Wednesday, July 22, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివాంగ్‌ చుక్ వంటి మేధావుల్ని కాపాడుకోవాలి!

వాంగ్‌ చుక్ వంటి మేధావుల్ని కాపాడుకోవాలి!

- Advertisement -

దేశంలో విద్యావ్యవస్థ అక్రమాలకూ, నీట్ 2026 పేపర్ లీక్‌కూ నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖా మంత్రి ధరేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌‌టిఎ)ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ – ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఇటీవల భారీ ధర్నా చేపట్టింది. దానికి మద్దతు తెలుపుతూ ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. శుక్రవారం 17 జులై 2026 నాటికి ఆయన దీక్ష ఇరవై రోజులకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలన్న డిమాండ్లు దేశ వ్యాప్తం గా వెల్లు వెత్తాయి. అయితే చర్చలకు ఆస్కారమివ్వ కుండా దీక్షా శిబిరం నుంచి సోనమ్‌‌వాంగ్‌ ‌చుక్‌‌ను పోలీసు యంత్రాంగం బలవంతంగా లాక్కెళ్లి ఆస్పత్రిలో చేర్చింది. వాంగ్‌‌చుక్‌‌కు మద్దతుగా మన హైదరాబాదులోని సామాజిక – పౌరసంస్థలెన్నో సంపూర్ణ సంఘీభావం ప్రకటించాయి. నెక్లెస్ రోడ్‌లో జులై 16, 2026 సాయం త్రం రెండు గంటల పాటు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాయి. ఆ తర్వాత అక్కడి భారీ అంబేద్కర్‌ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించాయి.
‘‘లక్షలమంది యువతీ యువకుల భవిషత్తు అంధకారమైపోతున్న తరుణంలో ఈ సమస్య లోని తీవ్రతను ప్రభుత్వానికి తెలియజెప్పడానికే తను ఈ నిరాహార దీక్ష చేస్తున్నాననీ – ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నది కాదనీ, ప్రభుత్వానికి సహాయపడేదేనని’’ సోనమ్ వాంగ్ చుక్ దీక్షాస్థలిలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘పేపర్ లీక్‌లతో భవిషత్తు కోల్పోయిన యువతీ యువకుల బాధతో – అత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల బాధతో, వారి తల్లిదండ్రుల బాధతో పోలిస్తే- తన బాధ చాలా చిన్నదనీ – ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ విష యాన్ని సాగదీయకుండా సానుకూలంగా వెంటనే పరిష్కరించాలని”- ఆయన కోరారు.

కానీ, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వపు మొండి వైఖరి ఈ దేశ ప్రజలకు తెలుసు. గతంలో ఢిల్లీ సరిహద్దులో వందల మంది రైతులు ప్రాణాలర్పించినా ఈ ప్రభుత్వం చలించలేదు, స్పందించలేదు. పైగా, రైతుల న్యాయమైన కోర్రెలను గుర్తించి తాము తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాల్ని వెనక్కి తీసుకుంటున్నామని కూడా ప్రకటించలేదు. పైగా ఆ చట్టాల వల్ల కలగబోయే లాభాలు తాము రైతు నాయకులకు సరిగా చెప్పలేక పోయామనీ, వాటి మీద మరింత దృష్టి పెట్టి పరిశీలించాల్సిన అవసరం ఉందనీ-అందుకే, ప్రస్తుతానికి రైతు చట్టాల్ని వెనక్కి తీసుకుంటున్నామని ప్రభుత్వం వారు డొంకతిరుగుడు సమాధానం వెలువరించారు. వందల ప్రాణత్యాగాలకు విలువ ఇవ్వలేదు. రైతుల న్యాయమైన కోర్కెలకు విలువ ఇవ్వలేదు. తమ మూర్ఖత్వాన్ని అలాగే కొనసాగిస్తూ – రైతు చట్టాలు మాత్రం వెనక్కి తీసుకున్నారు. అందువల్ల, ఇప్పుడు సోనమ్ వాంగ్‌ చుక్ నిరాహార దీక్ష గురించిగానీ, లక్షల మంది యువత యువకుల భవిష్యత్తు గురించి గానీ ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్నది – అనుమానమే! చదువు విలువ ఏమాత్రం తెలియని ప్రభుత్వ పెద్దలు విద్యావ్యవస్థ గురించి ఆందోళన పడగలరని ఎలా అనుకోగలం?
సోనమ్ వాంగ్ చుక్ వంటి మేధావులు చాలా అరుదుగా ఉంటారు. ఆయన ఒక ఇంజనీయర్, విద్యావేత్త, సామాజిక కార్యకర్త, పర్యావరణ వేత్త. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన వాంగ్ చుక్ లడక్ ప్రాంతంలో పలు విద్యా సంస్కరణలు తీసుకొచ్చారు. ‘‘స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్ మెంట్ ఆఫ్ లడఖ్ (SEC MOL)’’ -అనే సంస్థను స్థాపించి నిర్వహిస్తున్నారు. మంచు స్థూపం (ICE STUPA) సాంకేతికతను అభి వృద్ధి చేసి, అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. 2018లో ‘‘రామన్ మెగసెసే’’ పురస్కారం లభించినప్పుడు ఆయన పేరు బాగా వెలుగులోకి వచ్చింది. తక్కువ ఖర్చుతో మట్టి భవనాల నిర్మాణం చేసి, అందులో తన SEC MOL కాంపస్‌‌ను మొత్తానికి మొత్తంగా సౌరశక్తితో నిర్వహించారు. అక్కడ వెలుతురు కోసం గానీ, వేడి కోసం గానీ, వంట చేసుకోవడానికి గానీ దేనికి శిలాజ ఇంధనాలు ఉపయోగించరు. పూర్తిగా సౌరశక్తినే ఉపయోగిస్తారు.

ఈయన కృషిలో మంచు స్థూపం చెప్పుకోదగ్గది. లడక్ ప్రాంతంలో వృథాగా పోయే శీతాకాలపు నీటిని అంటుకట్టి శంఖాకారపు మంచు కుప్పల రూపంలో నిలువ చేస్తారు. వేసవిలో నీటి కొరత ఉన్నప్పుడు, పం టలకు నీరు కావల్సినప్పుడు ఈ మంచును కరిగించి ఉపయోగిస్తారు. నీటి పారుదల కోసం కాలువలు తవ్వడం, గడ్డ కట్టించడం ఆ ప్రాంతంలో వందల సంవత్సరాలుగా ఉన్నదే. కానీ, వాంగ్ చుక్ మళ్లీ ఆ పద్ధతిని పునరుద్ధరించి, ఆధునీకరించి, అభివృద్ధి చేసి ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఈ ప్రాజెక్టును తన SECMOL ఎన్టీవో సంస్థ ద్వారా నిర్వహిం చారు. 2013-2014లలో ప్రారంభమైన ‘ద ఐస్ స్థూప ప్రాజెక్ట్’ లడక్ ప్రాంతంలో విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చింది. ఫలితంగా 2016 నవంబర్ 16న సోనమ్ వాంగ్ చుక్‌ ‘రోలెక్స్ ఫర్ ఎంటర్ ప్రయిజ్‌ అవార్డు’- దక్కింది. దాంతో ఐస్ స్థూప ప్రాజెక్ట్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

లడఖ్ ఒక చల్లని ఎడారి! ఇక్కడి నేల ఘనీభవించి ఉంటుంది. గాలీ, ఉష్ణోగ్రతా తక్కువగా ఉంటాయి. అందువల్ల, ఇక్కడ శీతాకాలంలో వ్యవసాయం చేయ లేరు. ఆ తరువాత వసంత కాలంలో నీటి అవసరం పెరుగుతుంది. కానీ, అప్పటికి వాగులు ఎండిపోయి ఉంటాయి. వేసవిలో ఊష్ణోగ్రతలు పెరిగి మంచు కరగడం ప్రారంభమవుతుంది. ఈ వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకుని అక్కడ సేద్యం చేయాల్సి ఉంటుంది. సోనమ్ వాంగ్ చుక్ అనుకోకుండా మే నెలలో ఒక వంతెన కింద మంచును గమనించాడు. ఆ మంచు పై ఎండ నేరుగా పడకపోవడం వల్ల, అది కరగకుండా అలా ఉండి పోయిందన్న విషయం గమనించాడు. లడఖ్‌లో మంచు నీడలో ఉంటే కరగకుండా ఎక్కువ కాలం ఉంటుందన్న విషయం గ్రహించి, తన ఐస్ స్థూప ప్రాజెక్ట్ (శంఖాకారంలో నీటిని గడ్డ కట్టించడం)కు రూపకల్పన చేసుకున్నారు. శంఖాకారమే ఎందుకూ అంటే, శంఖాకారంలో ఉపరితల వైశాల్యం చాలా తక్కువగా ఉంటుంది గనుక ఎండ నేరుగా పడినా కూడా కరిగే మంచు చాలా తక్కువగా ఉంటుంది. మొదటిసారి హెంగ్ చుక్ 6 మీ. ఎత్తు, లక్షన్నర లీటర్ల నిలువ సామర్థ్యం ఉన్న మంచు స్థూపాన్ని నిర్మించారు. 2019లో 12 స్థూపాలు, 2020లో 25 స్థూపాలు నిర్మించారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ స్థూపాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇవి అక్కడి వ్యవసాయానికి ఎంతగానో ఉపయోగపడుతూ వచ్చాయి. ఈ పనితో వాంగ్ చుక్ రైతు బాంధవుడిగా, పర్యావరణవేత్తగా వెలుగులోకి వచ్చారు. అలాగే ‘ఆపరేషన్ న్యూహాప్‌’ (1994) అనే కార్యక్రమం ద్వారా లడఖ్ విద్యా వ్యవస్థలో మరికొన్ని సంస్కరణలు తేగలిగారు, 1993-2005 మధ్య కాలంలో వాంగ్ చుక్ ‘‘లడగ్ మెలాంగ్’’ అనే పత్రికను తన స్వీయ సంపాదకత్వంలో నిర్వహించారు. ఇది లడఖ్ ప్రాంతంలో అచ్చయి వెలువడిన తొలి పత్రిక – ఏకైక పత్రిక.

జమ్మూకాశ్మీర్‌లోని అల్చిలో 1966 సెప్టెంబర్ 1 న జన్మించిన సోనమ్ వాంగ్ చుక్ శ్రీనగర్‌లో చదువుకున్నారు. అక్కడి NIT- ఇంజనీరింగ్ కళాశాల నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా తీసుకున్నారు. ఆయన భార్య గీతాంజలి జె అంగ్మోది ఒడిశాలోని బాలాసోర్‌‌. ఆమె భువనేశ్వర్‌లో యం.బి. ఎ. పూర్తిచేశారు.వాంగ్ చుక్ గతంలో కూడా అనేక ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. రాజాంగ పరిరక్షణ, పర్యావరణ రక్షణ, లడఖ్ ప్రాంత ప్రజల హక్కుల రక్షణ కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు. 2024 లో లడఖ్‌కు ప్రత్యేక హోదాకు సంబంధించి, పర్యావరణానికి సంబంధించి ప్రారంభమైన ‘‘క్లైమేట్ ఫాస్ట్’’ ఉష్ణమం దేశవ్యాప్తంగా చర్చనీ యాంశమైంది. అందులో భాగంగా 2025 సెప్టెంబర్ 24 న లేహ్‌లో జరిగిన ఒక విధ్వం సానికి ‌వాంగ్‌‌చుక్‌‌ని బాధ్యుణ్ణి చేస్తూ పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద (NSA) అరెస్ట్ చేసి, జోద్‌పూర్ జైల్లో 170 రోజుల పాటు నిర్భందించారు. 2026 మార్చి 14న విడుదలై బయటికి వచ్చారు. అందువల్ల, ఉదమాలు, జైలు జీవితం వాంగ్ చుక్‌‌కు కొత్తకాదు.
ప్రస్తుతం (జూన్ – జులై 2026) ఢిల్లీ జంతర్ మంతర్‌‌లో నిరాహార దీక్ష చేసిన సోనమ్ వాంగ్ చుక్ తనను తాను గౌరవ కాక్రోచ్‌గా పేర్కొంటూ-తను నిరుద్యోగిని కానీ, సోమరిపోతును కానీ కాకపోయినా యువత ఆవేదనకు తన సంఘీభావం ప్రకటిస్తున్నానని తెలిపారు. ఆ రకంగా ప్రజాస్వామ్య స్వేచ్ఛకు సంబం ధించి దేశంలో వాంగ్ చుక్ ప్రముఖ స్వరంగా మారారు. దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ ఆయనకు సంఘీభావం తెలియజేశాయి. ఈ దేశంలో మేధావుల్ని వేధించడం, వారి ప్రాణాలు తీయడం ఈ ఆరెస్సెస్-బీజేపీ ప్రభుత్వానికి కొత్తకాదు. అందువల్ల, ప్రజలే పూనుకుని సోనమ్ వాంగ్ చుక్ వంటి మేధావుల్ని కాపాడుకోవాలి! కరుడుగట్టిన ప్రభుత్వ పెద్దల మూర్ఖత్వాన్ని బద్దలు కొట్టడానికి ప్రజలే నడుం బిగించాలి.
వ్యాసకర్త: – నేషనల్ బుక్‌ ట్రస్ట్, పూర్వ సలహా సంఘ సభ్యుడు, జీవశాస్త్రవేత్త.

ప్రొ. దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -