ఎట్టకేలకు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం
చమురు కంపెనీలకు తడిసిమోపెడవుతున్న వైనం
న్యూఢిల్లీ : ఇథనాల్ కంటే పెట్రోల్ చౌకగా లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. దేశంలో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచడం వల్ల దిగుమతి బిల్లు తగ్గుతుందని, పర్యావరణానికి మేలు జరుగుతుందని, వాహనాల పనితీరుపైనా ప్రతికూల ప్రభావం ఉండదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చెబుతూ వస్తోంది. అయితే అదే మోడీ ప్రభుత్వం తాజాగా పార్లమెంట్‌కు సమర్పించిన గణాంకాలు ఇథనాల్ కొనుగోలు వ్యయం చమురు కంపెనీలకు తీవ్ర భారంగా మారినట్టు స్పష్టమవుతోంది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రస్తుతం లీటర్ ఇథనాల్‌కు సగటున రూ.70.2 చెల్లిస్తున్నాయి. ఇదే సమయంలో రిఫైనరీ స్థాయిలో పెట్రోల్ ధర సుమారు రూ.53 మాత్రమే ఉందని రాజ్యసభకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన తాజా గణాంకాలతో ఇథనాల్ విధానం ఆర్థిక ప్రయోజనాలపై అనుమానాలు మరింత తీవ్రమయ్యాయి.
గత మూడు ఇథనాల్ సరఫరా సంవత్సరాల (ఇఎస్‌వై) గణాంకాలను పరిశీలిస్తే.. ఇథనాల్ కొనుగోలు పరిమాణం, వ్యయంలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. 2023-24లో 679.04 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను రూ.48,757 కోట్లకు కొనుగోలు చేయగా, 2024-25 నాటికి ఈ పరిమాణం 1033.31 కోట్ల లీటర్లకు పెరిగి విలువ రూ.73,996 కోట్లకు చేరింది. ఇక ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరం జూన్ నాటికి 705.43 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను రూ.49,577 కోట్ల వ్యయంతో సేకరించారు. దీని ప్రకారం లీటర్ ఎథనాల్ సగటు ధర గత మూడేళ్లుగా రూ.70-72 మధ్య కొనసాగుతోంది. 2023-24లో లీటర్ సగటు ధర రూ.71.80 ఉండగా, 2025-26 జూన్ వరకు నాటికి ఇది రూ.70.20గా నమోదయ్యింది.
కాగా.. అంతర్జాతీయ ముడి చమురు ధరలతో పోలిస్తే ఈ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. భారత ప్రభుత్వం దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు సగటు వ్యయం 2024-25లో లీటర్‌కు రూ.47.54 ఉండగా, 2025-26లో రూ.42.96కి తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో కూడా ముడి చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఏప్రిల్‌లో రూ.69.28 ఉన్న సగటు ధర.. క్రమంగా తగ్గి జులై నాటికి రూ.45.74కి పడిపోయింది. ఈ నాలుగు నెలల కాలంలో ముడి చమురు సగటు దిగుమతి ధర లీటర్‌కు రూ.57.42గా ఉంది. ఈ గణాంకాల ప్రకారం పరిశీలించిన ముడి చమురుతో పోలిస్తే ఇథనాల్‌ను లీటర్‌కు భారీ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా రిఫైనరీ గేట్ వద్ద తయారయ్యే పన్నులు లేని పెట్రోల్ ధర సుమారు రూ.53 మాత్రమే ఉంటోందని నిపుణులు పేర్కొంటున్నారు. దీనితో పోలిస్తే ఇథనాల్‌ను రూ.70కి పైగా కొనుగోలు చేయడం చమురు కంపెనీలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతోందని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ తక్కువ మైలేజీ ఇస్తోంది. ఇది మరో భారంగా పరిణమించిందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
2014-15 నుంచి ఇప్పటివరకు ఇథనాల్ కలపడం ద్వారా రూ.1.97 లక్ష కోట్ల విదేశీ మారకద్రవ్య ఆదా జరిగిందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ప్రస్తుత ముడి చమురు ధరల నేపథ్యంలో ఈ మిశ్రమం ప్రక్రియ ఆర్థికంగా లాభసాటిగా ఉందా అనే కోణంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120-130 డాలర్ల స్థాయిని దాటితేనే బ్లెండింగ్ నిజంగా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణుల అభిప్రాయం. మరోవైపు పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని 20 శాతానికి మించి పెంచే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, శాస్త్రీయ అధ్యయనాల తర్వాతే తదుపరి అడుగులు ఉంటాయని కేంద్ర మంత్రి సురేశ్ గోపి తెలిపారు.
ఇథనాలే ఖరీదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



