నిన్నటివరకు తలెత్తి నిలిచిన మనిషి
రాజ్యాలు నేడు తలవంచి తలలేని
దేహాలై మిగిలి పోయాయెందుకో ?
నేల పొరల్లో దాగిన విత్తనం
భూమిని చీల్చుకుంటూ అడ్డుగా నిలిచిన మట్టిని తొలుస్తూ అంకురమై
నిటారుగా విజయగర్వంతో తలెత్తటం
ప్రకృతి సహజధర్మం
స్వేచ్ఛగా నీలాకాశంలో
రెక్కలల్లార్చుకుంటూ ఆకాశమే హద్దుగా
ఎగిరే విహంగాలను
రాకాసి గద్లలు అన్యాయంగా
రెక్కల్ని తుంచేస్తూ కబళిస్తుంటే….
పక్షులన్నీ కలిసి గుంపులుగా చేరి గద్దలను ఎదిరిస్తూ తలెత్తుకుని ఎగరటం నిజం కాదా ?
నేడు మరఫిరంగులు మారణాయుధాలతో
యుద్దోన్మాది ప్రపంచాన నిబ్బరంగా నిలిచిన బడుగు దేశాలను తమకు తలవంచనందుకు దాసోహం కానందుకు
అన్యాయంగా దాడిచేస్తూ
దౌర్జన్యంగా జనహననం కావిస్తూ
నగరాలను శిథిలాలుగా మారుస్తూ
ఆర్థిక మాంద్యాన్ని సృష్టిస్తూ
జనజీవనం అల్లకల్లోల పరుస్తూ
బరితెగించి వీరంగం వేస్తున్నా
నిలువరించలేని ప్రపంచ దేశాలు
ఉనికి మసకబారిన ఐ రా స చేష్టలుడిగి
తలలు వంచుకుని మౌన ప్రేక్షకులైన దీనదశ
మధ్య ప్రాచ్యంలో స్వార్థశక్తులు
రగిల్చిన చమురు మంటల్లో
అరబ్బు సౌధాలు కాలి కూలుతున్నాయి
సహజ వనరులు భస్మీపటలమై
మనిషి మనుగడకు పెనుసవాలు విసిరే
వికృత గతిలో చిరు దేశాలు కుదేలై
మానవత మంట కలుస్తున్నందుకు మనుషులుగా సిగ్గుతో తలొంచుకోవాలి
మనిషే కాదు వెన్నెముకేలేని దేశాధినేతలు
దేశాలు తలలువంచి దౌర్జన్యానికి
సలాములు చేసే దౌర్భాగ్య స్థితిలో
నయా సామ్రాజ్యవాద మదపుటేనుగుల మదమనిచే మరో వీరవియత్నాం
కొత్త పొద్దుపొడుపై తూరుపున
ఆకాశాన్ని వెలిగించి తీరుతుంది
దించిన తలలు తలెత్తి
ప్రపంచ యవనికపై సగర్వంగా
మానవత్వం శాంతి సౌభ్రాతత్వ పతాకాన్ని ఎగరేసి తీరుతాయనేది చారిత్రక సత్యం !
డా. కె. దివాకరాచారి
కొత్త పొద్దుపొడుపై
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



