వెనుకబడిన వారెవరో ఏ ప్రభుత్వమైనా తెలుసుకోవాల్సిందే : సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించే ప్రక్రియలో భాగంగా కులాన్ని నిర్ధారించడంలో ఏ ప్రభుత్వ తప్పిదమైనా ఏమీ వుండదని సుప్రీం కోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. ‘‘ఎంతమంది వెనుకబడి వున్నారు, ఎంతమందికి సంక్షేమ చర్యలు అవసరం అనేది అప్పటి ప్రభుత్వం తప్పనిసరిగా తెలుసుకోవాల్సి వుంటుంది. ఇది విధానపరమైన అంశం.’’ అని త్రిసభ్య ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ పేర్కొన్నారు. కులగణనను 2027 జనగణన ప్రక్రియలో భాగం చేయరాదంటూ పిటిషనర్ సుధాకర్ గుమ్ముల దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘రాజకీయ నేతలు, కార్పొరేట్ సంస్థలు కుల డేటాను దుర్వినియోగం చేయడా నికి అపారమైన అవకాశాలు వున్నాయి. అటువంటప్పుడు పెద్ద మొత్తంలో కులాల డేటాను సమీకరించడంలో అర్ధం లేదు.’’ అని గుమ్ముల వాదించారు.
2027 జనగణనలో కుల గణన తప్పనిసరిగా వుండాలా లేదా అనే అంశంపై నిర్ణయం కోర్టు పరిధిలో లేదని చీఫ్ జస్టిస్ చెప్పారు. ఈ అంశం తప్పనిసరిగా విధానపరమైన పరిధిలోకి వస్తుందని అంటూ కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. 2027 జనగణనలో కుల గణన ను చేర్చాలని గతేడాది ఏప్రిల్‌లో జరిగిన సమావేశంలో రాజకీయ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ నిర్ణయించింది. 2027 జనాభా లెక్కల రెండవ దశలో కుల గణనను పొందుపరచచున్నట్లు పార్లమెంట్‌లో ప్రభుత్వం తెలియ చేసింది. తొలిదశలో ప్రతిఒక్క కుటుంబం ఇళ్ల పరిస్థితులు, ఆస్తులు, సదుపాయాలు వంటి వాటికి సంబంధించి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్‌ఎల్‌ఓ) సేకరణ వుంటుంది. రెండో దశలో, ప్రజల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, ఇతర వివరాలు సేకరిస్తారు. 2011 జనాభా లెక్కల వరకు, ఈ ప్రక్రియలో కేవలం ఎస్సీ, ఎస్టీలను మాత్రమే లెక్కించేవారు.
కులగణన నిర్వహించడంలో తప్పేమీలేదు
- Advertisement -
- Advertisement -



