నవతెలంగాణ-హైదరాబాద్: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడైన అభిజిత్‌ను భయభ్రాంతులకు గురిచేస్తూ, బెదిరించడాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శనివారం పత్రిక ప్రకటన విడుదల చేసింది. కేంద్రప్రభుత్వ వైఫల్యాలపై యువత నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను గమనించి, తమ విధానాలను మార్చుకోవాలని సీపీఐ (ఎం) డిమాండ్ చేసింది.
“నువ్వు బీజేపీలో చేరు, డబ్బులు వస్తాయి, లేకపోతే నిన్ను అమెరికాలోనే ఖతం చేస్తాం. భారతదేశంలో ఉన్న నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రులని కూడా వదలకుండా ఖతం చేస్తాం” అంటూ బెదిరింపులకు దిగడం అత్యంత దుర్మార్గం, రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తిని, ఆయన కుటుంబాన్ని ఈ విధంగా భయభ్రాంతులకు గురిచేసే ధోరణి ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. అభిజిత్ ‘దళిత కార్డ్’ వాడుతున్నాడని, ‘స్కిల్స్ (నైపుణ్యాలు) లేవు’ అని అవమానకరంగా మాట్లాడుతున్నారు. రాజ్యాంగం అందించిన ప్రజాస్వామిక హక్కులను, లౌకిక భావాలను, సోషలిస్టు ఆశయాలను కాపాడడంలో కేంద్రం పూర్తిగా చేతులెత్తేసింది. బెదిరింపులు, భయభ్రాంతులు, హత్య రాజకీయాల ద్వారా యువత గొంతు నొక్కాలని చూస్తే ప్రభుత్వాలు భ్రమల్లో ఉన్నట్టే. ఇటువంటి అణచివేత చర్యలను నేటి యువతరం సహించదు’ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు.



