ఫైనల్లో కొకొ గాఫ్‌కు భంగపాటు
ఇటాలియన్ ఓపెన్ 2026
రోమ్ (ఇటలీ) : ఉక్రెయిన్ అమ్మాయి ఎలినా స్విటోలినా ఇటాలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచింది. డబ్ల్యూటీఏ 1000 టోర్నమెంట్‌లో మూడో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా)పై మూడు సెట్ల సమరంలో పైచేయి సాధించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో కొకొ గాఫ్‌పై 6-4, 6-7(3-7), 6-2తో ఎలినా స్విటోలినా గెలుపొందింది. రెండు ఏస్‌లు, రెండు డబుల్ ఫాల్ట్స్ చేసిన స్విటోలినా.. ఆరు బ్రేక్ పాయింట్లతో గాఫ్‌ను చిత్తు చేసింది. తొలి సెట్లో సర్వ్ కోల్పోయి వెనుకంజ వేసిన గాఫ్.. రెండో సెట్‌ను ట్రైబేకర్‌లో గెల్చుకుంది. కానీ నిర్ణయాత్మక మూడో సెట్లో స్విటోలినాకు బ్రేక్ పాయింట్లు కోల్పోయి టైటిల్‌ను చేజార్చుకుంది. 3 బ్రేక్ పాయింట్లు సాధించిన గాఫ్..ఓ ఏస్ సంధించింది. పాయింట్ల పరంగా 127-115తో గాఫ్‌పై స్విటోలినా పైచేయి సాధించి, 18 గేములు గెల్చుకుని స్విటోలినా ఆధిపత్యం చెలాయించింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ మార్సెల్ (స్పెయిన్), జెబాలోస్ (అర్జెంటీనా)లపై ఏడో సీడ్ సిమోనె బొలెలి, ఆండ్రీవ వావసోరి (ఇటలీ) 7-6(10-8), 6-7(3-7), 10-3తో హోరాహోరీ మ్యాచ్‌లో గెలుపొంది టైటిల్ సాధించారు. మహిళల డబుల్స్ ఫైనల్లో రష్యా అమ్మాయిలు డయనా, అండ్రీవ జోడీ 6-3, 6-3తో క్రిస్టినా, నికోలెపై వరుస సెట్లలో విజయం సాధించి విజేతలుగా నిలిచారు.



