సామ్రాజ్యవాద అమెరికా దుందుడుకు చర్యలు నేడు సమస్త ప్రపంచాన్ని భీతావహం చేస్తున్నాయి. పాలస్తీనా, వెనెజులా, ఇరాన్.. ప్రపంచమంతటా నేడు అమెరికా రాక్షస చర్యల స్వైర విహారం నడుస్తున్నది. ఆయా స్వతంత్ర దేశాలలోకి చొరబడి, దేశాధ్యక్షులను కిడ్నాప్ చేసి, దేశాధినేతలను రాక్షసంగా హతమార్చే జులుంను అమెరికా సామ్రాజ్యవాదం నిర్లజ్జగా ప్రదర్శిస్తుంటే.. నాగరిక సమాజం నేడు విస్తుపోయి చూస్తున్నది. బరితెగించి.. భూగోళమంతటా స్వైరవిహారం చేస్తున్న ఈ అమెరికా మదపుటేనుగుకు ముకుతాడు వేసి, చిత్తు చిత్తుగా ఓడించిన ఘనత ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్క దేశానికి దక్కుతుంది. ఆ దేశమే.. వీర వియత్నాం! ఆ దేశానికి నాడు నాయకత్వం వహించి సామ్రాజ్యవాద అమెరికాను మట్టికరిపించిన మహానేతగా చరిత్రలో నిలిచిన వాడు హోచిమిన్! ఆ వీరయోధుడి 136వ జయంతి నిన్నటి మే 19! నాడు ఫ్రాన్స్ వలస దేశంగా కొనసాగుతున్న ఇండోచైనాలోని అన్నాం ప్రాంతంలో మే 19, 1890 న ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో హోచిమిన్ జన్మించాడు. ఆయన తండ్రి ఒక టీచర్. పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు గుయన్ సిన్ కుంగ్. దేశ విముక్తి కోసం ఆయన చేపట్టిన రహస్య పోరాటంలో భాగంగా ఆయన సుమారు 50 పేర్లతో చలామణి అయ్యాడు. చివరికి 1941 లో హోచిమిన్ అనే పేరు స్థిరపడింది.
హోచిమిన్ తన చిన్న నాటి నుండి తన దేశంలో తిష్ట వేసిన వలసవాద పాలకుల పట్ల తీవ్ర వ్యతిరేకను కనబరిచేవాడు. 1789 ఫ్రెంచి విప్లవ నినాదాలయిన.. “స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం” పదాలను వలస పాలకులు తమ ఆధీనంలోని వియత్నాం దేశంలోని పట్టణాలలో సైతం గొప్పగా ప్రదర్శిస్తుండేవారు. కాలేజీ విద్యార్థిగా హోచిమిన్ ఆ పదాలను చూపుతూ వలస పాలకుల ద్వంద్వ వైఖరిని వెక్కిరిస్తూ మాట్లాడేవాడు. “స్వేచ్ఛ, సమానత్వ సూత్రాలు ఇతర దేశాలకు వర్తించవా, వలసవాద పాలకుల్లారా!”అంటూ ఎగతాళి చేస్తూ స్థానిక ప్రజల్ని చైతన్యపరిచేవాడు.
ఉదర పోషణార్థం నౌకలో వంటవాడిగా చేరి సముద్రయానంలో భాగంగా.. ఆయా దేశాల పరిస్థితులను అధ్యయనం చేసే అవకాశం హోచిమిన్ కి ఒక వరంగా పరిణమించింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లోనూ కొద్ది రోజులు నివాసం ఏర్పరచుకుని అక్కడి సోషలిస్టు పార్టీలో సభ్యుడిగా చేరి తన అవగాహనా పరిధిని విస్తృత పరుచుకున్నాడు. ఆ సమయంలోనే 1920లో ఒక మిత్రుడు.. ఫ్రెంచ్ పత్రిక “లుమ్మెనైట్” తాజా సంచికను హోచిమిన్ చేతుల్లో పెట్టాడు. సామ్యవాద సోవియట్టు రాజ్య నిర్మాత లెనిన్ రాసిన “జాతులు మరియు వలస దేశాల సమస్యలపై” అనే వ్యాసం ఆ పత్రికలో చదివాడు హోచిమిన్. ఆ వ్యాసంలో భాగంగా లెనిన్ చేసిన ప్రతిపాదనలు హోచిమిన్ మస్తిష్కంపై చెరగని ముద్ర వేసాయి. ప్రపంచవ్యాప్తంగా సమన్యాయ వ్యవస్థ స్థిరపడడానికి వలస దేశాల ప్రజల విముక్తి కీలకమని లెనిన్ అందులో ప్రతిపాదించాడు. తనతోపాటు అక్కడ ప్రవాస జీవితం గడుపుతున్న ఇతరులకు ఆ వ్యాసాన్ని చూపి.. “ఇగో.. ఇదీ ఇక మనం నడవాల్సిన తోవ!” అంటూ గట్టిగా అరిచే వాడట హోచిమిన్.
లెనిన్ వ్యాసం తన కళ్ళ ముందుంచిన ప్రత్యామ్నాయ పంథా గురించి మరింత తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఆయన సోవియట్ యూనియన్ చేరుకున్నాడు. అక్కడి పార్టీ నాయకులతో సంప్రదించి లెనిన్ తో సమావేశం కావడానికి ఎదురుచూస్తున్న వేళ.. అకస్మాత్తుగా లెనిన్ మరణించడంతో.. ఆ అవకాశం హోచిమిన్ కు దక్కకుండా పోయింది. 1941లో స్వదేశానికి తిరిగి వచ్చిన హోచిమిన్.. ఇండో చైనా కమ్యూనిస్టు పార్టీ మరియు వియత్ మిన్ సంస్థల నాయకత్వంలో.. వలసవాదుల చేతుల నుండి దేశాన్ని విముక్తం చేయడానికి పోరాటం తీవ్రతరం చేశాడు. ఫ్రెంచి వలసవాదులను ఓడించి, స్వదేశీ ప్రభువులను గద్దె దించి.. వియత్నాం ఒక స్వతంత్ర ప్రజాస్వామిక దేశంగా.. 2 సెప్టెంబర్ 1945న అవతరించింది. అయితే వియత్నాంలోని కొంత భాగం సౌత్ వియత్నాం పేరుతో.. సామ్రాజ్యవాదులతో కుమ్మక్కైన దళారీ నేతల చేతుల్లోనే ఉండి పోయింది. సౌత్ వియత్నాం పాలకులకు నాడు.. ఫ్రాన్స్ బ్రిటన్ అమెరికా సామ్రాజ్యవాదులు అండగా నిలిచారు.
వియత్నాం ఏకీకరణ కోసం హోచిమిన్ నాయకత్వంలో పోరాడుతున్న వియత్నాం దేశభక్త శ్రేణులకు, సామ్రాజ్యవాద అమెరికాకు మధ్య యుద్ధం 20 సంవత్సరాల పాటు సాగింది. 1955లో వియత్నాంలో అమెరికా జోక్యం ప్రారంభమై.. 1965 నుండి అమెరికా సైనికులు వియత్నాం గడ్డపై ప్రత్యక్షంగా దాడులు చేయడం మొదలుపెట్టారు. హోచిమిన్ నాయకత్వంలో రైతులు గెరిల్లాలుగా మారి అమెరికా సైనికులను ముప్పు తిప్పలు పెట్టారు. 1970 తర్వాత యుద్ధం తీవ్ర రూపం దాల్చి.. వియత్నాంలో చనిపోయిన అమెరికా సైనికుల శవాలతో అమెరికా గడ్డపై ప్రతి రోజూ విమానాలు దిగుతుంటే.. అమెరికా పాలకుల్లో వణుకు మొదలైంది. చిట్టెలుకలు అనుకున్న వాళ్లు సింహాలుగా మారి అమెరికా సైనికులను తరిమికొడుతుంటే.. ఏం చేయాలో అమెరికా సామ్రాజ్యవాదులకు పాలుపోలేదు. నాడు ప్రపంచవ్యాప్తంగా వియత్నాం వీరులకు మద్దతుగా సంఘీభావం వెల్లువెత్తింది. బ్రిటన్ లో బెట్రాండు రస్సెల్ లాంటి మేధావులు అమెరికా దుర్నీతికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించారు. స్వయంగా అమెరికా గడ్డపై సైతం సామాన్య ప్రజలు వీధుల్లోకి వచ్చి వియత్నాం యుద్ధము నుండి అమెరికా వైదొలగాలని డిమాండ్ చేశారు. మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వారు ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించారు. భారతదేశంలోనూ వియత్నాం సంఘీభావ ప్రదర్శనలు అన్ని నగరాల్లోనూ జరిగినవి. కలకత్తా ముంబాయి ఢిల్లీ వీధుల్లో ఆ రోజుల్లో ఒక నినాదం ప్రముఖంగా వినపడేది. “హమారా నామ్, తుమారా నామ్.. వియత్నాం, వియత్నాం!” అంటూ మన దేశ ప్రజలు గొంతెత్తి నినదించారు. అమెరికా సామ్రాజ్యవాదానికి ఇక ముగింపు పలకాలని నాడు ప్రపంచ ప్రజలు డిమాండ్ చేశారు.
హోచిమిన్ ఒకవైపు గుండెపోటుతో బాధపడుతున్న సమయంలో.. జూలై 1969లో, వియత్నాంలోని మాజీ ఫ్రెంచ్ అధికారి అయిన జీన్ సైంటెనీ, అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ నుండి వచ్చిన రాయబార సందేశాన్ని హోచిమిన్ కు అందించాడు. నిక్సన్ లేఖ.. జరుగుతున్న “విషాద యుద్ధాన్ని” ముగించేందుకు కలిసి పనిచేయాలని ప్రతిపాదించింది. అయితే.. రాబోయే నవంబర్ ఒకటిన పారిస్‌లో జరిగనున్న శాంతి చర్చలలో ఉత్తర వియత్నాం ఎటువంటి రాయితీలు ఇవ్వకపోతే.. “గొప్ప పరిణామాలు మరియు బలవంతపు చర్యలను” మేము చేపడతామని నిక్సన్ హెచ్చరించాడు. నిబ్బరంగా నిక్సన్ కు ప్రత్యుత్తర లేఖ పంపించాడు హోచిమిన్. యుద్ధాన్ని ముగించే మార్గం కోసం అమెరికాతో శాంతి చర్చలను స్వాగతిస్తున్నామని తెలిపాడు. నిక్సన్ బెదిరింపులకు ఎలాంటి జవాబు మాత్రం ఆ లేఖలో లేదు. హోచిమిన్ ప్రదర్శించిన ఆత్మాభిమానం ముందు సామ్రాజ్యవాదుల దురహంకారం ఆ విధంగా వెలవెలబోయింది! ప్రపంచవ్యాప్తంగా ప్రజాభిప్రాయం తమకు వ్యతిరేకంగా వెల్లువెత్తడంతో పాటు.. వీర వియత్నాం సైనికుల ముందు తమ ప్రతాపం పనిచేయడం లేదన్న దాఖలాలు కనిపించడంతో.. తప్పనిసరై.. అవమానకర రీతిలో మార్చి 1973 నుండి అమెరికా వియత్నాం నుండి తన సేనలను క్రమక్రమంగా ఉపసంహరించు కోవడం మొదలుపెట్టింది.
అమెరికాతో యుద్ధం సాగుతున్నప్పుడే.. 1969 సెప్టెంబర్ 2న.. హోచిమిన్ కన్నుమూశాడు. హోచిమిన్ వారసులైన ఫామ్ వాన్ డాంగ్ మరియు ఇతర నాయకులు.. హోచిమిన్ వదిలి పోయిన కర్తవ్యాల్ని విజయవంతంగా పూర్తి చేశారు.1975లో సౌత్ వియత్నాంను పాలిస్తున్న పాలకులు పారిపోవడంతో వియత్నాం ఏకీకరణ పూర్తై హోచిమిన్ కలలు కన్న సామ్యవాద వియత్నాం సంపూర్ణంగా అవతరించింది. డేవిడ్ అనే బక్కచిక్కిన మనిషి గోలియత్ అనే మహా రాక్షసుడిని ఒంటిచేత్తో సంహరించిన వృత్తాంతం గురించి పురాణాలు గొప్పగా చెబుతాయి. ఆ పురాణాల్లో జరిగింది నిజమో కాదో ఎవరూ చెప్పలేరు. కానీ, వాస్తవ ప్రపంచంలో.. బలవంతు డైన సామ్రాజ్యవాద అమెరికాను.. పేద దేశమైన వీర వియత్నాం చిత్తుచిత్తుగా ఓడించిన ఘన చరిత్ర ఇది! చెడుపై మంచి ఏనాటికైనా విజయం సాధిస్తుందనడానికి ప్రబల నిదర్శనంగా నిలిచిన ఈ వర్తమాన చరిత్రను ప్రపంచానికి అందించిన ఘనత వీర వియత్నాంది.. ఆ దేశ నాయకుడైన అమర హోచిమిన్ ది!
(మే 19 హోచిమిన్ జయంతి)
ఆర్. రాజేశమ్
9440443183
సామ్రాజ్యవాదులను మట్టి కరిపించిన హోచిమిన్!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



