మూడు నెలల పసికందు.. ఇంకా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా పూర్తిగా గుర్తించలేని వయసు. తనకు నచ్చింది చెప్పలేని వయసు. తనకు నచ్చనిది తిరస్కరించలేని వయసు. తనను తాను రక్షించుకోలేని వయసు. అలాంటి పసిపాపపై ఒక 35 ఏండ్ల మనిషి లైంగిక దాడికి పాల్పడ్డాడనే వార్త మన ముందుకు వస్తుంది. ఈ ఘటన విన్నప్పుడు మనలో కోపం వస్తుంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలనిపిస్తుంది. కానీ.. అంతటితో మన బాధ్యత పూర్తవుతుందా? నిందితుడిని పట్టుకోవడం న్యాయవ్యవస్థ బాధ్యత. కానీ.. ఇలాంటి నేరాలు పుట్టడానికి కారణమయ్యే ఆలోచనలను సమాజం ఎలా ఎదుర్కోవాలి? అదే అసలు ప్రశ్న.
లైంగిక దాడంటే కేవలం ఒకరి శరీరాన్ని బలవంతంగా తాకడం కాదు. వారి శరీరం, స్వేచ్ఛ, సమ్మతి, గౌరవంపై చేసే లైంగిక హింస. భారతదేశంలోని ప్రస్తుత చట్టంలో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 63 లైంగిక దాడిని నిర్వచిస్తుంది. 18 ఏండ్ల లోపు బాలిక విషయంలో సమ్మతి ఉందని చెప్పినా అది దాడి పరిధిలోకి వస్తుంది. పిల్లలపై లైంగిక నేరాలకు POCSO చట్టం ప్రత్యేక రక్షణ కల్పిస్తుంది. అయితే చట్టపరమైన నిర్వచనం కంటే మానవీయమైన నిర్వచనం ఇంకా సులభం. ‘నాకు హక్కు ఉన్నట్టే, ఎదుటి మనిషికి కూడా తన శరీరంపై హక్కు ఉంది’. ఆ హక్కును బలవంతంగా లాక్కోవడమే లైంగిక హింస.
లైంగికదాడి ఎందుకు జరుగుతుంది?
ఇక్కడ ఒక అపోహను ముందుగా తొలగించాలి. లైంగికదాడంటే కేవలం ‘కామం ఎక్కువ కావడం’ కాదు. లైంగిక కోరిక ఉండటం సహజమైన మానవ అనుభవం కావచ్చు. కానీ కోరికను మరొకరి సమ్మతి లేకుండా బలవంతంగా అమలు చేయడం నేరం. లైంగిక హింస వెనుక అనేక అంశాలు పనిచేయవచ్చు
ఒకటి అధికార భావన. నేను కోరుకున్నది నాకు దక్కాల్సిందే. మహిళలు, పిల్లలను తక్కువగా చూసే పురుషాధిక్య భావజాలం నుండి ఇది పుట్టింది. WHO కూడా లైంగిక హింసకు వ్యక్తిగత కారణాలతో పాటు అసమాన లింగ సంబంధాలు, పురుషాధిక్యత భావాలు, హింసను సమర్థించే సామాజిక నిబంధనలు, అసమాన అధికార సంబంధాలు వంటి అంశాలు సంబంధం కలిగి ఉంటాయని చెబుతోంది. కాబట్టి ‘అతనికి కామం ఎక్కువైంది కాబట్టి చేశాడు’ అని చెప్పి సమస్యను ముగించేయడం చాలా ప్రమాదకరం.
మూడు నెలల పసిపాపపై దాడెందుకు?
ఇది అత్యంత బాధాకరమైన ప్రశ్న. మొదట ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఆ పసిపాపలో ఎలాంటి లైంగిక ఆకర్షణ ఉండదు. ఆమెకు సమ్మతి ఇవ్వగల సామర్థ్యం లేదు. ఆమెపై జరిగినది ‘సంబంధం’ కాదు. అది లైంగిక హింస. ఇలాంటి శిశువుపై దాడిని సాధారణ లైంగిక కోరికగా అర్థం చేసుకోవడం తప్పు.
కొన్ని సందర్భాల్లో నేరస్థుడికి లైంగిక ఉద్రేకంతో పాటు ఆధిపత్యం, నియంత్రణ, హింసాత్మక ప్రవర్తన వంటి అంశాలు కలిసివుండవచ్చు. కొందరిలో పిల్లలపై లైంగిక ఆకర్షణ అనే తీవ్రమైన మానసిక సమస్య ఉండవచ్చు. కానీ ప్రతి నేరస్థుడి మానసిక కారణాన్ని ఒకే పదంతో నిర్ణయించడం శాస్త్రీయంగా సరైంది కాదు.
మహిళలపై మాత్రమే జరుగుతుందా?
కాదు. అసలు కాదు. ఇక్కడే మన భాషలోనూ, సామాజిక చర్చలోనూ ఒక పెద్ద సమస్య ఉంది. సాధారణంగా మహిళలపై లైంగిక దాడి అని మాత్రమే మాట్లాడుతుంటాం. మహిళలపై లైంగిక హింస నిజంగా విస్తృతమైన, తీవ్రమైన సమస్య. WHO ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు జీవితంలో ఏదో ఒక రూపంలో శారీరక లేదా లైంగిక హింసను అనుభవిస్తున్నారు. కానీ.. లైంగిక హింసకు బాధితులు మహిళలే కాదు. UNICEF తాజా అంచనాల ప్రకారం బాల్యంలో లైంగిక హింసను అనుభవించిన బాలురు, పురుషులు కూడా వందల మిలియన్లలో ఉన్నారు.
మహిళలనే ఎందుకు ప్రస్తావిస్తారు?
ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న. మహిళలు, బాలికలు లైంగిక హింసకు అధికంగా గురవుతున్న వాస్తవాన్ని దాచిపెట్టకూడదు. కానీ దాని అర్థం ‘లైంగిక దాడి = మహిళల సమస్య’ అని కాదు. అది సమాజంలోని లైంగిక హింస సమస్య. ఇంకా ఒక ప్రమాదకరమైన విషయం ఉంది. బాధితురాలి దుస్తులు ఎలా ఉన్నాయి?
ఎక్కడికి వెళ్లింది? ఎవరితో వెళ్లింది? రాత్రి ఎందుకు బయటికి వెళ్లింది? ఎందుకు ప్రతిఘటించలేదు? అంటూ ప్రశ్నలు అడుగుతాం. కానీ అసలు అడగాల్సిన ప్రశ్న నేరం చేసిన వ్యక్తి ఎందుకు చేశాడు? అని. బాధితురాలి ప్రవర్తనను విచారించడం కంటే నేరస్థుడి ప్రవర్తనను ప్రశ్నించాలి.
చట్టం ఏం చెబుతోంది?
భారతదేశంలో పిల్లలపై లైంగిక నేరాలకు POCSO Act, 2012 ప్రత్యేక చట్టం. ఇది పిల్లలపై penetrative sexual assault, aggravated sexual assault, sexual assault, sexual harassment, పిల్లలను లైంగిక దోపిడీ కోసం ఉపయోగించడం వంటి నేరాలను ప్రస్తావిస్తుంది. ముఖ్యంగా POCSO చట్టంను లింగంతో పరిమితం చేయకుండా పిల్లల రక్షణ కోసం రూపొందించబడింది. అంటే బాలికకు జరిగినా నేరమే. బాలుడికి జరిగినా నేరమే. ఇది చాలా స్పష్టంగా సమాజానికి తెలియాలి.
నిర్భయ నుంచి హాథ్రస్ వరకు
ఢిల్లీ నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా ప్రజా ఆగ్రహాన్ని సృష్టించింది. హాథ్రస్ ఘటన కులం, లింగం, పోలీసు వ్యవస్థ, న్యాయం, బాధిత కుటుంబం ఎదుర్కొనే సామాజిక ఒత్తిడి వంటి ప్రశ్నలను ముందుకు తెచ్చింది. ఆ కేసులో విచారణ అనంతరం ట్రయల్ కోర్టు లైంగికదాడి ఆరోపణలపై ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించి, ఒకరిని ఇతర నేరాలపై దోషిగా తేల్చింది. ఇటీవలి ఘటనలు కూడా మరో విషయం గుర్తుచేస్తున్నాయి. నేరం జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాదు, నేరం జరగకుండా ముందుగానే వ్యవస్థను నిర్మించాలి. పాఠశాలలు, కుటుంబాలు, పోలీస్ వ్యవస్థ, రవాణా వ్యవస్థ, న్యాయవ్యవస్థ.. అన్నీ తమ బాధ్యతను నిర్వర్తించాలి.
పిల్లలకు ఏం నేర్పాలి?
పిల్లలకు భయపెట్టే భాష కాదు హక్కుల భాష నేర్పాలి. వయసుకు తగిన విధంగా ‘నా శరీరం నాది. నాకు అసౌకర్యంగా అనిపించే స్పర్శను తిరస్కరించే హక్కు నాకు ఉంది. ఎవరైనా తప్పుగా తాకితే అది నా తప్పు కాదు’. ఎవరైనా ‘ఇది మన రహస్యం’ అని చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు. భయపెట్టినా, బెదిరించినా, బహుమతి ఇచ్చినా తప్పు తప్పే. నమ్మకమైన పెద్దవారికి చెప్పాలి. ఒకరు నమ్మకపోతే మరొకరికి చెప్పాలి. తప్పు చేసిన వ్యక్తి కుటుంబ సభ్యుడైనా, బంధువైనా, పరిచయస్తుడైనా చెప్పాలి. ఇలాంటి అవగాహన పిల్లలను నేరస్థులను ఎదుర్కొనే యోధులుగా మార్చడానికి కాదు. తమపై జరిగే తప్పును గుర్తించి సహాయం కోరగలిగే స్థితికి తీసుకురావడానికి.
అబ్బాయిలకు ఏం నేర్పాలి?
ఇది పాఠశాల నుంచే ప్రారంభం కావాలి. నీకు బలం ఉంది కాబట్టి ఎదుటివారిపై హక్కు లేదు. ఆమె నీ స్నేహితురాలు కావచ్చు కానీ నీ ఆస్తి కాదు. ఆమె నీ భార్య కావచ్చు కానీ నీకు ఆమె శరీరంపై స్వయంచాలక హక్కు రాదు. ఆమె ‘కాదు’ అంటే కాదనే. ఆమె మౌనం సమ్మతి కాదు. భయం వల్ల వెనక్కి తగ్గడం సమ్మతి కాదు. మత్తులో ఉన్న వ్యక్తి ఇచ్చే అస్పష్ట స్పందనను సమ్మతిగా భావించకూడదు. పిల్లలకు అసలు సమ్మతి అనే ప్రశ్నే వర్తించదు. WHO సూచించే వయసుకు తగిన లైంగిక విద్యలో శరీరం, హక్కులు, సమ్మతి, గౌరవప్రదమైన సంబంధాలు, లైంగిక హింస గురించి పిల్లలకు వయసుకు తగిన అవగాహన ఇవ్వాలని సూచిస్తుంది.
పూర్ణిమా యర్రంశెట్టి, 9676439996.
ఆమె ‘కాదు’ అంటే కాదనే
- Advertisement -
- Advertisement -



