ప్రతి ఇంటికీ 5 మొక్కలు ఉచితం
హెచ్‌ఎండీఏ పరిధిలోని
44 నర్సరీల ద్వారా సరఫరా
నగరంలో పచ్చదనం,
ప్రజారోగ్యానికి పెద్దపీట
త్వరలో తెల్లాపూర్, ఉప్పల్ భగాయత్‌లో ఉచిత ‘మొక్కల మేళా’
ఈ ఏడాది 4.5 కోట్ల మొక్కలు నాటడమే టార్గెట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న జీవనశైలి వ్యాధులకు చెక్ పెడుతూ, పచ్చదనాన్ని పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘వనమహోత్సవం–2026’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు, కాలుష్య నియంత్రణతో పాటు నగరవాసులకు రసాయన రహిత పోషకాహారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ బృహత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హెచ్‌ఎండీఏ అర్బన్ ఫోరెస్ట్ వింగ్ ఆధ్వర్యంలో ఈ ఏడాది నగరం పరిధిలోని లక్ష కుటుంబాలకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
పర్యావరణ సమతుల్యత.. భూగర్భజలాల పెంపు
హైదరాబాద్ జనాభా శరవేగంగా పెరుగుతుండటంతో కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నగరంలో పచ్చదనం క్రమంగా తగ్గుతోంది. దీనివల్ల వాతావరణ మార్పులు, వేడి పెరగడం వంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వనమహోత్సవం ద్వారా పచ్చదనాన్ని పెంచి, పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భూగర్భ జలాలను సంరక్షించడం, జీవవైవిధ్యాన్ని కాపాడటం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది.
6.3 లక్షల టన్నుల పండ్లు, కూరగాయల అవసరం
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి మనిషీ రోజుకు కనీసం 200 గ్రాముల పండ్లు, 300 గ్రాముల కూరగాయలు తీసుకోవాలి. సుమారు 22 లక్షల కుటుంబాలు ఉన్న హైదరాబాద్ మహానగరంలో ఏటా దాదాపు 6.3 లక్షల టన్నుల పండ్లు, కూరగాయలు అవసరమవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో పెరిగిన ధరలు, రసాయనాలు ఉపయోగించి పండించే పంటల కారణంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు స్వచ్ఛమైన ఆహారం లభించడం కష్టంగా మారింది. దీనికి పరిష్కారంగా ఇంటి ఆవరణలు, కిచెన్ గార్డెన్లు, టెర్రస్ గార్డెన్లలో రసాయనాలు లేని పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలను(మామిడి, జామ, సపోటా, రేగు, సీతాఫలం, అంజూర్, బొప్పాయి, అరటి వంటి పండ్ల మొక్కలతో పాటు తులసి, కలబంద, కరివేపాకు, పుదీనా, నిమ్మగడ్డి వంటి ఔషధ మొక్కలను) ఆర్గానిక్ పద్ధతిలో పెంచుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో 44 నర్సరీలు
ప్రజల్లో భాగస్వామ్యాన్ని పెంచేందుకు హెచ్‌ఎండీఏ అర్బన్ ఫోరెస్ట్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. విభాగానికి చెందిన 44 నర్సరీల ద్వారా ప్రతి కుటుంబానికీ 5 ఉచిత మొక్కల చొప్పున (3 పండ్ల మొక్కలు, 2 ఔషధ లేదా అలంకరణ మొక్కలు) అందించనున్నారు. పండ్ల మొక్కల ద్వారా స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది. పక్షులు, సీతాకోకచిలుకలు, పరాగసంపర్క కీటకాలకు ఆవాసం లభించి జీవవైవిధ్యం పెరుగుతుంది. నగరంలో గాలి నాణ్యత పెరిగి పర్యావరణం శుభ్రపడుతుంది. మొక్కలు కావలసిన ప్రజలు తమ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీపై మొబైల్ నంబర్ రాసి, హెచ్‌ఎండీఏ పరిధిలోని 44 నర్సరీల్లో సమర్పించి ఉచితంగా పొందవచ్చు.
త్వరలో ఉచిత పంపిణీ మేళా
ఈ బృహత్ కార్యక్రమంలో భాగంగా హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో తెల్లాపూర్, ఉప్పల్ భగాయత్ నర్సరీలలో త్వరలోనే ఉచిత మొక్కల పంపిణీ మేళా నిర్వహించనున్నారు. మొక్కలు, పంపిణీ మేళాల గురించిన మరిన్ని వివరాల కోసం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ చక్రపాణి (8374449345) ఫారెస్ట్ మేనేజర్లు వంశీ కృష్ణ (9849052634), ప్రణీత్ కౌర్ (9618501983), దీపిక (9441366136), సత్యనారాయణమ్మ (6309029925), నిఖిల్ (9985157768) ను సంప్రందించాలని సూచించారు.
ప్రజా ఉద్యమంగా మలుద్దాం!
‘ఇంటింటా ఫల వృక్షం – కుటుంబానికి పోషణ, నగరానికి హరిత శోభ’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు స్వచ్ఛంద సంస్థలు, రోటరీ క్లబ్‌లు, లయన్స్ క్లబ్‌లు, కాలనీ సంక్షేమ సంఘాలు(ఆర్‌డబ్ల్యూఏ), ప్రజలందరూ భాగస్వాములు కావాలని హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ రోహిత్ గోపిడి కోరారు. నగరంలోని నివాసాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి పౌరుడూ ఒక ఉద్యమాంలా తీసుకుని ఈ నగరాన్ని హరిత నగరంలా, ఆరోగ్యవంతమైన మహానగరంలా తీర్చిదిద్దాలని కోరారు.
లక్ష కుటుంబాలే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



