ఆడబిడ్డకు అన్యాయం జరిగితే బీఆర్‌ఎస్ అండగా నిలిచింది :కేటీఆర్
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
హైదరాబాద్‌లో నిర్వహించిన ‘నా బూత్-నా భవిష్యత’ కార్యక్రమం
నవతెలంగాణ-వనస్థలిపురం
కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని బర్తరఫ్ చేయాల్సిందేనని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మైనర్ బాలికకు అన్యాయం జరిగిన సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోయినా ఆ తల్లి, కూతురికి న్యాయం జరిగేలా అండగా నిలిచిన ఏకైక పార్టీ బీఆర్‌ఎస్ అని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని వనస్థలిపురం డివిజన్ పరిధిలోని జీఎస్ఆర్ గార్డెన్స్‌లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నా బూత్-నా భవిష్యత్’ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆడబిడ్డకు అన్యాయం జరిగిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా, కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలికిందని విమర్శించారు.
అలాంటి పరిస్థితుల్లో బాధిత కుటుంబానికి బీఆర్‌ఎస్ అండగా నిలిచి కొంత మేర న్యాయం జరిగేలా కృషి చేసిందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేసి అనంతరం విచారణను ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. పార్టీ బలోపేతంలో బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర కీలకమని, ప్రతి కార్యకర్తా శిక్షణ తీసుకుని సమర్థంగా పని చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చివేయడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. 30 నుంచి 40 ఏండ్లుగా నివసిస్తున్న ప్రజల ఇండ్లను కూల్చివేస్తున్నారని, కానీ వారికి ఇండ్లు కట్టించే బాధ్యత మాత్రం తీసుకోవడం లేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రూ.1200 కోట్లతో తెలంగాణలో కిమ్స్ ఆస్పత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. అందులో భాగంగానే ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కొత్తపేటలో మల్టీ స్పెషాలిటీ కిమ్స్ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందన్నారు.
పార్టీ సభ్యత్వాలను మొబైల్ యాప్ ద్వారా నమోదు చేయాలని, ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికే కార్పొరేటర్ టికెట్లు దక్కుతాయని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో రెండున్నర సంవత్సరాల్లో భూముల ధరలు, రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నాయని, మళ్లీ కేసీఆర్ నాయకత్వం వస్తే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్, మహమ్మద్ అలీ, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తలసాని సాయికిరణ్, కమల సుధీర్‌రెడ్డి, గజ్జల సుష్మా మధు సూదన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ జట్టా రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని బర్తరఫ్ చేయాల్సిందే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



