ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టిన ఆరెంజ్ ఆర్మీ
సూపర్‌కింగ్స్‌పై 5 వికెట్లతో ఘన విజయం
చెన్నై 180/7, హైదరాబాద్ 181/5
సన్‌రైజర్స్ చిందేసింది. ఇషాన్ కిషన్ (70), హెన్రిచ్ క్లాసెన్ (47) ఛేదనలో చెలరేగటంతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్లతో ఘన విజయం సాధించింది. చెపాక్‌లో సూపర్ విక్టరీతో దర్జాగా ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న సన్‌రైజర్స్.. తనతోపాటు గుజరాత్ టైటాన్స్ బెర్త్‌ను సైతం ఖరారు చేసింది. సొంతగడ్డపై కీలక మ్యాచ్‌లో తడబడిన సూపర్‌కింగ్స్ ఏడో ఓటమితో ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్ర్కమించినట్టే!.
నవతెలంగాణ-చెన్నై
చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆరెంజ్ ఆర్మీ అదిరే పంచ్ ఇచ్చింది. ప్లే ఆఫ్స్‌లో రేసులో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో సూపర్‌కింగ్స్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇషాన్ కిషన్ (70, 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), హెన్రిచ్ క్లాసెన్ (47, 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. మూడో వికెట్‌కు ఇషాన్, క్లాసెన్ 75 పరుగులు జోడించి సన్‌రైజర్స్ విజయానికి బాటలు వేశారు. మరో ఆరు బంతులు ఉండగానే లాంఛనం ముగించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ సీజన్లో ఎనిమిదో విజయంతో ప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశించింది. అంతకముందు, తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 180 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (44, 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), కార్తీక్ శర్మ (32, 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ (3/28) మూడు వికెట్ల ప్రదర్శనతో సూపర్‌కింగ్స్‌ను కట్టడి చేశాడు. ఛేదనలో అర్థ సెంచరీతో మెరిసిన ఇషాన్ కిషన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
ఇ‘షాన్‌దార్’ షో
181 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ట్రావిశ్ హెడ్ (6) నిరాశపరచగా.. అభిషేక్ శర్మ (26, 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) తనదైన ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఓపెనర్ల నిష్ర్కమణతో జతకట్టిన ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్‌లు మ్యాచ్‌ను సూపర్‌కింగ్స్ నుంచి లాగేసుకున్నారు. 41 బంతుల్లో 75 పరుగులు జోడించి సన్‌రైజర్స్‌ను ముందంజలో నిలిపారు. కిషన్ నెమ్మదిగా ఆడినా.. క్లాసెన్ దంచికొట్టాడు. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. క్లాసెన్‌ను సంజు కండ్లుచెదిరే స్టంప్‌తో వెనక్కి పంపినా.. కిషన్ మెరుపులతో హైదరాబాద్ ముందంజ వేసింది. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన కిషన్.. సలీల్ అరోరా (11 నాటౌట్) తోడుగా గెలుపు తీరాలకు చేర్చాడు. అభిషేక్ శర్మతో కలిసి 38 పరుగులు, నితీశ్ కుమార్ (11)తో కలిసి 22 పరుగులు, సలీల్ అరోరాతో కలిసి 22 పరుగులు జోడించిన ఇషాన్ కిషన్.. అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కిషన్ అవుటైనా.. రవిచంద్రన్ స్మరణ్ (5 నాటౌట్), సలీల్ లాంఛనం ముగించారు. 19 ఓవర్లలోనే 5 వికెట్లకు 181 పరుగులు చేసిన సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సూపర్‌కింగ్స్ బౌలర్లలో ముకేశ్ చౌదరి (2/36), అన్షుల్ కాంబోజ్ (1/46), అకీల్ హుస్సేన్ (1/21) వికెట్లు పడగొట్టారు.
మెరిసిన బౌలర్లు
సొంతగడ్డపై టాస్ నెగ్గిన చెన్నై సూపర్‌కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు సంజు శాంసన్ (27, 13 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), రుతురాజ్ గైక్వాడ్ (15, 21 బంతుల్లో) అదిరే ఆరంభం అందించారు. శాంసన ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో దండెత్తాడు. ఆ తర్వాత ఉర్విల్ పటేల్ (13) వస్తూనే రెండు సిక్సర్లతో హడలెత్తించాడు. ఈ ఇద్దరి నిష్ర్కమించినా.. కార్తీక్ శర్మ (32, 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), డెవాల్డ్ బ్రెవిస్ (44) జోరు కొనసాగించారు. బ్యాటర్లు ఎదురుదాడి చేయటంతో ఓ దశలో సూపర్‌కింగ్స్ 200 ప్లస్ పరుగులు చేస్తుందని అనుకున్నారు. కానీ క్రమంగా వికెట్లు పడగొట్టిన సన్‌రైజర్స్ బౌలర్లు.. సూపర్‌కింగ్స్‌ను స్వల్ప స్కోరుకు కట్టడి చేశారు. పాట్ కమిన్స్ మూడు వికెట్లతో మెరువగా.. సకిబ్ హుస్సేన్ (2/34) రెండు వికెట్లు పడగొట్టాడు. శివం దూబె (26, 23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి నిరాశపరిచాడు. ప్రశాంత్ వీర్ (11) 9 బంతుల్లో రెండు ఫోర్లతో సూపర్‌కింగ్స్ స్కోరును 180 మార్క్‌కు చేర్చాడు. సూపర్‌కింగ్స్ బ్యాటర్లు ఎదురుదాడి చేసినా.. ఎటాకింగ్ బౌలింగ్‌తో వికెట్లు పడగొట్టిన సన్‌రైజర్స్ బౌలర్లు ఆకట్టుకున్నారు.
సంక్షిప్త స్కోరు వివరాలు :
చెన్నై సూపర్‌కింగ్స్ : 180/8 (డెవాల్డ్ బ్రెవిస్ 44, కార్తీక్ శర్మ 32, సంజు శాంసన్ 27, పాట్ కమిన్స్ 3/28, సకిబ్ హుస్సేన్ 2/34)
సన్‌రైజర్స్ హైదరాబాద్ : 181/5 (ఇషాన్ కిషన్ 70, హెన్రిచ్ క్లాసెన్ 47, అభిషేక్ శర్మ 26, ముకేశ్ చౌదరి 2/36)
సన్‌రైజర్స్ రైట్ రైట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



