మనలో చాలామందికి చిరుతిళ్లంటే బోల్డంత ఇష్టం. ఇక పిల్లల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే వాటిలో బజ్జీ, పకోడీ లాంటివి కడుపుబ్బరం కలిగించి చిరాకు పెడతాయి. పిల్లలకు అసలే మంచివి కావు. ఏ ఇబ్బంది లేకుండా తేలిగ్గా జీర్ణమయ్యే స్నాక్స్ కూడా అనేకం ఉన్నాయి. అలాంటి రెసిపీల్లో కొన్ని మీ కోసం.. ఇంట్లోనే తయారు చేసుకొని ఎంచక్కా తినండి.
పోహా కట్లెట్
కావల్సిన పదార్థాలు: అటుకులు – కప్పు, మోరంగడ్డ – రెండు, ఉల్లిగడ్డ – ఒకటి, పచ్చిమిర్చి – రెండు, అల్లం తురుము – స్పూన్, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, కారం – అర స్పూన్, ఉప్పు – తగినంత, జీలకర్ర పొడి – అర స్పూన్, గరం మసాలా, మిరియాల పొడి – పావు స్పూన్ చొప్పున, నిమ్మరసం – స్పూన్, బ్రెడ్ పౌడర్ – అర కప్పు, నూనె – వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం: అటుకులను కడిగి నీళ్లు వంపేసి పక్కనుంచాలి. మోరంగడ్డను ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదపాలి. అందులో నానబెట్టిన అటుకులు, తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, మిరియాల పొడి, అల్లం తురుము, జీలకర్ర పొడి, కొత్తిమీర, కారం, ఉప్పు, నిమ్మరసం, గరం మసాలా వేసి కలపాలి. ఈ మిశ్రమంతో కట్లెట్లు చేసుకోవాలి. వాటిని బ్రెడ్ పౌడర్‌లో ముంచి తీసి.. కాగుతున్న నూనెలో మధ్యస్థమైన సెగ మీద రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. వేడివేడిగా టొమాటో సాస్ లేదా పుదీనా చట్నీతో తినండి. ఈ పోహా కట్లెట్లు బయట కరకరలాడుతూ లోపల మృదువుగా ఉండి చాలా రుచిగా ఉంటాయి.
కివీ బర్ఫీ
కావల్సిన పదార్థాలు: కివీ పండ్లు – ఐదు, పంచదార – అర కప్పు, నెయ్యి – ఆరు స్పూన్లు, ఖోయా – కప్పు, యాలకుల పొడి – పావు స్పూన్, పిస్తా, బాదం పప్పులు – రెండు స్పూన్లు, కుంకుమపువ్వు – కొద్దిగా, ఆకుపచ్చ ఫుడ్ కలర్ – చిటికెడు
తయారు చేసే విధానం: బాగా పండిన కివీపండ్లను తీసుకొని తొక్క తీసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అడుగుభాగం మందంగా ఉన్న పాత్రలో ఐదు స్పూన్ల నెయ్యి వేడిచేసి.. పిస్తా, బాదం పప్పులను వేయించాలి. అందులో ఖోయా, కివీ ప్యూరీ జోడించి సన్న సెగ మీద ఉడికిం చాలి. నాలుగైదు నిమిషాల తర్వాత.. పంచదార, యాలకుల పొడి, కుంకుమపువ్వు, ఫుడ్ కలర్ జతచేసి కలియ తిప్పుతుండాలి. చిక్కబడి, పాత్ర నుంచి విడిపో తున్నప్పుడు సెగ తీసేయాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్లెంలో సమంగా సర్ది.. పిస్తా, బాదం పప్పులను చల్లాలి. చల్లారిన తర్వాత రిఫ్రిజి రేటర్‌లో ఉంచాలి. బయట కు తీసి.. చతురస్రం లేదా డైమండ్ ఆకృతిలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే.. నోరూరించే ‘కివీ బర్ఫీ’ రెడీ.
బొప్పాయి జెల్లీ డిలైట్
కావల్సిన పదార్థాలు: బొప్పాయి పండు ముక్కలు – కప్పు, పంచదార – ముప్పావు కప్పు, నిమ్మరసం – రెండు స్పూన్లు, నీళ్లు – అర కప్పు, జెలటిన్ – టేబుల్ స్పూన్, వెనీలా ఎసెన్స్ – అర స్పూన్, నెయ్యి – స్పూన్, డ్రై ఫ్రూట్స్ – గార్నిష్ చేసేందుకు
తయారు చేసే విధానం: బొప్పాయి పండు ముక్కలను మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ ప్యూరీలో అర కప్పు నీళ్లు, పంచదార వేసి మధ్యస్థమైన సెగ మీద కలియతిప్పుతూ ఉడికించాలి. పంచదార కరిగి, మిశ్రమం చిక్కగా అయ్యే వరకూ ఉంచాలి. జెలటిన్‌లో రెండు టేబుల్ స్పూన్ల వేడి నీళ్లు పోసి పూర్తిగా కరిగేలా కలిపి.. ఉడుకుతున్న బొప్పాయి గుజ్జులో వేయాలి. నిమిషం తర్వాత నిమ్మరసం, వెనీలా ఎసెన్స్ జతచేసి బాగా కలిపి సెగ తీసేయాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన బౌల్ లేదా అచ్చు లోకి తీసి.. సమంగా సర్దాలి. చల్లారాక.. రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే.. గట్టిపడుతుంది. రెండు గంటల తర్వాత.. చిన్న ముక్కలుగా కట్ చేసి, పైన కొబ్బరి తురుము అద్ది డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేయాలి. అంతే.. నోరూరించే బొప్పాయి జెల్లీ డిలైట్ రెడీ అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. అయితే బొప్పాయి బాగా పండినదే ఎంచుకోవాలి. జెలటిన్ బదులు అగర్ అగర్ ఉపయోగించ వచ్చు. చల్లగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.
పోహా బార్
కావల్సిన పదార్థాలు: అటుకులు – 180 గ్రాములు, తురిమిన బెల్లం – 150 గ్రా, ఉప్పు – చిటికెడు, నెయ్యి – ఐదు స్పూన్లు, పల్లీలు – 70 గ్రా, బాదం, జీడిపప్పులు – పావు కప్పు చొప్పున, పిస్తా – మూడు టేబుల్ స్పూన్లు, ఖోవా – రెండు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – అర స్పూన్
తయారు చేసే విధానం: అటుకులను క్రీస్పీగా అయ్యే వరకూ సన్న సెగ మీద వేయించాలి. వాటిని పళ్లెంలోకి తీసి.. పల్లీలు, బాదం, పిస్తా, జీడిపప్పులను వేయించి చల్లారాక కచ్చాపచ్చా దంచాలి. బెల్లంలో కొన్ని నీళ్లు పోసి వేడిచేయాలి. కరిగిన బెల్లాన్ని కొద్దిగా నీళ్లలో వేస్తే గట్టిగా ఉండలా అయ్యిందంటే పాకం సరిగ్గా ఉన్నట్టు. ఈ పాకంలో వేయించిన అటుకులు, బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు, యాలకుల పొడి, ఉప్పు, నాలుగు స్పూన్ల నెయ్యి జతచేసి కలుపుతుండాలి. దగ్గరగా అయ్యాక సెగ తీసేయాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ట్రేలో సమంగా సర్దాలి. పావు గంట తర్వాత నచ్చిన ఆకృతిలో ముక్కలు కోయాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత గట్టిపడతాయి. బెల్లం పాకం సరిగ్గా ఉంటేనే ఇవి బాగుంటాయి. వాటిని గాలి చొరబడని డబ్బాలో భద్రం చేసుకోవాలి. ఇది ఆరోగ్యకరమైన చిరుతిండి.


