Tuesday, May 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్, నార్వే మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం

భారత్, నార్వే మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం

- Advertisement -

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 
నార్వే అండగా నిలిచింది: ప్రధాని మోడీ
ఇంజినీరింగ్ విభాగాల్లోనూ 
ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు

ఓస్లో: అత్యంత క్లిష్టసమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, భారతదేశానికి, నార్వే అండగా నిలిచి, తన నిజమైన స్నేహాన్ని చాటుకుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. సోమవారం నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన తరువాత, ప్రధాని మోడీ పలు కీలక అంశాలపై మాట్లాడారు. సైనిక ఘర్షణల ద్వారా మాత్రమే శాశ్వత శాంతిని సాధించలేమని ప్రధాని మోడీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభాన్ని, ఉక్రెయిన్ వివాదాన్ని చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.”భారత్, నార్వే రెండూ కూడా నియమ, నిబంధనలతో కూడిన ప్రపంచ వ్యవస్థను, చర్చలను, దౌత్యాన్ని విశ్వసిస్తాయి. కేవలం సైనిక ఘర్షణ ద్వారా మాత్రమే ఏ సమస్యనూ పరిష్కరించలేమని మేము ఇద్దరం భావిస్తున్నాం. ఉక్రెయిన్, పశ్చిమాసియా ఘర్షణలు వీలైనంత త్వరగా ముగియడానికి, శాంతి స్థాపన కోసం జరిగే ప్రతి ప్రయత్నానికి మేము మా మద్దతును ఇస్తాం.” అని మోడీ చెప్పారు.

అంతర్జాతీయ సంస్థలను సంస్కరించాలి
నాలుగు ఐరోపా దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్ నుంచి నార్వే రాజధాని ఓస్లో చేరుకున్న కొద్ది గంటల్లోనే మోడీ, ఆ దేశ ప్రధాని స్టోర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, అంతర్జాతీయ సంస్థలను సంస్కరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. “పెరుగుతున్న ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సంస్థలలో సంస్కరణలు తీసుకురావడం అత్యవసరం. ఈ విషయంలో నేను, నార్వే ప్రధాని ఏకాభిప్రాయంతో ఉన్నాం. అంతేకాదు ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాల్లోనూ సమూలంగా నిర్మూలించడం మన ఉమ్మడి బాధ్యత” అని ఆయన స్పష్టం చేశారు.

నిజమైన స్నేహం
గతేడాది పహల్గాంలో హిందూ పురుషులే లక్ష్యంగా జరిగిన పాక్ ప్రేరిపిత ఉగ్రదాడిలో, భారత్కు చెందిన 26 మంది పౌరులు మరణించారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన ప్రధాని మోడీ, ఆ క్లిష్ట సమయంలో భారత్కు నార్వే అందించిన మద్దతును కొనియాడారు. “నేను గత ఏడాదే నార్వేలో పర్యటించాల్సి ఉంది. కానీ పహల్గాం ఉగ్రదాడి కారణంగా ఆ పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఆ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నార్వే, భారతదేశానికి అండగా నిలబడి, నిజమైన స్నేహాన్ని చాటుకుంది. ఈ రోజు నేను నార్వేను సందర్శిస్తున్న తరుణంలో, వారు చూపిన సంఘీభావానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.” అని మోడీ తెలిపారు.

ఇంజినీరింగ్ విభాగాల్లో కీలక ఒప్పందాలు
ఇటీవల భారత్‌, ఈయూ మధ్య చారిత్రక ఒప్పందం జరిగిందని, దీని వల్ల భారత్, నార్వేలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆయన అన్నారు. “భారత్, నార్వే మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. నార్వే నుంచి సాంకేతికత, పెట్టుబడులు భారత్కు వస్తున్నాయి. అలాగే వివిధ రంగాల్లో పరిశోధనల కోసం నార్వే నుంచి మేము సాయం తీసుకుంటాం. ఇంజినీరింగ్ విభాగాల్లోనూ ఇరుదేశాల మధ్య అనేక ఒప్పందాలు జరిగాయి. ఇస్రో, నార్వే స్పేస్ ఏజెన్సీల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక ఇరుదేశాల మధ్య ఉన్న గ్రీన్ స్ట్రేటజీ వల్ల ప్రపంచ దేశాలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మారిటైమ్ భద్రత విషయంలోనూ మేము నార్వేతో కలిసి పనిచేస్తున్నాం” అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -