దేశ సర్వోన్నత న్యాయస్థానం… సామాన్యుడి ఆఖరి ఆశాదీపం. రాజ్యాంగ నిబంధనలకు, పౌర హక్కులకు రక్షణ కవచం. అటువంటి అత్యున్నత పీఠం నుండి వెలువడే ప్రతి మాట సమాజానికి ఒక దిక్సూచి కావాలి. కానీ, అదే న్యాయస్థానం వేదికగా సాక్షాత్తూ దేశ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నోటి నుంచి వచ్చిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ప్రజాస్వామ్యవాదుల గుండెల్లో మంటలు రేపాయి. దేశంలో నిరుద్యోగ యువత ‘బొద్దింకల్లా’ తయారయ్యారని, పనిపాట లేకుండా సోషల్ మీడియాలో తిరుగుతున్నారని, ఆర్టీఐ కార్యకర్తలుగా మారి ‘వ్యవస్థలపై దాడి’ చేస్తున్నారన్న విమర్శలు సంచలనంగా మారాయి. ఏదో వీధి మూల రాజకీయ నాయకుడో, బాధ్యతా రహితమైన శక్తులో అన్న మాటలైతే కొట్టిపారేయవచ్చు. కానీ, రాజ్యాంగ పరిరక్షకులే ఇలాంటి సామాజిక అసహనాన్ని ప్రదర్శిస్తే, ఇక సామాన్యుడి గొంతుకకు రక్షణ ఎక్కడ? ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే… వ్యవస్థ లోపాలను ప్రశ్నిస్తున్న యువత బొద్దింకలా? లేక ఆ ప్రశ్నలను తట్టుకోలేక ప్రజాస్వామ్య పునాదులను లోపల నుంచి తొలిచేస్తున్న చెదలు లాంటి అధికార యంత్రాంగమా? ఒక సీనియర్ అడ్వకేట్ హోదాకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. న్యాయస్థానాలు విమర్శలకు అతీతం కావు, అలాగని వారి వ్యాఖ్యల ప్రభావం సమాజంపై తక్కువగా ఉండదు. న్యాయమూర్తులు వాడే ప్రతి పదం రాజ్యాంగ విలువల తూకంతో, అత్యంత సంయమనంతో కూడి ఉండాలి. కానీ, ఈ ఉదంతంలో రాజ్యాంగ గంభీరత కంటే సామాజిక అసహనమే స్పష్టంగా గోచరించింది.
“There are parasites in society…” (సమాజంలో పరాన్నజీవులు ఉన్నారు…)
“There are youngsters like cockroaches…” (బొద్దింకల్లాంటి యువత ఉన్నారు…)
ఈ రెండు వాక్యాలు కేవలం కోర్టు హాల్లో సాగిన వాదోపవాదాల ఆగ్రహావేశాలు కావు. ఇవి ఒక ప్రమాదకరమైన సామాజిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయి. దీని ప్రకారం… ప్రశ్నించే యువకుడు ఒక ‘ప్రమాదం’, సమాచారాన్ని ఆశించే ఆర్టీఐ కార్యకర్త ఒక ‘పీడ’, సోషల్ మీడియా ద్వారా పాలకులను నిలదీసే పౌరుడు ‘వ్యవస్థకు విఘాతకుడు’. కానీ వాస్తవ చిత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది.
ఈ దేశంలో కోట్లాది మంది యువతీ యువకులు డిగ్రీలు, పీజీలు చేతపట్టుకుని ఉద్యోగాల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. కోచింగ్ సెంటర్ల ఇరుకు గదుల్లో జీవితాలను కరిగిస్తూ, నోటిఫికేషన్ల కోసం చాతక పక్షుల్లా ఎదురుచూ స్తున్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కుంచించుకు పోతున్నాయి, ప్రైవేటీకరణ కోరలు చాస్తోంది, కాంట్రాక్ట్-అవుట్‌సోర్సింగ్ విధానాలు యువత భవిష్యత్తును అస్థిరతలోకి నెడుతున్నాయి.ఇలాంటి నైరాశ్య పూరిత వాతావరణంలో, తమ ఉనికిని చాటుకోవడానికి, సమాజంలో మార్పు కోసమో, లేదా కనీస హక్కుల రక్షణ కోసమో యువత సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు.
పౌర హక్కుల ఉద్యమాల్లో భాగస్వాములవు తున్నారు. సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) ద్వారా వ్యవస్థలోని లొసుగులను ఎత్తిచూపుతున్నారు. తమ ఆవేదనను వ్యక్తపరచడానికి లభించిన ఈ కనీస ప్రజాస్వామ్య మార్గాలను ఎంచుకోవడం నేరమెలా అవుతుంది? వారిని పనిపాట లేని ‘బొద్దింకలు’గా ముద్రవేయడం ఏ రకమైన న్యాయం? సమాచార హక్కు చట్టం-2005 అనేది ఈ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలురాయి. ప్రభుత్వాల మూసిఉంచిన గదుల్లో సాగే అవినీతి భాగోతాలను బద్దలు కొట్టి, పారదర్శకతను తీసుకురావడానికి పౌరుడికి లభించిన బ్రహ్మాస్త్రం. గడిచిన రెండు దశాబ్దాలుగా ఎందరో ఆర్టీఐ కార్యకర్తలు తమ ప్రాణాలను పణంగా పెట్టి పెద్ద పెద్ద కుంభకోణాలను బయటపెట్టారు. దేశవ్యాప్తంగా వందలాది మంది ఆర్టీఐ కార్యకర్తలు బడా బాబుల చేతుల్లో దారుణంగా హత్యకు గురైన ఉదంతాలు నిత్యం పత్రికల్లో చూస్తూనే ఉన్నాం.తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అవినీతిపై పోరాడుతున్న సామాజిక కార్యకర్తలను, వ్యవస్థను ప్రశ్నిస్తున్న పౌరులను ‘పరాన్నజీవులు’గా చిత్రీకరించడం అంటే… అది కేవలం ఒక వ్యక్తిగత విమర్శ కాదు. ఈ దేశ పౌర చైతన్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని అవమానించడమే. వ్యవస్థను ప్రశ్నించడం అనేది వ్యవస్థపై దాడి కాదు, అది ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు వంటిది. ప్రజలు ప్రశ్నించడం మానేస్తే రాజ్యాంగం కేవలం ఒక కాగితపు గ్రంథంగా మిగిలిపోతుంది. పౌరులు నిలదీయకపోతే పాలనా వ్యవస్థలు నియంతృత్వాలుగా మారిపోతాయి.
ఇదే సందర్భంలో దేశ రాజధాని ఢిల్లీలోని న్యాయవాదుల ఎల్‌ఎల్‌బీ డిగ్రీలపై సీబీఐ విచారణ చేయిస్తానంటూ వచ్చిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాం శంగా మారాయి. తప్పు చేసిన వారిని, నకిలీ సర్టిఫికెట్లతో చలామణీ అవుతున్న వారిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, కొంతమంది చేసిన తప్పులను సాకుగా చూపిస్తూ, కోర్టులను నడిపించే మొత్తం న్యాయవాద వృత్తినే అనుమానించేలా మాట్లాడటం శ్రేయస్కరం కాదు. ఎలుకలు ఉన్నాయని ఇల్లంతా తగలబెట్టుకోలేం కదా! వ్యవస్థలో లోపాలు ఉన్నప్పుడు వాటిని సంస్కరించాలి తప్ప, ఆ లోపాల సాకుతో సమూహాల మొత్తాన్ని కించపరచడం ప్రమాదకరమైన ధోరణికి దారితీస్తుంది. ప్రస్తుత సామాజిక ముఖచిత్రాన్ని పరిశీలిస్తే, ఈ దేశంలో నిజమైన పరాన్నజీవులు ఎవరో స్పష్టమవుతుంది. పగలు రాత్రి తేడా లేకుండా, రోజుకు పన్నెండు గంటలు చెమటోడ్చినా కనీస వేతనం దక్కక, ఆకలితో అలమటిస్తున్న కార్మికులా? రెక్కలు ముక్కలు చేసుకుని చదివించిన తల్లిదండ్రుల కలలను నిజం చేయలేక, ఉద్యోగం రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువతా? కాయకష్టం నమ్ముకున్న శ్రామికులా?కచ్చితంగా కాదు! ప్రజల సొమ్మును, దేశ వనరులను కొల్లగొట్టి, కార్పొరేట్ సామ్రాజ్యాలను ఏలుతూ, రాజకీయ, అధికార అండదండలతో చట్టాల కన్నుగప్పి తిరుగుతున్న బడా చోరులే ఈ సమాజానికి పట్టిన అసలైన పరాన్నజీవులు.
వారిపై కరడుగట్టని చట్టాలు, ప్రశ్నించే సామాన్యుడిపై మాత్రం గర్జిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఏ అధికార స్థానమూ విమర్శలకు, జవాబుదారీతనానికి అతీతం కాదు. ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవుల్లో ఉన్నవారు మాట్లాడే భాష సమాజంలో శాంతిని, నమ్మకాన్ని పెంపొందించేలా ఉండాలి. ఆ పదవులు వ్యక్తిగత ఆక్రోశాలను, అహంకారాలను ప్రదర్శించడానికి కాదు.
ఈ దేశ యువతను ‘బొద్దింకలు’గా చూసే సంకుచిత దృష్టి కోణాన్ని పక్కనబెట్టి, ఆ యువత ఎందుకు అంతటి ఆవేదనలో ఉందో, ఎందుకు రోడ్లపైకి వస్తోందో అర్థం చేసుకునే మానవీయ కోణం నేడు దేశానికి అత్యంత అవసరం.
శ్రీహరి బలభక్తుల, 9494924923



