస్సు”కు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. సభను పూర్తిగా శాంతియుతంగా నిర్వహించాలనీ, జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది, రహదారుల దిగ్బంధం లేదా ప్రజలకు అసౌకర్యం కలిగించే పరిస్థితులు తలెత్తకుండా నిర్వాహకులు చూసుకోవాలని ఆదేశించింది. రెచ్చగొట్టే ప్రసంగాలు, విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదనీ, చట్టం-శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు విధించే సహేతుకమైన అన్ని షరతులను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి. మాధవీదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. యువ సంగ్రామ సదస్సుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకే ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు పిటిషన్లో వివరించారు. సభ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వివిధ విద్యార్థి సంఘాల నాయకులు సభకు హాజరయ్యే అవకాశమున్నందున జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే ప్రమాదం ఉందని ప్రభుత్వ న్యాయవాది కోర్డుకు తెలిపారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయని వివరించారు.
ప్రభుత్వ వాదనలను హైకోర్టు అంగీకరించలేదు. ఇంటెలిజెన్స్ నివేదికలు లేదా కొందరు వ్యక్తులపై గతంలో నమోదైన కేసులను ఆధారంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే రాజకీయ సభకు అనుమతి నిరాకరించడం సమంజసం కాదని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రతి పౌరుడికి, ప్రతి రాజకీయ పార్టీకి శాంతియుతంగా సమావేశాలు నిర్వహించే హక్కును కల్పించిందని గుర్తు చేసింది. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు విధించే సహేతుకమైన షరతులను తప్పనిసరిగా పాటించాలని ఆదేశిస్తూ సదస్సు నిర్వహణకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.

జలగం ప్రసాద్ రావుకు ఎదురుదెబ్బ
వ్యక్తిగత భద్రత శాశ్వత హక్కు కాదనీ, పరిస్థితులను బట్టి భద్రత కల్పిస్తారని హైకోర్టు స్పష్టం చేసింది. భద్రత ఉపసంహరణను సవాలు చేస్తూ మాజీ మంత్రి జలగం ప్రసాదరావు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది, క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తి భద్రతను హక్కుగా కొనసాగించాలని కోరలేరని పేర్కొంది. తన తండ్రి ఉమ్మడి ఏపీ సీఎం గా నక్సలైట్ల ఉద్యమానికి వ్యతిరేకంగా, కేంద్ర హోమ్ శాఖ మంత్రిగా పనిచేశారని పిటిషన్‌ ‌దాఖలు చేశారు. నేటికీ నక్సలైట్ల నుంచి ముప్పు ఉందని కోర్టుకు వివరించారు. పిటిషనర్‌ ‌వాదనతో విభేదించిన కోర్టు వ్యాజ్యాన్ని కొట్టి వేసింది.
ఫాక్స్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌ నిర్మాణాలపై చర్యలొద్దు
​ఫాక్స్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని నిర్మాణాలపై ప్రస్తుతం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ, కేసు విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -