తరుగు పేరుతో రైతులను మోసం చేయడం తగదు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తీగల సాగర్ • మార్కెట్ సందర్శన
నవతెలంగాణ- తాడూర్
నిల్వ ఉన్న మక్కలు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని, తరుగు పేరుతో రైతులను మోసం చేయడం తగదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తీగల సాగర్ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ను గురువారం స్థానిక నాయకులతో కలిసి సాగర్ సందర్శించారు. రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గన్ని బ్యాగులు సమకూర్చి లారీలను పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసి ధాన్యాన్ని తరలించాలన్నారు. మార్కెట్ యార్డులో మక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మొక్కజొన్నను మద్దతు ధరకు అమ్ముదామని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే రోజుల తరబడి నిరీక్షణ తప్పడం లేదని, గన్నీ బ్యాగుల కొరత, హమాలీల పేరుతో కాంటాలు వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కాంటాలు వేసినా పంటను తరలించడానికి లారీలు రావడం లేదన్నారు. మొక్కజొన్న దిగుబడిపై మూడు నెలల కిందటే మార్కెటింగ్ అధికారులకు వ్యవసాయ శాఖ స్పష్టమైన నివేదిక ఇచ్చినా ముందు చూపు లేకుండా వ్యవహరించడం వల్లే ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 2.05.935 ఎకరాల్లో మొక్కజొన్న సాగయిందని తెలిపారు. పంట అధిక విస్తీర్ణంలో సాగు చేసిన విషయం తెలిసి కూడా జిల్లా వ్యాప్తంగా 15 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం సిగ్గుచేటని అన్నారు. దాదాపు 35 లక్షల గన్ని బ్యాగులు అవసరం ఉండగా.. ఇప్పటివరకు 20 లక్షలు గన్ని బ్యాగులు సమకూర్చినట్టు మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారని అన్నారు. అందులో దాదాపు 30శాతం బ్యాగులు పలుకుబడి కలిగిన రైతులకు అందించడం వల్ల సామాన్య రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ధర నిర్ణయించిన ప్రకారం క్వింటా మొక్కజొన్న రూ.2400 ఉండగా.. కొనుగోళ్లలో జాప్యం వల్ల రైతులు బయట మధ్య దళారులకు రూ.1600కే అమ్ముకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు పెంచి మార్కెట్లో నిల్వ ఉన్న వరి ధాన్యం, మొక్కజొన్నను వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు చేసి రైతులకు డబ్బులు వెంటనే ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్ధన్ పర్వతాలు, కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.శ్రీనివాసులు, కందికొండ గీత, దేశ్య నాయక్, నాయకులు పొదిల రామయ్య, కొంపల్లి అశోక్, తారాసింగ్, హనుమంతు, మధు, వెంకటేష్, వెంకటయ్య ఉన్నారు.



