Thursday, May 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కన్నీళ్లు

కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కన్నీళ్లు

- Advertisement -


లారీలు లేక 25 రోజులుగా ధాన్యం నిల్వ
ప్రకటనలకే పరిమితమైన అధికారులు..

క్షేత్రస్థాయిలో చేతులెత్తేసిన యంత్రాంగం
నవతెలంగాణ – కాటారం

వరి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. కాటారం మండలంలోని గుమ్మాలపల్లి రైతులు కొనుగోలు కేంద్రాల్లో 25 రోజులుగా ధాన్యం బస్తాలు పేరుకుపోయినా లారీలు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురై ధన్వాడ గ్రామ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. “రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.. కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయి” అంటూ అధికారులు చేస్తున్న ప్రకటనలు కేవలం పేపర్లకే పరిమితమయ్యాయని, క్షేత్రస్థాయిలో మాత్రం యంత్రాంగం పూర్తిగా విఫలమైందని రైతులు మండిపడ్డారు. పంట పండించడానికి అప్పులు చేసి, ఎండల్లో శ్రమించి తీసుకొచ్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రోజుల తరబడి పడేయడం రైతులపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు లేక ధాన్యం తరలింపు నిలిచిపోవడంతో రైతులు నరకయాతన అనుభవిస్తున్నారని తెలిపారు. వర్షాలు పడితే తడిసిపోయే ధాన్యానికి బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. రైతుల కష్టాన్ని పట్టించుకోకుండా లారీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరోవైపు PACS నిర్వాహకులు కూడా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సరైన సమాచారం ఇవ్వకుండా, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకుండా రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని మండిపడ్డారు. రైతుల పొట్ట కొడుతున్న లారీ కాంట్రాక్టర్, PACS నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని, అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని రైతులు హెచ్చరించారు. రైతుల ఆగ్రహంతో కొంతసేపు రోడ్డుపై రాకపోకలు అంతరాయం కలిగాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -