విదేశాల్లో మాట్లాడటం తప్ప, స్వదేశంలో చర్యల్లేవు : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి
ఎం ఏ బేబీ
న్యూఢిల్లీ : పశ్చిమాసియాలోని పరిణామాల నేపథ్యంలో తలెత్తిన ఇంధన సంక్షోభం సాకుతో ప్రధాని మోడీ తప్పించుకోలేరని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ పేర్కొఅన్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ఇప్పటికే ఇంధన ధరలను రెండుసార్లు పెంచిందని, రాబోయే కాలంలో మరిన్ని పెంపులు వుండవచ్చని భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ పెంపు ప్రభావం నిత్యావసరాల ధరల్లో కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత బాగా వుందని, దీంతో ప్రజలకు బ్లాక్ మార్కెట్‌పై ఆధారపడడం తప్ప మరో అవకాశం లేకుండా పోయిందన్నారు. పైగా రూపాయి విలువ గతంలో ఎన్నడూ లేని రీతిలో అత్యంత కనిష్టానికి చేరుకుందని, ప్రపంచంలో అత్యంత అధ్వాన్నంగా వున్న ప్రధాన కరెన్సీ ఇదేనని బేబీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో బుధవారం పోస్టు పెట్టారు. ఉద్యోగాల్లేవని, ఆదాయ వనరులు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైనవి కొనాలంటే అధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందన్నారు. ఈ ధరల పెంపుతో ప్రజల దగ్గర వున్న డబ్బుకు విలువ లేకుండా పోయిందన్నారు. ఇక ఇప్పడు, రుతు పవనాలు వస్తున్నాయి, కానీ ఈసారి సాధారణ సగటు కంటే కూడా వర్షపాతం తక్కువగా వుంటుందని భావిస్తు న్నారు. పైగా ఎరువుల కొరత నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఎరువుల వినియోగం తగ్గించాలని కోరడం తప్ప మరేమీ చర్యలు తీసుకోవడం లేదని బేబీ విమర్శించారు. పరిస్థితులన్నీ కలిసి కీలక దశకు చేరుకుంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి మోడీ విదేశాల్లో వున్నపుడు ‘తీవ్ర దారిద్య్రం మళ్ళీ తలెత్తుతోంది’ అంటూ మాట్లాడతారు గానీ స్వదేశంలో ఆ సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని బేబీ విమర్శించారు. ప్రస్తుత సంక్షోభానికి మూలం మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న దేశీయ, విదేశాంగ విధానాల్లోనే వుందన్నది అసలైన వాస్తవమని ఆయన పేర్కొన్నారు. అదానీలు, అంబానీలకు, ట్రంప్‌లకు మాత్రమే అనుకూలంగా వుండేలా రూపొందించే విధానాలు కార్మికులు, కర్షకులు, చిన్న వ్యాపారుల ప్రయోజనాలకు పూర్తి విరుద్ధంగా వుంటాయని బేబీ తెలిపారు. ‘ఇంధన సంక్షోభం’ సాకుతో మోడీ ప్రతీదాన్ని సమర్ధిం చుకోలేరు. వీటి నుండి తప్పించుకోలేరు, ప్రజల ప్రయోజనాలకే పెద్ద పీట వేయాలి, తక్షణమే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని బేబీ కోరారు.
ఇంధన సంక్షోభం సాకుతో ప్రధాని తప్పించుకోలేరు
- Advertisement -
- Advertisement -


