భారీగా లోడింగ్ వాహనాల క్యూ
హన్మకొండ-పరకాల రహదారిపై వాహనాల రద్దీ
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం, మక్కల అన్‌లోడింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోంది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొత్తగట్టు సింగారంలో ఉన్న శ్రీ శ్రీనివాస్ ఇండస్ట్రిస్ ముందు ధాన్యం లోడింగ్ వాహనాలు వందల సంఖ్యలో ‘క్యూ’ కట్టడం గమనార్హం. సోమవారం ‘నవతెలంగాణ’ కొత్తగట్టు సింగారంలోని శ్రీ శ్రీనివాస్ ఇండస్ట్రీస్‌ను సందర్శించింది. హమాలీలు వాహనాల్లోని ధాన్యం బస్తాలను సకాలంలో అన్‌లోడింగ్ చేయడం సాధ్యం కావడం లేదు. పరకాల, నడికూడ మండలాలల్లోని పలు సొసైటీలు, ఐకేపీ కొనుగోలు కేంద్రాల నుంచి పెద్ద ఎత్తున ధాన్యంతో కూడిన వందల వాహనాలు కొత్తగట్టు సింగారంలోని శ్రీ శ్రీనివాస ఇండస్ట్రీస్ వద్ద ‘క్యూ’ కట్టడం హమాలీల కొరతకు నిదర్శనంగా నిలిచింది. స్థానిక హమాలీలతోపాటు బీహార్ హమాలీలను ఏర్పాటు చేసినా త్వరితగతిన అన్‌లోడింగ్ చేయడం సాధ్యపడటం లేదు. ‘‘కాంటా కాగానే మేమే ఖర్చు పెట్టుకొని ట్రాక్టర్‌లో లోడింగ్ చేయించుకొని మిల్లుకు తీసుకొచ్చామని, గూడెప్పాడ్ కొనుగోలు కేంద్రం నుంచి ఇక్కడకు తీసుకొచ్చేందుకు రూ.1000 వాహన యజమాని తీసుకున్నడు’’ అని యాకయ్య అనే రైతు ‘నవతెలంగాణ’కు తెలిపారు. రైతులే స్వయంగా వాహనాలను సమకూర్చుకొని కాంటా పెట్టగానే సొంత ఖర్చులతో మిల్లులకు తరలించడం నిత్యకృత్యంగా మారింది. ఒకవైపు గన్నీ సంచుల కొరతతో సంచులను రైతులే స్వయంగా కొంటున్నారు. మరోవైపు వాహనాలు అందుబాటులో లేకపోవడం, స్వయంగా రైతులే ఖర్చు పెట్టుకొని ధాన్యాన్ని మిల్లులకు తరలించడం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో ధాన్యం రైతులు తీవ్ర ఇబ్బందులను, వ్యయప్రయాసాలను ఎదుర్కొంటున్నారు.
రహదారులపైనే ధాన్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



