ఫైనల్లో సాత్విక్ జోడీ ఓటమిథాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 300
బ్యాంకాక్ (థాయ్‌లాండ్) : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీకి మళ్లీ నిరాశే ఎదురైంది. చివరగా 2024 థాయ్‌లాండ్ ఓపెన్‌లో టైటిల్ సాధించిన వరల్డ్ నం.4 జోడీ.. రెండేండ్లుగా తొలి టైటిల్ కోసం నిరీక్షిస్తోంది. ఆదివారం జరిగిన థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 300 టోర్నమెంట్ పురుషుల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సాత్విక్, చిరాగ్‌లు వరుస గేముల్లో ఓటమి చెందారు. 52 నిమిషాల్లో ముగిసిన టైటిల్ పోరులో 12-21, 22-24తో సాత్విక్, చిరాగ్‌లు నిరాశపరిచారు. ఫైనల్ మ్యాచ్‌కు వినియోగించిన షటిల్ స్పీడ్‌ను కాస్త అధికంగా ఉండటంతో సాత్విక్, చిరాగ్‌లు ఇబ్బంది పడ్డారు. ఫలితంగా తొలి గేమ్‌లో ఆశించిన పోటీ ఇవ్వలేదు. రెండో గేమ్ ట్రైబేకర్‌కు దారితీసినా.. 22-24తో నిరాశే మిగిలింది. ఇండోనేషియా షట్లర్లు డానియెల్ మార్టిన్, లియో రొలీ కార్నాండోలు గతంలో ఐదు సార్లు సాత్విక్, చిరాగ్‌తో తలపడినా.. భారత జోడీపై పైచేయి సాధించటం ఇదే ప్రథమం. ‘ఫైనల్ మ్యాచ్ మినహా, థాయ్‌లాండ్ ఓపెన్‌లో ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నాం. గాయాల నుంచి పూర్తిగా కోలుకోవటంతో ఇప్పడు మానసికంగానే మెరుగవ్వాల్సి ఉంది. టోర్నమెంట్‌లో వినియోగించిన షటిల్స్‌తో పోల్చితే ఫైనల్లో వాడినవి వేగంగా ఉన్నయి. ఆ స్పీడ్‌ను అడ్జస్ట్ అయ్యేందుకు ఇబ్బంది పడ్డాం. ఈ ఏడాదిని మెరుగ్గా ఆరంభించలేదు. కానీ థామస్ కప్ మెడల్ తర్వాత మా ఆటపై ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని సాత్విక్ అన్నాడు.



