బీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల ముష్టియుద్ధం
పోలీసుల లాఠీచార్జ్!..కేటీఆర్, బండి సంజయ్ కు వ్యతిరేకంగా పోటాపోటీ ధర్నాలు, నినాదాలు
చెప్పులతో దాడి- ముఖ్య నేతల బాహాబాహీ..రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ
ఇరు గ్రూపులను చెదరగొట్టి, భారీగా అరెస్టులు
నవతెలంగాణ – రాజన్నసిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సోమవారం రాజకీయ రణరంగంగా మారింది. బీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఒకే ప్రాంతంలో ఇరు పార్టీల వారు పోటాపోటీగా నిరసనలకు దిగడమే కాకుండా, పరస్పరం దాడులు, చెప్పుల విసురుకోవడాల వరకూ వెళ్లారు. దాంతో సిరిసిల్ల పాత బస్టాండ్ పరిసరాలు గందరగోళంగా మారాయి. పరిస్థితి అదుపు తప్పడంతో జిల్లా ఎస్పీ, డీఎస్పీ రంగంలోకి దిగి+ లాఠీచార్జి చేసి ఇరు గ్రూపులను చెదరగొట్టారు. బాలిక అంశంలో బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో, కేంద్ర మంత్రి బండి సంజయ్ ను తక్షణమే మంత్రివర్గం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలపడానికి పోలీసుల అనుమతి తీసుకున్నారు. అనంతరం పాత బస్టాండ్ ప్రాంతంలోని నేతన్న చౌక్ వద్ద బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులతో ధర్నాకు దిగారు. బండి సంజయ్ రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ప్రభుత్వం ఆయన్ను బర్తరఫ్ చేయాలని, బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి
కౌంటర్‌గా.. గతంలో
22 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన కేటీఆర్‌ను శిక్షించాలని, గ్లోబరీనా సంస్థపై ‘సిట్’ ఏర్పాటు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు సైతం అదే సమయంలో నేతన్న చౌక్‌కు చేరుకుని ధర్నాకు ఉపక్రమించాయి.
నేతన్న చౌక్ వద్ద ఉద్రిక్తత.. చెప్పుల వర్షం
ఒకే వేదిక (నేతన్న చౌక్) సమీపంలో ఇరుపార్టీల శ్రేణులు భారీగా మోహరించడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్‌ఎస్ శ్రేణులు ‘బండి సంజరు డౌన్ డౌన్’ అంటూ, బీజేపీ శ్రేణులు ‘కేటీఆర్ డౌన్ డౌన్’ అంటూ ఎదురెదురుగా నిలబడి గొంతు చించుకున్నారు. ఈ క్రమంలో ఇరు గ్రూపుల మధ్య మాటామాటా పెరిగి, పరస్పర దాడులకు దారితీసింది. నేతలు, కార్యకర్తలు బాహాబాహీకి దిగి ముష్టియుద్ధం చేసుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకోవడంతో నేతన్న చౌక్ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి.
రంగంలోకి పోలీస్ బాస్.. లాఠీచార్జి, అరెస్టులు
జిల్లా ఎస్పీ మహేష్ బిగితే, సిరిసిల్ల డీఎస్‌పీ నాగేంద్రచారి అదనపు బలగాలతో రంగప్రవేశం చేశారు. ఘర్షణ పడుతున్న ఇరు పార్టీల వారిని వారించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. మొదట బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం బీఆర్‌ఎస్ నేతలు కలెక్టరేట్ సమీపంలో బండి సంజరు భారీ ఫ్లెక్సీతో మరోసారి ధర్నాకు దిగారు. అక్కడ కూడా ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన బీఆర్‌ఎస్ నాయకుల్లో నాఫ్స్‌క్యాబ్ చైర్మెన్ కొండూరి రవీందర్ రావు, సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డిబోయిన గోపి, పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్‌తోపాటు పలువురు ముఖ్య నాయకులు అరెస్టయ్యారు. ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.



