Wednesday, May 20, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిట్రంప్‌ చైనా పర్యటన విఫలమా ! సఫలమా!

ట్రంప్‌ చైనా పర్యటన విఫలమా ! సఫలమా!

- Advertisement -

మే నెల 14,15 తేదీలలో ప్రపంచంలో ఇద్దరు శక్తివంతులైన నేతలు చైనా రాజధాని బీజింగ్‌లో భేటీ అయ్యారు. సహజంగానే ఈ కలయిక ఫలితాలు, పర్యవసానాల గురించి చర్చ జరుగుతోంది.అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ రెండవసారి చైనా సందర్శించాడు. పర్యటనకు ముందు, తరువాత కూడా ఈ ఉదంతం గురించి పెద్ద ఎత్తున విశ్లేషణలు వెలువడ్డాయి. డ్రాగన్‌ దేశ సందర్శన విఫలమైందని, వాణిజ్య పోరు ఎదురుతన్నిందని, అమెరికన్‌ కార్పొరేట్లు నిరాశాపూర్వక ప్రయత్నాలు చేసినట్లు, ఇంకా అనేక అంశాల గురించి పుంఖాను పుంఖాలుగా వ్యాఖ్యలు, వివరణలు వెలువడ్డాయి. విజయవంతమైందనే మాట ఎక్కడా వినిపించలేదు. సాధారణంగా దేశాధినేతల పర్యటనలు ఇతర దేశాల ఆహ్వానం మేరకే జరుగుతాయి. ట్రంప్‌ తాజా పర్యటనకు చైనా నుంచి అలాంటి ఆహ్వానం లేదు. మీ ఇంటికి ఒకసారి రావాలని కొందరు అంటారని తెలిసిందే, అలాగే ట్రంప్‌ తన వాంఛను వెలిబుచ్చిన తరువాత అంతకంటేనా అని బీజింగ్‌ స్పందించింది. అలాగని మర్యాదలకు లోటు చేయలేదు. ట్రంప్‌ పరివారానికి హెచ్చరికలతో పాటు అనేక బహుమతులు కూడా ఇచ్చిపంపారు. అయితే వాటిలో దొంగచెవులు, నిఘా కెమెరాలను అమర్చారంటూ స్వదేశానికి తీసుకుపోకుండా ఒక చెత్తబుట్టలో వేసి చూపి మరీ ట్రంప్‌ బృందం చైనాను అవమానించింది అనటం కంటే తన చౌకబారు తనాన్ని వెల్లడించుకుంది. గతంలో కూడా అమెరికన్లు గుట్టుచప్పుడు కాకుండా అదేపని చేసేవారని వార్తలు వచ్చాయి.

ఈ చర్య ద్వారా షీ జింపింగ్‌ యంత్రాంగం తమ బుట్టలో పడలేదనే ఉక్రోషం ప్రదర్శితమైంది.చైనాను వత్తిడి చేయటంలో విఫలం కావటాన్ని వాణిజ్య యుద్దంలో ట్రంప్‌ ఓటమిగా కొందరు వర్ణించారు.ఆ పెద్ద మనిషి అంతగా కోరి మరీ ఎందుకు చైనా వెళ్లాడంటే ముక్తసరి సమాధానం అమెరికా ఆర్థిక పరిస్థితి తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోందనే సమాధానం వచ్చింది. చైనా పర్యటన సమయంలో ట్రంప్‌ రేటింగ్‌ 34 శాతానికి దిగజారింది.రుణ భారం జిడిపికి వందశాతం దాటింది. పులిమీద పుట్రలా ఇరాన్‌పై దాడి చేసి మరింత లోతుగా కూరుకుపోయింది.గౌరవ ప్రదమైన విధంగా ఇరాన్‌తో రాజీకుదర్చాలనే అజెండా తెరవెనుక ఉందని చెబుతున్నారు. వ్రతం చెడ్దా ఫలం దక్కలేదు.చైనా పైచేయిగా ఉందని వాషింగ్టన్‌ మేథో సంస్థ విదేశీ వ్యవహారాల మండలి(సిఎఫ్‌ ఆర్‌) వ్యాఖ్యానించిందంటే పరిస్థితి ఏమిటో వేరే చెప్పనవసరం లేదు. అమెరికాలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వాటి వెనుక టెస్లా కంపెనీ యజమాని ప్రపంచ ధనికుడు ఎలన్‌మస్క్‌, అందరికీ సుపరిచితమైన ఆపిల్‌, బ్లాక్‌రాక్‌, ఎన్‌విడియా, బోయింగ్‌, జిఇ, మైక్రాన్‌ ఇలా అనేక కంపెనీల అధిపతులు ఉంటారు.ఎవరు మంత్రులు కావాలో, ఏ విధానాలను అనుసరించాలో కూడా నిర్దేశించేది వారే.

ఈ బృందం ఆశాభంగం చెందటానికి కారణాలు ఏమిటి ? గతంలో చైనాకు అవసరమైన చిప్స్‌ను సరఫరా చేయటంలో ఎన్‌విడియా కంపెనీ వాటా 95 శాతం ఉండగా ఇప్పుడు సున్నా శాతానికి పడిపోయింది.చైనాకు అవసరమైన ఆధునిక చిప్స్‌ను సరఫరా చేయకూడదన్న ఆదేశాలకు సదరు కంపెనీ తలొగ్గింది. సవాలుగా తీసుకున్న చైనా తన స్వంత కంపెనీలను ప్రోత్సహించి చిప్స్‌ను అభివృద్ధి చేసుకుంటున్నది. విధిలేక నిషేధం ఎత్తివేసిన తరువాత చూద్దాం, అవసరమైనపుడు మేమే సంప్రదిస్తాం అన్నట్లుగా చైనా అటువైపే చూడలేదు.అందుకే ఆ కంపెనీ యజమాని ట్రంప్‌తో పాటు బీజింగ్‌ వెళ్లాడు. నూటనలభై కోట్ల జనాభాలో 2027 నాటికి 120 కోట్ల మంది మధ్య తరగతిలో ఉంటారని అంచనా. ప్రపంచంలో వీరి వాటా 25శాతం. ఇంత మంది వినియోగదారుల మార్కెట్‌ను అమెరికా కార్పొరేట్లు వదులు కుంటాయా ? వాటికి కావాల్సింది లాభాలు, వాటికోసం రాజకీయాలు చేస్తాయి, అవి తమకు ఆటంకంగా మారినపుడు ప్లేటు ఫిరాయిస్తాయి. సంస్కరణలు అంటే మన మాదిరి విదేశాలకు ఏకపక్షంగా తలుపులు బార్లా తెరవటం కాదు.మనం ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ నిర్దేశిత విధానాల చట్రంలో చేస్తే దానికి భిన్నంగా టెక్నాలజీ అందిస్తే మార్కెట్‌లో అవకాశమిస్తాం అనే షరతు మీద చైనా కమ్యూనిస్టులు వ్యవహరించారు.

ఈ కీలకమైన అంశాన్ని వదలి వారు నియంతలు, మనది ప్రజాస్వామ్యం అందుకే చైనాతో పోల్చుకోవద్దు అంటూ కొందరు సొల్లు కబుర్లు చెబుతారు. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందా లేదా అన్నదే గీటురాయి.చైనా తనకు పోటీగా రాదని భావించినంత కాలం అమెరికన్లు ఎలాంటి యాగీ చేయలేదు. తరువాతే అక్కడ మానవహక్కులు లేవని, కరెన్సీ విలువను తగ్గించి ఉంచుతున్నారని, సబ్సిడీలతో సరకులను తక్కువ ధరలకు ఎగుమతి చేస్తున్నారని ఇలా రకరకాల సాకులను ముందుకు తెచ్చారు. ట్రంప్‌ తొలిసారి అధికారానికి వచ్చినపుడు 2018లో వాణిజ్య యుద్దాన్ని ప్రారంభించాడు. పెద్ద మొత్తంలో అమెరికా పెట్టుబడులు తగ్గించాడు, వాణిజ్యమూ తగ్గింది. అయినా గడచిన ఎనిమిది సంవత్సరాల్లో చైనాకు స్వల్ప సమస్యలు తప్ప అదేమీ కుప్పకూలి పోలేదు. వాణిజ్యం తరువాత చిప్‌ వార్‌ను ప్రారంభించాడు. దాన్ని కూడా సవాలుగా తీసుకొని మీ చిప్స్‌ మాకు అవసరం లేదనట్లుగా ఇప్పుడు చైనా ఉంది. దాంతో చైనా పట్ల వైఖరిని మార్చుకోవాలని కొన్ని పెద్ద కార్పొరేట్‌ కంపెనీలు వత్తిడి తెచ్చిన కారణంగానే పిలవక పోయినా పెద్ద సంఖ్యలో వాటి యజమానులను వెంటేసుకొని ట్రంప్‌ బీజింగ్‌ వెళ్లాడు. చైనా కనీసం ఐదు వందల విమానాలను కొనుగోలు చేస్తుందని కొందరు జోశ్యం చెప్పారు.

అన్నిగాకున్నా రెండు వందలు అమ్ముదామని ట్రంప్‌ చెప్పాడు. చివరికి దీని గురించి అడిగితే చైనా ప్రతినిధి సమాధాన్ని దాటవేయటంతో బోయింగ్‌: కంపెనీ వాటాల ధరలు నాలుగుశాతం పడిపోయాయి. ఎన్‌విడియా చిప్స్‌ కంపెనీకి సైతం ఇదే ఆశాభంగం ఎదురైందని వార్తలు. బీజింగ్‌ తన ప్రయోజనాలను ఫణంగా పెట్టుకొని తమకు రాయితీలు ఇస్తుందని ట్రంప్‌ ఎలా ఆశించాడు, ఆలోచించాడన్నది ఒక చిక్కు ప్రశ్నగా మారింది.కొన్ని దేశాల్లో దళారీ బూర్జువా శక్తులు వ్యక్తిగతంగా తాము లబ్డిపొంది దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టి అమెరికా, ఇతర ధనిక దేశాలకు సహకరించినట్లుగానే చైనా కమ్యూనిస్టులు చేస్తారని ఆశించి భంగపడ్డారని వేరే చెప్పనవసరం లేదు. ఇరాన్‌ నుంచి తనకు చమురు అందకుండా చేసేందుకు అమెరికా కుట్రలు తెలిసిందే. అదే ఇరాన్‌ మీద దాడులు చేస్తూ సంక్షోభ పరిష్కారానికి ఇరాన్ను దారికి తేవాలని కోరటం కూడా ట్రంప్‌ దురాశే. ఇప్పుడు చైనా అమ్ములపొదిలో అనేక అస్త్రాలు ఉన్నాయి. ఏడాది క్రితం చైనా వస్తువులపై 145శాతం పన్నులు విధిస్తా అంటే తాము కూడా అదే మర్యాద చేస్తామని ట్రంప్‌కు చెప్పారు. తన దగ్గర తిరుగులేని అస్త్రాలు ఉన్నాయని, చైనాను నాశనం చేస్తానని చెప్పటం తప్ప వాషింగ్టన్‌ ఇంతవరకు బయటకు తీసిందేమీ లేదు.

చైనా ప్రతి సుంకాలు విధిస్తే మనకు నష్టమా అని ప్రశ్నిస్తే వారు పెద్ద తప్పు చేశారు, మనం దిగుమతి చేసుకొనే వస్తువుల్లో ఐదోవంతు మాత్రమే ఎగుమతి చేస్తున్నాం గనుక నష్టపోయేదే వారే అని అమెరికా విత్త మంత్రి స్కాట్‌ బెసెంట్‌ గొప్పలు చెప్పాడు. అటువంటపుడు ట్రంప్‌ చైనా ఎందుకు వెళ్లినట్లు ? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విధిస్తే వాటి తయారీకి అవసరమైన విలువైన ఖనిజాల ఉత్పత్తులను నిలిపివేసి డ్రాగన్‌ వాషింగ్టన్‌లో రాజకీయ భూకంపాన్ని సృష్టించింది. సముద్రంలో నీరున్నా తాగేందుకు పనికి రాదన్నట్లు అమెరికా ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయాలను చూసుకొనే స్థితి లేదని గగ్గోలు పెడుతున్నారు. ఒంటరిగా చేయలేమని భావించి పాక్స్‌ సిలికా పేరుతో కొన్ని దేశాలతో కూటమి గట్టింది, వాటి ప్రయత్నాలు ఫలించాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, అంతవరకు ఆగలేమంటూ కార్పొరేట్లు ట్రంప్‌ మీద వత్తిడి తెస్తున్నాయి. చైనాను దెబ్బతీయటంతో పాటు దానికి ప్రత్యామ్నాయంగా ఇతర దేశాలను తయారు చేసే ఎత్తుగడతో గత పది సంవత్సరాలుగా అక్కడి నుంచి కంపెనీలను తరలించాలని శ్వేత సౌధం వత్తిడి చేస్తున్నది.ఆమేరకు యాపిల్‌ కంపెనీ మనదేశానికి వచ్చినప్పటికీ దానికి ఎదురైన సమస్యలను చూసి మిగిలిన సంస్థలు సాహసించటం లేదు.ఎలన్‌ మస్క్‌ టెస్లా కంపెనీ తయారు చేస్తున్న విద్యుత్‌ కార్లలో సగం చైనాలోనే ఉన్నాయి, అయినప్పటికీ అమెరికా పరిశ్రమను బీజింగ్‌ నాశనం చేయనుందని, గగ్గోలు పెడితే జో బైడెన్‌ సర్కార్‌ 2024లో చైనా కార్లపై వందశాతం దిగుమతి సుంకం విధించింది.అయినా చైనా తగ్గలేదు.

వాణిజ్య అంశాల్లో పరిస్థితి ఇలా ఉంటే రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్దరణ జరిగిన నాటి నుంచీ తైవాన్‌ అంశం నలుగుతూనే ఉంది. ఆ ప్రాంతం చైనాలో అంతర్భాగమని గుర్తిస్తూనే విడదీసి ప్రత్యేక దేశంగా మార్చాలనే కుట్రలకు అమెరికా తెరతీసింది, టిబెట్‌ను మరోదేశంగా మార్చాలనే ఎత్తుగడతో దలైలామా పేరుతో తిరుగుబాటుకు తోడ్పాటునిచ్చిన సంగతి తెలిసిందే.చైనాకు కేవలం 59 మైళ్ల దూరంలో ఉన్న తైవాన్‌ రక్షణకు 9,500 మైళ్ల దూరం నుంచి వచ్చి యుద్దం ఎలా చేయగలమని ట్రంప్‌ ఫాక్స్‌ న్యూస్‌ ఛానల్‌ జర్నలిస్టులను ప్రశ్నించాడు. ఇలాంటి స్పందన గతంలో ఏ అమెరికా అధ్యక్షుడి నోటి నుంచి రాలేదు. అమెరికన్లు ఎందుకు తైవాన్‌ గురించి ఆందోళన చెందుతున్నారంటే అక్కడి చైనా జాతీయుల గురించి కాదు, ఆధునిక చిప్స్‌ తయారీ ఫ్యాక్టరీల పైనే కన్ను. ఒక వేళ చైనా గనుక బలవంతంగా విలీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే అక్కడి చిప్స్‌ తయారీ కేంద్రాలను నాశనం చేస్తామని గతంలో అమెరికా బెదిరించింది.తైవాన్‌ అంశం గురించి చైనా ముందుకు తెస్తే ట్రంప్‌ ఇరాన్‌ గురించి ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి.అమెరికా అధ్యక్ష భవనం విడుదల చేసిన ప్రకటనలో కేవలం 163 పదాలే ఉన్నాయి.హార్ముజ్‌ జలసంధి గురించిన ప్రస్తావన మూడుసార్లు ఉంది.చైనా విడుదల చేసిన ప్రకటనలో అసలు ఇరాన్‌ ప్రస్తావనే లేదు, కేవలం మధ్య ప్రాచ్య పరిస్థితి అనే మాటమాత్రమే ఉంది.

ఇరాన్‌పై విజేతగా బీజింగ్‌లో అడుగుపెట్టేందుకు కలలు గన్న ట్రంప్‌కు ఆశాభంగం ఎదురైంది. రెండు రోజుల ట్రంప్‌ పర్యటన తరువాత జరిగిన పరిణామాలను చూస్తే పశ్చిమాసియా సంక్షోభంలో ఎలాంటి సానుకూల పరిణామాలు లేవు. గతంలో మాదిరే ట్రంప్‌ బెదిరింపులకు దిగాడు. పెద్ద ఎత్తున దాడి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కథనాలను వండి వారుస్తున్నారు.మరో నెల రోజుల పాటు సముద్రంలో ఉన్న నౌకలనుంచి రష్యన్‌ ముడి చమురు కొనుక్కొనేందుకు భారత్‌తో సహా కొన్ని దేశాలకు డోనాల్డ్‌ ట్రంప్‌ అనుమతిని పొడిగించాడు. బ్రెంట్‌ రకం ముడిచమురు ధర మంగళవారం నాడు రెండు డాలర్లు తగ్గి 110 డాలర్లకు అటూ ఇటూగా ఉంది. ఇరాన్‌పై దాడులను ప్రారంభించినప్పటి నుంచి అమెరికా చమురు వినియోగదారులపై 45 బిలియన్‌ డాలర్ల మేర అదనపు భారం పడింది.అందువలన అనిశ్చితి ఇంకా కొనసాగితే మరింత పెరిగి నవంబరులో జరిగే ఎన్నికల్లో ఓటర్లు ట్రంప్‌కు చుక్కలు చూపించే అవకాశం ఉంది. అనేక దేశాలకు ఎరువుల సరఫరాతో పాటు, వాటి ఉత్పత్తికి అవసరమైన గ్యాస్‌ లభ్యత కూడా తీవ్రంగా మారే అవకాశం ఉంది, ఇప్పటికే ఎరువుల ధరలు పెరిగాయి. మరికొద్ది వారాల్లో మనదేశంలో ఖరీఫ్‌ తరుణం ప్రారంభం కానుంది.ఎరువులను కేంద్ర ప్రభుత్వం ఎలా అందించనుందో చూడాల్సి ఉంది.యావత్‌ దేశాన్ని కలవర పెడుతున్న అమెరికా దాడులను ఖండించే ధైర్యం లేకపోయినా కనీసం ఆపమని ట్రంప్‌ను నరేంద్రమోడీ ఎందుకు వేడుకోరన్న ప్రశ్నకు జవాబు దొరకటం లేదు!

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -