నవతెలంగాణ-జన్నారం
పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను కొనసాగించాలని సీపీఐ(ఎం) జన్నారం మండల కార్యదర్శి కొండగుర్ల లింగన్న అన్నారు. మంగళవారం కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతినిసీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా తాసిల్దార్ కార్యాలయ చౌరస్తాలో పుచ్చలపల్లి సుబ్బరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో పార్టీ నిర్మాణానికి జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ఉద్యమ విస్తరణకు కీలకంగా పనిచేశారు, 1936 లో అఖిలభారత కమ్యూనిస్టు కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు.
డబ్బు, కులం, మతం, కార్పొరేట్ ప్రభావం రాజకీయాలను శాసిస్తున్న ఈ కాలంలో సుందరయ్య లాంటి నాయకుల అవసరం మరింత పెరిగిందని, రాజకీయాలు, సేవ నుంచి వ్యాపారంగా మారుతున్న వేళ, సుందరయ్య జీవితం ఈనాటి యువతకు ఒక పాఠశాల కావాలన్నారు. యువత సమాజం కోసం ఆలోచించాలని, ప్రశ్నించే ధైర్యం కలిగి ఉండాలని, కుల, మత విద్వేషాలకు అతీతంగా మానవత్వం కోసం నిలబడాలని కోరినారు. సామాజిక న్యాయంకోసం నడవడం, అదే కామ్రేడ్ సుందరయ్యకు అసలైన రెడ్ సెల్యూట్ అని అన్నారు.
అనంతరం జిల్లా ఐద్వా అధ్యక్షురాలు పోతు విజయశంకర్, మాట్లాడుతూ సుందరయ్య భూస్వామ్య కుటుంబంలో పుట్టి, విద్యార్థి దశలోనే కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు వంటి సంఘసంస్కర్తల ప్రభావంతో సామాజిక చైతన్యం పొంది, బ్రిటీష్ పాలన వెళ్లిపోవడం స్వాతంత్ర్యం కాదని , వర్గ దోపిడీ, పేదరికం, అసమానతలు అంతమయ్యే సమాజమే నిజమైన స్వాతంత్రమని గట్టిగా విశ్వసించి కమ్యూనిస్టు పార్టీని ముందుకు నడిపారని అన్నారు. ఆయన ఆశయాన్ని సాధించడం కొరకు మనమంతా పనిచేయాలని తెలిపారు.
కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కూకటి కారు బుచ్చయ్య, పార్టీ మండల నాయకులు అంబటి లక్ష్మణ్, మగ్గిడి జయ, గుడ్ల రాజన్న, ఎస్కే అబ్దుల్లా, వి చంద్రమౌళి, కోరుట్ల శంకర్, డి దుర్గయ్య, సువర్ణ,లచ్చవ్వ అన్నారపు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.



