పొంచి ఉన్న సవాళ్లు : ఆర్బీఐ హెచ్చరిక
పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న తీవ్ర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడమే కాకుండా భారత వృద్ధిపైనా ప్రభావం చూపనుందని ఆర్బీఐ పేర్కొంది. దేశీయంగా డిమాండ్ బలంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా తలెత్తుతున్న సరఫరా వైపు ఒత్తిళ్లు దేశ జిడిపిని ఒడిదుడుకులకు గురిచేసే ప్రమాదం ఉందని ఆర్బీఐ తన తాజా స్టేట్ ఆఫ్ ది ఎకానమీ నివేదికలో హెచ్చరించింది. హార్మూజ్ జలసంధి మార్గాలలో తలెత్తుతున్న అడ్డంకులు, అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినడం దేశీయ మార్కెట్లలో ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న ఈ అస్థిరత కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు, ఎరువులు, ప్రధాన లోహాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ భారం మన దేశీయ మార్కెట్లలోకి దిగుమతి ద్రవ్యోల్బణం రూపంలో చొచ్చుకువచ్చే ప్రమాదం ఉందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం నియంత్రణ పరిమితిలోనే ఉన్నప్పటికీ, అంతర్లీనంగా పెరుగుతున్న ఈ వ్యయ ఒత్తిళ్లు దేశీయ వస్తువుల ధరలను పెంచే అవకాశం ఉంది. దీనిపై కేంద్ర బ్యాంక్ నిరంతర, అత్యంత నిశితమైన నిఘా ఉంచాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొంది.ఈ అంతర్జాతీయ సంక్షోభం ప్రభావం భారతదేశ విదేశీ వాణిజ్యంపై స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. ముఖ్యంగా ముడి చమురు, బంగారం దిగుమతుల భారం ఊహించని విధంగా పెరగడం వల్ల, గత మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్‌లో దేశ వాణిజ్య లోటు మరింత పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న సుదీర్ఘ అనిశ్చితి, కరెన్సీ మార్కెట్ ఒత్తిళ్లు, ముడి చమురు ధరల మంటలు విదేశీ పెట్టుబడిదారులను కలవరపెడుతున్నాయని ఆర్‌బిఐ పేర్కొంది. ఇటు మూలధన ప్రవాహాలు తగ్గడం, అటు రూపాయి విలువపై ఒత్తిడి పెరగడం వంటి పరిణామాలు రాబోయే రోజుల్లో పెద్ద సవాళ్లుగా మారనున్నాయని తెలిపింది.
భారత వృద్ధిపై నీలినీడలు!
- Advertisement -
- Advertisement -



