– ఎంపీ గోడం నగేష్ చేతుల మీదుగా మదర్ ఫీడింగ్ సెంటర్ ప్రారంభోత్సవం…
నవతెలంగాణ – బజార్ హాత్నూర్: మాతా శిశు ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా బజార్ హాత్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో మదర్ ఫీడింగ్ సెంటర్ (మాతా శిశువుల పాలిచ్చే గది)ను ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ ప్రారంభించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో తల్లులు, శిశువులకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ఎంపీ తెలిపారు. గ్రామీణ ప్రాంత మహిళలు ఆసుపత్రులకు వచ్చే సమయంలో శిశువులకు సౌకర్యవంతంగా పాలిచ్చేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మాతా శిశు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలు ప్రభుత్వ ఆరోగ్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మదర్ ఫీడింగ్ సెంటర్‌లో తల్లులు గోప్యతతో పాటు పరిశుభ్రమైన వాతావరణంలో శిశువులకు పాలిచ్చే విధంగా వసతులు కల్పించారు. ఈ కార్యక్రమం స్థానిక ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించేందుకు దోహదపడుతుందని వైద్య అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు, మాజీ జడ్పిటిసి పతంగి బ్రహ్మానందం, పిఏసిఎస్ చైర్మన్ వెంకన్న, రైల్వే బోర్డు సభ్యులు గణేష్ భోసారె, మండల అధ్యక్షులు పోరెడ్డి శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి కొత్త శంకర్, కేంద్రీ శివ, కనపర్తి చంద్రకాంత్, జాదవ్ రమేష్, మల్లికార్జున్, సూది నందు తదితర నాయకులతో పాటు అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.



