Tuesday, May 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరేపు మెడికల్ షాపుల బంద్

రేపు మెడికల్ షాపుల బంద్

- Advertisement -

ఆన్‌లైన్ మెడిసిన్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసన
జీవో 220(ఈ) రద్దు, జీవో 817 (ఈ)ని సవరించాలని డిమాండ్
రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కానున్న 45వేల మెడికల్ షాపులు
ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే నిరవధిక ఆందోళన

నవతెలంగాణ -సిటీబ్యూరో
అఖిల భారత ఔషధ వ్యాపారుల సంఘం పిలుపు మేరకు దేశవ్యాప్తంగా రేపు మెడికల్ షాపులు బంద్ పాటించనున్నాయి. ఆన్‌లైన్ మందుల విక్రయాలకు నిరసనగా ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) పిలుపు మేరకు తెలంగాణలోని సుమారు 45వేల మెడికల్ షాపులు ఒక్క రోజు బంద్‌లో పాల్గొననున్నాయి. ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్న ఎమర్జెన్సీ ఫార్మసీలు మాత్రం తెరిచి ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అత్యవసర మందులను వినియోగదారులు ముందుగానే కోనుగోలు చేసుకోవాలని తెలంగాణ కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కోరింది.

ఆన్‌లైన్ ఫార్మసీ నియంత్రణకు డిమాండ్
మెడికల్ షాపులతోపాటు కొన్ని ఔషధ సరఫరా సంస్థలు కూడా ఈ బంద్‌లో పాలుపంచుకోనున్నాయి. పెద్ద కార్పొరేట్ కంపెనీల అండదండలతో నడుస్తున్న ఆన్‌లైన్ ఫార్మసీలు భారీ డిస్కౌంట్లు ఇస్తూ సంప్రదాయ మెడికల్ షాపులకు నష్టం కలిగిస్తున్నాయని కెమిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఫార్మసీలు ఈ పోటీని తట్టుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని, ఆన్‌లైన్ ఫార్మసీని నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్‌లైన్ కంపెనీలు తక్కువ ధరలకు మందులను అమ్మడం వల్ల స్థానిక వ్యాపారులు నష్టపోతున్నారని ఆరోపిస్తు న్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు మిస్ యూజ్ అవుతున్నాయని, డ్రగ్స్ కూడా విచ్చవిలవిడిగా ఆన్‌లైన్‌లో విక్రయాలు అవుతున్నాయరని ఆరోపించారు. కార్పొరేట్ సెక్టార్లు ఇస్తున్న డిస్కౌంట్లను నియంత్రించాలని, ధరల నియంత్రణలో నిబంధనలు పాటించ కుండా నేషనల్ ప్రైజ్ అథారిటీ ప్రకారం విక్రయాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

టీటీసీడీఏ సంపూర్ణ మద్దతు
రేపటి బంద్ కు తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ (టీటీసీడీఏ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్స్ ద్వారా ఎలాంటి భౌతిక తనిఖీల్లేకుండా మందులను విక్రయించడం వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఒకే ప్రిస్క్రిప్షన్‌ను పలుమార్లు ఉపయోగించి మందులు పొందే అవకాశం ఉండటంతో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కార్పొరేట్ సంస్థలు భారీ డిస్కౌంట్లతో మందులను విక్రయిస్తూ మార్కెట్ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని, దీనివల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సేవలందిస్తున్న చిన్న మెడికల్ షాపుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని టీటీసీడీఏ ఆవేదన వ్యక్తం చేసింది. కోవిడ్ సమయంలో అత్యవసర పరిస్థితుల కోసం జారీ చేసిన జీవో 220(ఈ)ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, ఈ-ఫార్మసీల జీవో 817 (ఈ)ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఆన్‌లైన్ విక్రయాలపై ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురాకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని అసోసియేషన్ హెచ్చరించింది. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఆన్‌లైన్ మందుల అమ్మకాలు, కార్పొరేట్ చైన్ ఫార్మసీలు ఇస్తున్న భారీ డిస్కౌంట్లతో సాధారణ రిటైల్, ల్‌సేల్ కెమిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది చిన్న, మధ్య తరహా వ్యాపారులు నిలదొక్కుకోవడం కష్టంగా మారిందని తెలిపింది. ఈ బంద్ సమయంలో అత్యవసర మందుల కొరత లేకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర మందులను ముందే కొనిపెట్టుకోవాలని టీటీసీడీఏ విజ్ఞప్తి చేసింది.

ప్రధాన డిమాండ్లు ఇలా..
1.కార్పొరేట్ సంస్థల అనైతిక డిస్కౌంట్లను ఆరికట్టేందుకు ‘లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ’ విధానాన్ని అమలు చేయాలి.
2.ఫార్మా రంగంలో పారదర్శకత, నైతిక వ్యాపార ప్రమాణాలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలి
3.ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫారంల ద్వారా జరిగే అక్రమ మందుల అమ్మకాలను పూర్తిగా నిరోధించి, నకిలీ నాణ్యత లేని మందుల సరఫరాను అడ్డుకోవాలి
4.ఆన్‌లైన్, చైన్ ఫార్మసీల అనైతిక డిస్కౌంట్ విధానాలపై నియంత్రణ తీసుకురావాలి.
5.చిన్న తరహా రిటైల్ వ్యాపారుల మనుగడను కాపాడేలా ట్రేడ్ మార్జిన్లను రక్షించాలి

ఇది కేవలం వ్యాపార సమస్య కాదు
అరుగొండ శ్రీధర్‌గుప్తా, అధ్యక్ష‍ులు, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, హైదరాబాద్ జిల్లా ఇది కేవలం వ్యాపార సమస్య కాదు. ఆరోగ్య భద్రతకు సంబంధించిన విషయం కూడా. ప్రభుత్వం ఈ డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ప్రజారోగ్య పరిరక్ష దృష్ట్యా మేం నిరవధిక ఆందోళనకు దిగాల్సి వస్తుంది. అక్రమ ఈ`ఫార్మసీలు ప్రజారో గ్యానికి ముప్పు. ఏఐ ఆధారిత నకిలీ ప్రిస్క్రిప్షన్ల ద్వారా యంటీబయోటిక్స్, అలవాటు చేసే మందులు నియంత్రణ లేకుండా అందుబాటులోకి రావడం వల్ల యాంటీమై క్రరోబియల్ రెసిస్టన్స్ (ఏఎంఆర్) వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ బంద్ కు మెడ్‌ప్లస్, అపోలో ఫార్మసీ, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -