భాగ్యనగరంలో పట్టా లెక్కనున్న మరో 123 కిలోమీటర్ల మెట్రో
రూ. 38,595 కోట్లతో 7 కారిడార్ల నిర్మాణం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 50:50 భాగస్వామ్యంతో ప్రాజెక్టు
ఫేజ్-3 కింద 39 కిలోమీటర్ల ‘ఫ్యూచర్ సిటీ కారిడార్
త్వరలోనే కేంద్రానికి సవరించిన డీపీఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో కదిలిన ప్రాజెక్టు ఫైల్
నవతెలంగాణ-సిటీబ్యూరో
కొన్నేండ్లుగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్ మెట్రో రెండో దశ పట్టాలెక్కుతోంది.. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో మెట్రో రెండో దశ విస్తరణ పనులను వేగవంతం చేస్తోంది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయడంతో నగరవాసుల కల త్వరలోనే సాకారం కానుంది. కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి జరిపిన చర్చలు సఫలమవడంతో ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయిందని అధికారులు తెలిపారు.
కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యం
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో(జాయింట్ వెంచర్) 50:50 నిష్పత్తిలో చేపట్టనున్నారు. ప్రాజెక్టు వ్యయం, నిర్వహణలో ఇరు ప్రభుత్వాలు సమాన వాటాలను పంచుకోనున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయి ప్రాజెక్టు ఆవశ్యకతను వివరించగా, తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దీనిపై చర్చలు జరిపారు. దీంతో కేంద్రం ఈ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో సహకరించేందుకు ముందుకు వచ్చింది.
రెండు దశలుగా విస్తరణ..
గతంలో ఎనిమిది కారిడార్లు అనుకున్న ప్రాజెక్టును ప్రభుత్వం ఇప్పుడు రెండు భాగాలుగా విభజించింది. ఇందులో భాగంగా ఫేజ్-2 కింద 122.9 కిలోమీటర్ల మేర 7 కారిడార్లను, ఫేజ్-3 కింద 39.6 కిలోమీటర్ల పొడవైన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ కారిడార్ ను నిర్మించాలని నిర్ణయించింది. ఫేజ్-2 నిర్మాణానికి సుమారు 38,595 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
ఫేజ్-2లోని కీలక కారిడార్లు ఇవే..
నగరం నలుమూలలను అనుసంధానిస్తూ రూపొందించిన ఈ కారిడార్లు ప్రయాణికులకు గొప్ప ఊరటనివ్వనున్నాయి. నాగోల్-శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, రాయదుర్గం కోకాపేట (నియోపోలిస్), ఎంజీబీఎస్-చాంద్రాయ ణగుట్ట(పాతబస్తీ మార్గం), మియాపూర్ – పటాన్ చెరు, ఎల్బీనగర్ – హయత్ నగర్, జేబీఎస్-మేడ్చల్, జేబీఎస్-శామీర్ పేట్, ముఖ్యంగా పాతబస్తీ మెట్రో (7.5కి.మీ) కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2వేల కోట్లకు పైగా నిధులు కేటాయించి పనులను వేగవంతం చేసింది. ఈ భారీ ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర ప్రభుత్వం వాటా 18శాతం, రాష్ట్ర ప్రభుత్వం వాటా 30శాతం, విదేశీ రుణ సంస్థల నుంచి 48శాతం, పీపీపీ(ప్రభుత్వ-ప్రయివేట్ పార్టనర్) 4శాతం ఉండనుంది.
ఎల్అండ్ టీ నుంచి ఫేజ్-1 స్వాధీనం..
మెట్రో ఫేజ్-2, ఫేజ్-3 విస్తరణలో ఎలాంటి సాంకేతిక, ఆర్థిక ఇబ్బందులూ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో ఫేజ్-1ను ఇటీవల ఎల్అండ్ సంస్థ నుంచి ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. తద్వారా పాత ప్రాజెక్టు నుంచి వచ్చే ఆదాయాన్ని, అలాగే ఎల్అండ్ నుంచి స్వాధీనం చేసుకున్న భూముల ద్వారా లభించే ఆదాయ మార్గాలను కొత్త ప్రాజెక్టులకు మళ్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
ఫేజ్-3లో భారత్ ఫ్యూచర్ సిటీ
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ వరకు కారిడార్ ను మెట్రో ఫేజ్-3కింద చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దాదాపు 39.6 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ ద్వారా నూతనంగా ఏర్పాటయ్యే పారిశ్రామిక, ఐటీ హబ్ లకు ప్రయాణం మరింత సులభం కానుంది. ఈ కారిడార్ ద్వారా నగర శివార్లకు కూడా మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.
సవరించిన డీపీఆర్‌కు కేంద్రం ఆదేశం
మెట్రో కారిడార్ల అలైన్‌మెంట్‌లో మార్పులు చేసిన నేపథ్యంలో.. ఫేజ్-2, ఫేజ్-3కు సంబంధించి సవరించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(రివైజ్డ్ డీపీఆర్) సమర్పించాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నివేదిక అందిన వెంటనే తుది అనుమతులు మంజూరు చేస్తామని హామీచ్చారు. ప్రస్తుతం మెట్రో అధికారులు యుద్ధప్రాతిపదికన ఈ డీపీఆర్ ను సిద్ధం చేస్తున్నారు.
నలుమూలలా మెట్రో ప్రయాణం
రెండో దశ పూర్తయితే హైదరాబాద్ లో మెట్రో నెట్ వర్క్ గణనీయంగా పెరగనుంది. పారిశ్రామిక ప్రాంతాలు, ఐటీ కారిడార్లు, శివారు ప్రాంతాల ప్రజలకు ఈ విస్తరణ గొప్ప ఊరటనివ్వనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతులు రాగానే టెండర్ల ప్రక్రియను ప్రారంభించి, యుద్ధ ప్రాతిపదికన మెట్రో రెండో దశ పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ఉంది. దీనివల్ల హైదరాబాద్ లోని నలుమూలల ప్రజలకు మెరుగైన, వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.



