మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు విధివిధానాలు రూపొందించాలి : ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన
నవతెలంగాణ-హిమాయత్ నగర్
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని, అందుకు మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అరుణజ్యోతి, మల్లు లక్ష్మి అన్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ చట్టం అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అందుకోసం బలమైన మహిళా ఉద్యమం నిర్మించాలని, మహిళలందరూ ఐక్యంగా ముందుకు వచ్చి తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాల్లోనూ మహిళా రిజర్వేషన్ అమలు కోసం ఉద్యమాలు చేపట్టారన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు విధి విధానాలు రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అరుణజ్యోతి మాట్లాడుతూ.. పార్లమెంట్, అసెంబ్లీల్లో మహిళలకు వెంటనే 33శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితేనే తమ సమస్యలు సమర్థవంతంగా చర్చకు వస్తాయని తెలిపారు. విద్య, ఆరోగ్యం, పోషకాహారం, ఉపాధి, భద్రత, సామాజిక సంక్షేమం వంటివి మహిళలకు సంబంధించిన అనేక కీలక అంశాలను చట్టసభల్లో ప్రస్తావించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. దేశ జనాభాలో మహిళలు దాదాపు 50 శాతం ఉన్నప్పటికీ పార్లమెంట్ లో వారి ప్రాతినిధ్యం 14 శాతం మాత్రమేనని, రాష్ట్ర అసెంబ్లీలో 9 శాతం వరకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన అసమానత అని, అదే స్థానిక సంస్థల్లో మహిళలకు 58.8 శాతం వరకు ప్రాతినిధ్యం లభిస్తున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలులో ఉందని గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో ఇది విజయవంతంగా అమలవుతోందని, పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీల్లో కూడా ఆలస్యం చేయకుండా వెంటనే మహిళల రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శులు కె.నాగలక్ష్మి, కె.ఎన్.ఆశలత, పి.ప్రభావతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శశికళ, ఎం.వినోద, వై.వరలక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.వరలక్ష్మి, సరోజ, కె.అనురధ, షబానా బేగం, పీఓడబ్ల్యూ1 రాష్ట్ర అధ్యక్షులు స్వరూప, పీఓడబ్ల్యూ2 రాష్ట్ర అధ్యక్షులు భారతి తదితరులు పాల్గొన్నారు.
చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



