చట్టాలు ఎన్ని ఉన్నా భారత దేశంలో వరకట్న సమస్యకు మాత్రం పరిష్కారం దొరకడం లేదు. నానాటికీ ఈ సమస్య తీవ్రమవుతూనే ఉంది. ఎంతో మంది మహిళలు వరకట్న మహమ్మారికి బలైపోతూనే ఉన్నారు. ట్విషా శర్మ, దీపికా నగర్‌ల మరణాల తర్వాత వరకట్న సంక్షోభంపై చర్చ మరింత పెరిగింది. 2024 నాటి ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం దేశంలో 5,737 వరకట్న సంబంధిత మరణాలు సంభవించాయి. అనేక చట్టాలు అమలులో ఉన్నప్పటికీ.. ఇది ఒక వ్యవస్థాగత సమస్య అని ఇది స్పష్టం చేస్తోంది.
ముప్పై మూడేండ్ల ట్విషా శర్మ మే 12న భోపాల్‌లోని తన భర్త ఇంట్లో శవమై కనిపించగా, దీపికా నగర్ మే 17న నోయిడాలోని తన ఇంటి బాల్కనీ నుంచి పడి మరణించింది. ఈ రెండు మరణాలకు కారణం వరకట్న వేధింపులే అని నిర్ధారణ అయింది. వీరిద్దరు మాత్రమే కాదు ప్రతి ఏటా వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్న ఈ సంక్షోభంపై మరింత ఆలోచించేలా చేశాయి.
ఏడాదిలో ఇన్ని మరణాలా..?
ట్విషా విషయానికి వస్తే ఆమె భర్త, అత్తమామల నుండి నిత్యం వేధింపులు ఎదుర్కొనేది. అయితే తమకు వరకట్నం కావాలంటూ సూటిగా చెప్పకుండా రకరకాల మాటలతో ఆమెను వేధించే వారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఇక దీపిక విషయానికి వస్తే… పెండ్లి తర్వాత ఆమె భర్త, అత్తమామలు ఈమెపై కూడా అనునిత్యం వేధింపులకు పాల్పడ్డారు. పదేపదే వరకట్నం కావాలంటూ హింసించే వారని ఆమె కుటుంబ నివేదికల ఆధారంగా తెలుస్తుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) వారి ‘క్రైమ్ ఇన్ ఇండియా 2024’ నివేదికలోని గణాంకాల ప్రకారం భారతదేశంలో 2024లో 5,737 వరకట్నం మరణాలు నమోదయ్యాయి. అంటే ప్రతిరోజూ 15-16 మరణాలు సంభవిస్తున్నాయి. దీనిని బట్టి వరకట్న వేధింపులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
చట్టపరమైన నిబంధనలు
ట్విషా, దీపికల మరణాలు ఏకాంత విషాదాలు కావు. భారతదేశంలో పదేపదే జరుగుతున్న నేరాల గణాంకాలు చెబుతున్న పచ్చి నిజాలు. దేశంలో వరకట్నం మరణాలు జరుగుతున్న తీరును చూస్తే ప్రతి దారుణం కలవరపెడుతుంది. అయినప్పటికీ చాలా కేసులు బయటకు రావడం లేదు. గృహ హింసకు సంబంధించిన అనేక కేసులు నమోదు కాకుండానే మిగిలిపోతున్నాయి. వరకట్న వేధింపులను పరిష్కరించడానికి, మహిళలను రక్షించడానికి భారతదేశంలో అనేక చట్టాలు ఉన్నాయి. వరకట్న నిషేధ చట్టం 1961 ప్రకారం వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం లేదా డిమాండ్ చేయడం నేరం. అయితే భారతీయ న్యాయ సంహిత 2023 ప్రకారం వరకట్న సంబంధిత నేరాలను ఎదుర్కోవడానికి నిబంధనలను కలిగి ఉంది. వరకట్న వేధింపులను ఒక రకమైన గృహ హింసగా గుర్తించి రక్షణ ఉత్తర్వులు, ఆర్థిక సహాయం, నివాస హక్కులు, సంరక్షణ, నష్టపరిహారం వంటి నివారణ చర్యలను అందిస్తుంది.
హింస కొనసాగుతూనే ఉంది
చట్టపరమైన చర్యలకు అతీతంగా ప్రభుత్వం ఆపదలో ఉన్న మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు, మహిళా హెల్ప్‌లైన్‌లు, 112 అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ, పోలీస్ స్టేషన్లలో మహిళా సహాయ కేంద్రాలు, నివారణ, సహాయం లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలతో సహా సహాయక వ్యవస్థలను ప్రవేశపెట్టింది. ఇంతగా చట్టపరమైన రక్షణ ఉన్నప్పటికీ వరకట్న సంబంధిత మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2024 కు సంబంధించిన ఎన్‌సిఆర్‌బి (NCRB) గణాంకాల ప్రకారం దేశంలో అత్యధిక వరకట్న మరణాలు ఉత్తర ప్రదేశ్‌లో నమోదయ్యాయి. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లు కూడా ప్రధాన పాత్ర పోషించాయి. 2024లో ఢిల్లీలో 109 వరకట్న మరణాల కేసులు నమోదయ్యాయి.
వివిధ రూపాల్లో కోరికలు
స్టార్టప్‌లు, ఐటీ నిపుణులు, విద్యావంతులు, మంచి ఆదాయం పొందే కుటుంబాలు, ఆధునిక వివాహాలకు నిలయమైన బెంగళూరులో మహానగరాలలోకెల్లా అత్యధిక వరకట్న కేసులు నమోదయ్యాయి. భారతదేశంలోని మెట్రో నగరాల వ్యాప్తంగా నమోదైన 1,008 వరకట్న సంబంధిత కేసులలో, 878 కేసులు కేవలం ఈ నగరంలోనే నమోదయ్యాయి. తక్కువ విద్యావంతులు, తక్కువ పట్టణీకరణ ఉన్న భారతదేశంలో వరకట్నం ఒక సమస్య అనే అపోహను ఇది పటాపంచలు చేస్తుంది. వరకట్న డిమాండ్లు స్పష్టంగా ఉండకపోయినా ఈ రోజుల్లో వాటిని “బహుమతులు”, “ఇల్లు సర్దుకోవడంలో సహాయం”, “సహాయం”, “ఘనమైన పెళ్లి”, “మీ కూతురికి మంచి జీవితం అందించడంలో సహాయం”… అంటూ వివిధ రూపాల్లో వారి కోరికలను తెలియజేస్తున్నారు. 2021లో దీపిక, ట్విషా వంటి వారి మరణాలు జాతీయ వార్తల్లోకి వచ్చినప్పుడు మాత్రమే బయటకు వస్తున్నాయి. అయితే మరో యువతి వరకట్నం ఒత్తిళ్లకు బలయ్యే వరకు అది మరో వార్తా చక్రంలో కలిసిపోతుంది.
వారికి అండగా నిలబడండి
దేశ సామాజిక వ్యవస్థ నుండి వరకట్నం అనే మహమ్మారిని నిర్మూలించాలంటే కేవలం చట్టాలు ఉంటే సరిపోదు. గృహ హింస కేసులను నివేదించడాన్ని సులభతరం, సురక్షితం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాధ్యతగల అధికారులు మరింత చురుకుగా స్పందించాలి. హింస ఒక విషాదంగా మారకముందే చర్యలు తీసుకోవడానికి వీలుగా స్థానిక ప్రభుత్వ స్థాయిలో వేగవంతమైన నివేదన, జోక్య యంత్రాంగాలను ప్రవేశపెట్టాలి. సాధారణంగా ఆడపిల్లలు తమను భర్త పెడుతున్న వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెబితే “సర్దుకుపోవాలని”, “సరిపెట్టుకోమని”, “రాజీపడమని” చెబుతుంటారు. ఇది మారాలి, అప్పుడే యువతులు తమ సమస్యను చెప్పుకునేందుకు ముందుకు వస్తారు. అలాగే కూతుళ్లు తమపై జరుగుతున్న వేధింపుల గురించి మాట్లాడినప్పుడు తల్లిదండ్రులు కుటుంబ పరువు గురించి గానీ, సమాజం ఏమనుకుంటుందోనని గానీ ఆందోళన చెందకూడదు. వారి బాధను పూర్తిగా విని, వారికి అండగా నిలబడాలి. తక్షణమే చర్యలు తీసుకోవాలి. ‘జనాలు ఏమనుకుంటారు?’ అనే వైఖరి నుండి బయటపడటం చాలా ముఖ్యం.
మౌనంగా వదిలేయొద్దు
చాలా సందర్భాలలో వరకట్నం మరణాలు అనేవి ఒక్క రాత్రిలో తీసుకునే నిర్ణయం వల్ల జరగదు. వాళ్లు ఎన్నో ఏండ్ల నుండి వేదనకు గురువుతూ ఉంటారు. కాబట్టి ముందస్తు హెచ్చరిక సంకేతాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. కుటుంబాలలో, సంస్థలలో ఆలోచనా విధానాలు మారాలి. పరిస్థితులు చేయిదాటిపోయినప్పుడు మాట్లాడే ధైర్యం అమ్మాయిలకు ఉండాలి. వారు అలా మాట్లాడినప్పుడు వారి మాటలను నమ్మి, వారికి మద్దతునిచ్చి, తక్షణ చర్యలు తీసుకోవాలి. అంతేగానీ, మౌనం లేదా నిరాకరణతో సరిపెట్టకూడదు.
సలీమా



