ప్రియమైన వేణు గీతికకు
నాన్న.. ‘క్షేమంగా చేరాను’ అని ఫోన్ చేసావు. నీకోసం ఎదురు చూసినంత సేపు పట్టలేదు నువ్వు రావడం, వెళ్ళి పోవడం. ఇల్లంతా బోసి పోయింది, నువ్వు లేకపోయేసరికి. ఒక మూడు, నాలుగు రోజులు పడుతుంది నేను మళ్ళీ నార్మల్ లైఫ్ లోకి రావడానికి. అయితే నీకు పిల్లల పెంపకం గురించి చెప్తున్నాను కదా! ఈ వారం వాళ్ళ వయసుకు తగ్గట్టుగా ఆటలతో చదువుని, వాళ్ళల్లో మేధా శక్తిని, జ్ఞాపక శక్తిని ఎలా పెంచవచ్చో చెప్తాను. పిల్లల కోసం మేజిక్ పాట్ అనే పుస్తకం దొరుకుతుంది. అది UKG అని ఉంటుంది కానీ ఆ పుస్తకం 2వ తరగతి వరకు పిల్లలకు ఉపయోగపడుతుంది. ఆ పుస్తకం ద్వారా వాళ్ళల్లో ఎంతో మేధా శక్తిని పెంచవచ్చు. అందులో చిన్న చిన్న బొమ్మలు గీయడం, జంబుల్ వర్డ్స్, పజిల్స్, చిన్న చిన్న కథలు, క్రాఫ్ట్స్ మొదలైనవి ఉంటాయి. ఆ పుస్తకం నీ చిన్నప్పుడు కొని, అందులోనివి నీతో చేయించే దానిని. అలాగే మనం మార్కెట్ నుండి కూరలు తీసుకు రాగానే కడుగుతాము. అవన్నీ ఒక టబ్ లో వేసి పిల్లలను కూర్చో పెట్టి కూరగాయాల పేర్లు ఒక్కోటి చెప్తూ వాటిని వేరు చేయమని చెప్పాలి. ఇది కూడా వాళ్లకు ఒక ఆటలాగా ఉండటమే కాక కూరలను గుర్తించగలుగుతారు. కొన్ని వస్తువులను ఒక గదిలో పెట్టి ఒక 30 సెకన్ల సమయం ఇచ్చి ఆ గదిలో ఉన్న వస్తువుల పేర్లు బయటకు వచ్చి చెప్పమని అనాలి. దీని వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నీ చిన్నప్పుడు ఇవన్నీ నీతో చేయించేదాన్ని. పిల్లల మెదడుకు ఆరోగ్యకరమైన విషయాలను, ఆటల ద్వారా అందించాలి. ఎటువంటి వత్తిడీ లేకుండా ఉండాలి. ఆటల ద్వారా వాళ్ళు ఎన్నో నేర్చుకోగలుగుతారు. ఉంటాను నాన్న, వచ్చే ఉత్తరంలో ఎటువంటి ఆటలు ఆడించాలో ఇంకా కొన్ని చెప్తాను.
ప్రేమతో అమ్మ
పాలపర్తి సంధ్యారాణి



