Wednesday, July 22, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా! ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి?

అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా! ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి?

- Advertisement -

“వీరు సోషల్ డెమోక్రాట్లు (సామాజిక ప్రజాస్వామిక వాదులు) కాదు, కరుడు గట్టిన దేవుడులేని కమ్యూ నిస్టులు, వారు అన్ని మతాల మీద దాడులు చేస్తారు, ప్రత్యేకించి క్రైస్తవం మీద, వారెప్పుడూ అదే చేస్తారు,అదొక పిచ్చి వంటిది, ఈ దేశంలో మీ చర్చీలన్నింటినీ మూసివేస్తారు. మీ వారిని చంపివేస్తారు, ఏదనుకుంటే అది చేస్తారు. వారు మతాన్ని అంతం చేయాలనుకుంటున్నారు. మీకు బలమైన మతం ఉంటే వారి సిద్ధాంతం పనిచేయదు గనుక వారు మతాన్ని అంతం చేయాలనుకుంటారు. 250 ఏండ్ల క్రితం మన దేశ స్థాపన జరిగిన తరువాత నా అభిప్రాయం ప్రకారం మనదేశానికి వచ్చిన ముప్పు ఇది” ఈ మాటలు మాట్లాడింది అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డోనాల్డ్‌ట్రంప్ అనే ఒక కమ్యూనిస్టు వ్యతిరేకి. గతవారంలో దేశ ప్రజల నుద్దేశించి ఇరవై నిమిషాలపాటు టీవీలో చేసిన ప్రసంగంలో అనేక చెత్త మాటలు అతని నోటి నుంచి వచ్చాయి. ఎన్నికల్లో తనను ఓడించేందుకు చైనా కమ్యూనిస్టులు గతంలో జోక్యం చేసుకున్నారని ఇప్పుడు మధ్యంతర ఎన్నికల్లో అదే పనిచేస్తున్నారని ఆరోపించాడు. నవంబరు మూడవ తేదీన జరిగే పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో జనం ఏ తీర్పు ఇస్తారో తెలియదుగానీ, అధికార రిపబ్లిన్లకు ఎదురుదెబ్బ తగిలి ఉభయ సభల్లో మెజారిటీ కోల్పోతే దానికి కారణం చైనీయులే అని చెప్పేందుకు ముందుగానే ఒక సాకు సిద్ధం చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్ ఎప్పటికైనా చైనాలో విలీనం కావాల్సిందే. అక్కడ ప్రత్యేక దేశమా, విలీనానికి అనుకూలమా అనే ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతాయి. ఒకే భాష, ఒకే జాతి అయిన అక్కడే అలాంటి పని చేయని చైనా ఎక్కడో సుదూరంగా ఉండి, తమ భాష అర్ధంగానీ అమెరికాలో డోనాల్డ్ ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఏ భాషలో ప్రచారం చేస్తుంది ? అయినా చైనా చెప్పగానే అమెరికన్లు మారేట్లయితే ఏకంగా కమ్యూనిస్టులనే ఎన్నుకోవాలని ప్రచారం చేయవచ్చు కదా! చరిత్రలో మతోన్మాదులు తమ వ్యతిరేక మత కేంద్రాల మీద దాడులు చేశారు, కూలగొట్టిన చరిత్రను మూటగట్టుకున్నారు. మన కళ్ల ముందే బాబరీ మసీదును కూల్చి అక్కడే రామాలయాన్ని నిర్మించారు. కమ్యూనిస్టులు వస్తే ప్రార్ధనా మందిరాలను కూల్చివేస్తారన్నది తప్పుడు ప్రచారం. రష్యా, చైనా, తూర్పు ఐరోపా దేశాలలో ఒక్క చర్చీని కూడా కూల్చివేయలేదు. గతంలో, వర్తమానంలో చైనా అలాంటి జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. భవిష్యత్‌లో జరిగేందుకు ఆస్కారమూ లేదు. అయినప్పటికీ ట్రంప్ అలాంటి తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నట్లు!

అమెరికా ఎన్నికల్లో కమ్యూనిస్టులు లేదా ఇతర పురోగామివాదులు ఒక పార్టీగా అక్కడ పాతుకుపోయిన రెండు ప్రధాన పార్టీలను దెబ్బకొట్టగలిగిన స్థితిలో లేరు అన్నది ఒక వాస్తవం. రెండవది, గత కొన్ని దశాబ్దాలుగా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టి జనాల బుర్రలను ఖరాబు చేసిన సంగతి కూడా తెలిసిందే. గతంతో పోలిస్తే కొంత మార్పు వచ్చిన్పటికీ అది చాలదు. మన దేశ స్వాతంత్య్ర ఉద్యమ దశ, దిశను మార్చేందుకు పురోగామి వాదులు అనేక మంది కాంగ్రెస్ సోషలిస్టులుగా ప్రత్యేకతను ప్రదర్శిస్తూ కాంగ్రెస్‌లో అంతర్భాగంగానే పని చేసిన చరిత్ర తెలిసిందే. అమెరికాలో కూడా అదే జరుగుతున్నట్లు చెప్పవచ్చు. అయితే అక్కడి డెమోక్రటిక్ సోషలిస్టు పార్టీలో ఉన్నవారందరూ సోషలిజానికి, కమ్యూనిజానికి అనుకూలురని చెప్పలేము. ఆ భావజాలానికి కట్టుబడి పనిచేయాలని కోరుకొనే వారు కూడా గణనీయంగా ఉన్నారు. చివరివరకు ఎంతమంది నిఖరంగా నిలుస్తారు, నిలవరు అనేది చరిత్ర చెప్పాల్సిందే. సోషలిస్టు భావాలను కలిగిన రెండు సంస్థలు, కొందరు వ్యక్తులు 1982లో డెమోక్రటిక్ సోషలిస్టు పార్టీ(డిఎస్‌పి)గా ఏర్పడి డెమోక్రటిక్ పార్టీలోనే పని చేయటం ప్రారంభిం చారు.నాడు కొన్ని వందల మంది మాత్రమే సభ్యులుగా ఉండగా నేడు లక్షా పదివేల మంది వరకు ఉన్నట్లు అంచనా. సోషలిస్టులమని చెప్పుకునేందుకే భయపడిన రోజుల నుంచి నేడు లక్షలాది మంది తామూ అదే ఇస్టులమని గర్వంగా చెప్పుకొనేం తంగా ఆ ఉద్యమం ఎదిగింది. బెర్నీ శాండర్స్ సెనెటర్‌గా ఎన్నికతో ప్రారంభమైన ఆ పురోగమనం 2028 ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో గవర్నర్ పదవుల కోసం, మరో రెండు చోట్ల గట్టి పోటీ ఇచ్చేందుకు, అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున తమ భావజాలం ఉన్న వ్యక్తిని నిలిపేందుకు అడుగులు వేయటమే ట్రంప్ ఆందోళనకు అసలు కారణంగా చెప్పవచ్చు. అమెరికా కార్పొరేట్ల రాజధాని న్యూయార్క్ పీఠంపై ఇప్పటికే ట్రంప్ దష్టిలో కమ్యూనిస్టుగా ముద్రపడిన డిఎస్‌పి నేత జోహ్రాన్ మందానీ మేయర్‌గా ఉండగా, రాజకీయ అధికార కేంద్రం ఉన్న వాషింగ్టన్ డిసిలో అదే భావజాలం కలిగిన మహిళ మేయర్ కాబోతున్నా రనే వార్తలొచ్చాయి. న్యూయార్క్ నగరంలో మూడు ఎంపీ స్థానాలుండగా వాటికి డెమోక్రాట్లలో డిఎస్‌పి అభ్యర్ధులే ముందువరుసలో ఉన్నారు.

రాజకీయ సర్వే జరపాలని, సెప్టెంబరు 15 నాటికి నివేదిక అందజేయా లని డిఎస్‌పి తన 250శాఖలకు పత్రాలను పంపింది. ఇదంతా అధ్యక్ష ఎన్నికలకు సన్నాహమే. ఆ పార్టీ సెనెటర్ బెర్నీ శాండర్స్ వయస్సు 84 సంవత్సరాలు కావటంతో వేరే వారిని రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు. కార్మిక నాయకురాలు, ప్రజా ప్రతినిధుల సభ సభ్యురాలిగా ఉన్న అలె గ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిత్వంకోసం పోటీపడే అవకాశాలున్నాయని భావి స్తున్నారు. మరో సారి రిపబ్లికన్ పార్టీ తరఫున తానే పోటీ చేయాలని డోనాల్డ్ ట్రంప్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.
జూలై 16న టీవీ ప్రసంగం తీరు చూసిన తరువాత తన పదవికోసం ట్రంప్ ఎంతకైనా తెగిస్తాడని అనేక మంది భావిస్తున్నారు. నవంబరు మూడు మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లను బెదిరించేం దుకు మిలిటరీని దించటంతో పాటు(ఇప్పటికే చికాగో, లాస్ ఏంజల్స్, వాషింగ్టన్ డిసి, తదితర నగరాల్లో ఉన్నాయి), ఓట్ల పెట్టెలను అపహరించటంతో సహా ఏ అక్రమానికైనా పాల్పడవచ్చని చెబుతున్నారు. రిపబ్లికన్లు ఓడిపోతే ఫలితాలను తిరస్కరించే అవకాశం కూడా ఉంది. 2020 అధ్యక్ష ఎన్నికలలో ఓడిపోతున్నట్లు గ్రహించి బ్యాలట్ బాక్సులను తారుమారు చేయాలని చూస్తే అతగాడి అధికార యంత్రాంగంలోని వారే అడ్డుపడటంతో వెనక్కు తగ్గాడు. తరువాత జోబైడెన్ ఎన్నికను గుర్తించకుండా తన అనుచరులతో అమెరికా అధ్యక్ష కేంద్రం మీద దాడి చేయించిన సంగతి తెలిసిందే.తన ప్రసంగంలో రహస్య పత్రాలంటూ కొన్నింటిని పేర్కొంటూ రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా దేశాల నుంచి, కొన్ని సంస్థలు ఎన్నికల్లో జోక్యం చేసుకొనేందుకు చూస్తున్నాయని ట్రంప్ ఆరోపించాడు.అయితే ఎలా అన్నది మాత్రం చెప్పలేదు. తెలుగునాట ముఖ్య మంత్రులుగా పనిచేసిన వారు కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ల పట్ల వ్యవహరించిన తీరును చూశాము. ప్రజాస్వామ్యానికి, భావప్రకటనా స్వేచ్చకు నిలయమని ఊదర గొట్టే అమెరికాలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఎవరి అజెండా వారికి వుంది.తనకు వ్యతిరేకంగా ఎబిసి, ఎన్‌బిసి మీడియా సంస్థలు కుట్రలో భాగస్వాములని, తన ప్రసంగాలను ప్రత్యక్ష ప్రసారం చేయటం లేదని ట్రంప్ ఆరోపించాడు. వాటి లైసన్సు రద్దు చేస్తామని బెదిరించాడు. మధ్యంతర ఎన్నికల్లో గెలిచేందుకు ట్రంప్ ఇరాన్ను ఒక అంశంగా ఎంచుకున్నాడు. సోవియట్‌తో జరిగిన ప్రచ్చన్న యుద్దంలో అణుబూచిని చూపి ఓటర్లను ఆకట్టుకోవటం నాటి అజెండాలలో ఒకటి. టెహరాన్ విషయంలో అది తిరగబడింది. దాని బదులు అనూహ్యంగా హార్ముజ్ జలసంధిపై అదుపు ప్రతిష్టాత్మకంగా మార్చుకొని ఇరుక్కు పోయాడు. రెండవది పాతబడిన రోత ప్రచారం, కమ్యూనిస్టు వ్యతిరేకత. సోవియట్ లేదు గనుక దాని స్థానంలో చైనా కుట్ర అంటూ రెచ్చగొట్టటం. చిత్రం ఏమిటంటే అమెరికాలో కమ్యూనిస్టు పార్టీ ఉన్నప్పటికీ అది అక్కడి పాలకపార్టీలను సవాలు చేసే స్థితిలో లేదు. అందుకే డెమోక్రటిక్ సోషలిస్టులను కమ్యూనిస్టులుగా చిత్రించి ట్రంప్ దాడి చేస్తున్నాడు.అయితే వారంతా తమ కళ్ల ముందు కనిపించేవారు గనుక వారి నుంచి ముప్పు ఎలా వస్తుందో నమ్మించలేకపోతున్నాడు. నిజానికి సాధారణ అమెరికన్లకు ముప్పుగా మారింది “ దేవుడు లేని కమ్యూ నిస్టులు ” కాదు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ దళం(ఐసివి). వారిని చూస్తే జనాలు వణికిపోతారు. ఎవరిని అరెస్టు చేస్తారో, ఎవరిని చంపుతారో తెలియదు. హిట్లర్ నాటి రహస్య హంతక దళాలను అవి గుర్తుకు తెస్తాయి. రెండవసారి ట్రంప్ అధికారానికి వచ్చిన తరువాత ఐసిఇ లేదా సరిహద్దు నిఘా దళానికి చెందిన వారు బూటకపు ఎన్‌కౌంటర్లు చేసి పదకొండు మందిని చంపారు. వీరుగాక వలస వచ్చిన వారిని బంధించిన శిబిరాల్లో మరో 21మంది మరణించారు.

అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నట్లు చేసిన ఆరోపణలను చైనా గట్టిగా తిరస్కరించింది. ప్రతిపక్ష డెమోక్రాట్ల చేతిలో ఓటమిని ఎదుర్కోలేక గత కొన్నేండ్లుగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు తిప్పి కొట్టింది. ఇరవై రెండు కోట్ల మంది ఓటర్ల వివరాలను చైనా సంపాదించిందని, గతంలో అధికారానికి వచ్చినప్పటి నుంచీ అమెరికా మీడియాలో తనకు వ్యతిరేకంగా రాసేందుకు జర్నలిస్టులకు డబ్బు ఇస్తున్నదని, వాణిజ్యవేత్తలను తనకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నదని ట్రంప్ తాజా ప్రసంగంలో ఆరోపించాడు. చైనా వాణిజ్యాన్ని సవాలు చేసిన తొలి అధ్యక్షుడిగా తాను ఉన్నందుకు గాను 2018లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కూడా చైనా జోక్యం చేసుకున్నదని అదే ఏడాది భద్రతా మండలికి ట్రంప్ ఫిర్యాదు చేశాడు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న చైనా ప్రతినిధి రుజువులు చూపాలంటూ సవాలు చేశాడు, ఎలాంటి ఆధారాలను అమెరికా చూపలేకపోయింది. మే నెలలో బీజింగ్ పర్యటనకు వెళ్లిన ట్రంప్ ఆహ్వానం మేరకు సెప్టెంబరులో చైనా నేత షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటనకు వస్తారని చెబుతున్న నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు ట్రంప్ నోటి నుంచి వెలువడటం అతగాడి సంస్కారాన్ని వెల్లడిస్తున్నది.
ఎం.కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -