Monday, May 18, 2026
E-PAPER
Homeజాతీయంఈ పర్యటనలు దేశం కోసమేనా?

ఈ పర్యటనలు దేశం కోసమేనా?

- Advertisement -

మోడీతో సంబంధాల వల్ల లబ్ది పొందింది అదానీ గ్రూపే
భారత్ కు దక్కిన ప్రతిఫలం ఏమీలేదు
కొన్ని చోట్ల ప్రతికూల ఫలితాలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే వారం యూరోపియన్ యూనియన్ దేశమైన నార్వేలో పర్యటించబోతున్నారు. నార్వేలో భారత ప్రధాని పర్యటించడం 43 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అవినీతి ఆరోపణల కారణంగా నార్వేకు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్ తన పెట్టుబడుల పరిధి నుంచి అదానీ గ్రీన్ ఎనర్జీని తప్పించింది. మోడీ నార్వే పర్యటనకు ఇది కారణమా అన్న అనుమానాలను అక్కడి పరిస్థితులను గమనిస్తున్న వారు వ్యక్తం చేశారు. అదానీ గ్రూపుపై వచ్చిన అవినీతి ఆరోపణలను అమెరికా ఎత్తివేసిన నేపథ్యంలో ప్రధాని వాటిని తక్కువ చేసి చూపేందుకు ఈ పర్యటనను ఉపయోగించుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం, అదానీ గ్రూప్ పరస్పరం ఎలా సహకరిం చుకుంటున్నాయో సమీక్షించేందుకు ఈ ఉదంతం ఓ అవకాశాన్ని కల్పిస్తోంది. మన దేశంలో రాజకీయాలు, వ్యాపారం ఒక దానితో ఒకటి పెనవేసుకుపోవడం 1991 తర్వాత ఊపందుకుంది. ఆ తర్వాత కొద్ది మంది సంపన్నులు ఈ సంబంధాలకు వ్యక్తిగత రూపాన్ని ఇచ్చారు. వీరిలో అత్యంత విజయవంతమైన వ్యక్తి గౌతమ్ అదానీ. ఆయన కనీసం పాతిక సంవత్సరాలుగా నరేంద్ర మోడీతో సన్నిహిత సంబంధాలను పెంచుకున్నారు. అయితే ఈ సంబంధం విదేశాలలో భారత్‌కు ఏమైనా ఉపయోగపడిందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరాలో…
ప్రధాని నరేంద్ర మోడీ పలు దేశాలో అధికారిక పర్యటనలు జరపడం, ఆ తర్వాత అదానీ గ్రూపు ఆయా దేశాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం తెలిసిందే. ఈ ప్రాజెక్టుల కారణంగా అదానీ గ్రూపు సహజంగానేలబ్ది పొందింది. ఉదాహరణకు 2015 జూన్‌లో మోడీ బంగ్లాదేశ్‌లో పర్యటించారు. విద్యుత్ సరఫరా పొందడంలో ఆ దేశం ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించడానికి సాయం చేస్తానని అప్పటి ప్రధాని షేక్ హసీనాకు ఆయన హామీ ఇచ్చారు. ఆ తర్వాత రెండు నెలలకు అదానీ గ్రూప్, బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డు ఓ ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీని ప్రకారం జార్ఖండ్‌లోని ఓ థర్మల్ ప్లాంటు నుంచి బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా జరుగుతుంది. 2017లో హసీనా మన దేశంలో పర్యటించినప్పుడు ఈ ప్రాజెక్ట్ అమలుకు ఆమోదముద్ర పడింది.

కొలంబో పోర్టు అభివృద్ధిలో…
ఇప్పుడు శ్రీలంక విషయానికి వద్దాం. శ్రీలంకను 60 బిలియన్ డాలర్ల రుణభారం నుంచి బయటపడేసే విషయం గురించి చర్చించడానికి, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం 400 మిలియన్ డాలర్ల రుణ సదుపాయం కోరడానికి ఆ దేశ ప్రధాని మహింద్ర రాజపక్సే 2020 ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో మోడీతో సమావేశమయ్యారు. కొలంబో పోర్టును అభివృద్ధి చేయాల్సిందిగా శ్రీలంక ప్రభుత్వం అదానీ గ్రూపును కోరింది. శ్రీలంక ఓడరేవుల అథారిటీతో (ఎస్ఎల్ఏపీ) ఒప్పందాన్ని ఖరారు చేయడానికి అదానీ 2021 అక్టోబరులో అధ్యక్షుడు గొటబాయ్ రాజపక్సే, ప్రధాని మహింద్ర రాజపక్సేలను కలిశారు.

నేపాల్ విమానాశ్రయాల నిర్మాణంలో…
నేపాల్ విషయానికి వస్తే పొఖారా, భైరాహవా విమానాశ్రయాలను చైనా నిర్మించడంపై భారత ప్రభుత్వం కాట్మండులోని అధికారుల వద్ద ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాక ఆయా విమానాశ్రయాలకు వెళ్లే విమానాలు తక్కువ ఎత్తులో ప్రయాణించడంపై ప్రభుత్వం నిషేధించినట్లు తెలిసింది. ఏదేమైనా విమానాశ్రయాల నిర్మాణం ఆగిపోయింది. విమానాశ్రయాల నిర్వహణను అదానీకి అప్పగిస్తేనే పరిస్థితి చక్కబడుతుందని ఓ నేపాలీ వార్తా పత్రిక రాయడం ఈ సందర్భంగా గమనార్హం. 2023 జూన్‌లో భారత్, నేపాల్ ప్రభుత్వాల మధ్య దీనిపై చర్చలు జరిగాయి. 2024 జనవరిలో నేపాల్ ఆర్థిక మంత్రి గుజరాత్ వచ్చి అదానీ గ్రూపుతో చర్చించారు. ఈ చర్చల ఫలితంగా ఆ రెండు విమానాశ్రయాలతో పాటు భారత్`నేపాల్ సరిహద్దులో ఉన్న బారా ఎయిర్‌పోర్టును కూడా అదానీ గ్రూప్ చేపట్టాలని నిర్ణయించారు.

తూర్పు ఆఫ్రికాలో కూడా…
తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో కూడా అదానీ గ్రూపు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేసింది. 2015లో టాంజానియాలోని బగమోయోలో ఓడరేవును నిర్మించాలని చైనా ప్రతిపాదించగా మోడీ, అదానీ వ్యతిరేకించారు. 2016లో మోడీ దార్ ఏ సలామ్‌లో పర్యటించారు. 2019లో చైనీయులు బగమోయో ప్రాజెక్టు నుంచి వైదొలిగారు. 2023లో టాంజానియా అధ్యక్షురాలు సమీయా సులుహు హసన్ మన దేశంలో పర్యటించారు. 2024 మేలో డార్ ఏ సలామ్ ఓడరేవులోని ఓ టెర్మినల్ నిర్వహణ కోసం టాంజానియా అధికారులతో అదానీ గ్రూప్ 30 సంవత్సరాల రాయితీ ఒప్పందంపై సంతకం చేసింది. కెన్యాలో కూడా ఇలాగే జరిగింది. 2023 డిసెంబర్ ఐదవ తేదీన మోడీతో కెన్యా అధ్యక్షుడు విలియం రూటో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా అదానీని మోడీ ఆయనకు పరిచయం చేశారు. ఆ మరుసటి సంవత్సరమే నైరోబీ విమానాశ్రయాన్ని ఆధునీయకరిస్తానని కెన్యాకు అదానీ ప్రతిపాదించారు. ఆ తర్వాత కెన్యా ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించి అదానీకి ఆ కాంట్రాక్టును అప్పగించింది.

గ్రీస్ ఓడరేవులలో అదానీ వాటాలు
భారత్‘మధ్యప్రాచ్యం‘యూరప్ కారిడార్‌లో ఐరోపాకు ముఖద్వారాలలో ఒకటిగా ఉన్న గ్రీస్‌లో పాగా వేయడానికి భారత ప్రభుత్వం అదానీ గ్రూపుపై ఆధారపడే అవకాశం ఉంది. 2023 ఆగస్టులో మోడీ గ్రీసులో పర్యటించారు. ఆ దేశంలోని ఓడరేవులలో వాటాలు కొనుగోలు చేయాలన్న అదానీ గ్రూప్ ప్రణాళికలు ఈ సందర్భంగా గ్రీస్ ప్రధానితో మోడీ జరిపిన సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి.

ఇజ్రాయిల్‌తో సంబంధాలు బలోపేతం
ఇజ్రాయిల్‌తో భారత్ సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో కూడా అదానీ గ్రూపు ప్రయోజనాలే కనిపిస్తాయి. 2017లో మోడీ టెల్ అవీవ్‌లో పర్యటించినప్పుడు ద్వైపాక్షిక సంబంధాలు కొత్త మలుపు తీసుకున్నాయి. 2018లోఇజ్రాయిల్‌తో సంబంధాలు బలోపేతం అదానీ గ్రూప్, ఇజ్రాయిల్ ఆయుధ తయారీ సంస్థ ఎల్బిట్ సిస్టమ్స్ కలిసి హెర్మెస్ 900 యూఏవీ అనే డ్రోన్‌ను ఉత్పత్తి చేయడానికి ఉమ్మడి భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ డ్రోన్లను 2022 తర్వాత గాజాలో ఉపయోగించారు. 2022 జూన్‌లో హైఫా పోర్ట్ ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రారంభించిన ఇజ్రాయిల్ ప్రభుత్వం…70 శాతం వాటాతో అదానీ గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం కాంట్రాక్టును దక్కించుకున్నదని ప్రకటించింది. 2024 సెప్టెంబరులో అదానీ గ్రూప్, ఇజ్రాయిల్‌కు చెందిన టవర్ సెమీకండక్టర్ గ్రూప్ కలిసి సెమీకండక్టర్ల ఉత్పత్తిలో ఉపయోగించే విడిభాగాల తయారీకి ఉమ్మడి భాగస్వామ్యాన్ని నెలకొల్పుకున్నాయి. సెమీకండక్టర్ల ఉత్పత్తికి మోడీ ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే.

అవినీతి ఆరోపణలతో ఒప్పందాలు రద్దు
మోడీ ప్రభుత్వానికి, అదానీ గ్రూపునకు మధ్య నెలకొన్న సహకారం ఇజ్రాయిల్ వంటి కొన్ని దేశాలతో భారత్ సంబంధాల బలోపేతానికి దోహదపడింది. అయితే కొన్ని సందర్భాలలో మిశ్రమ ఫలితాలు రాగా మరికొన్ని చోట్ల ప్రతికూల ఫలితాలు కూడా వచ్చాయి. అదానీ గ్రూపుపై వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగా అనేక ప్రభుత్వాలు దానితో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. శ్రీలంకలో రాజపక్స స్థానంలో అధ్యక్షుడిగా ఎన్నికైన దిశనాయకే అదానీ గ్రూపుతో అంతకుముందు కుదుర్చు కున్న ఒప్పందాన్ని రద్దు చేశారు. విండ్ టర్బైన్ల ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తుకు అధిక ధర వసూలు చేయాలన్న అదానీ గ్రూప్ ప్రణాళికను సవాలు చేస్తూ శ్రీలంక కోర్టులో పిటిషన్ దాఖలైంది. బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వ పతనం తర్వాత ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం కూడా అదానీ గ్రూపుతో గతంలో కుదుర్చుకున్న కాంట్రాక్టును రద్దు చేసుకుంది. కెన్యాతో అదానీ గ్రూప్ కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ రద్దయ్యాయి. ఆస్ట్రేలియాతో అదానీ గ్రూప్ కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా భారత్‌కు అపార నష్టం వాటిల్లింది. ఏదేమైనా మోడీ ప్రభుత్వంతో సంబంధాల కారణంగా అదానీ గ్రూపు లాభపడిందే తప్ప దానితో సంబంధాలతో భారత్‌కు ఒరిగిందేమీ లేదనే చెప్పాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -