Sunday, May 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇవాంక ట్రంప్ పై మర్డర్ ప్లాన్

ఇవాంక ట్రంప్ పై మర్డర్ ప్లాన్

- Advertisement -

సొలైమణి హత్యకు ప్రతీకారమా?
వాషింగ్టన్ : 2020లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ మిలిటరీ చీఫ్ ఖసెమ్ సొలైమణి చనిపోయిన విషయం తెలిసిందే. ఆ హత్యకు ప్రతీకారంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకను చంపుతానని ఉగ్రవాది మహమ్మద్ బఖర్ సాద్ దావూద్ అల్-సాదీ ప్రతినబూనాడు. తన ప్రణాళికను అమలు చేసేందుకు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) వద్ద శిక్షణ కూడా పొందాడు. అయితే ఈ నెల 15వ తేదీన అతనిని టర్కీలో అరెస్ట్ చేయడంతో కుట్ర బయపడింది. టర్కీ అధికారులు అతనిని అమెరికాకు అప్పగించారు. ఐఆర్‌జీసీకి చెందిన ఖుద్స్ దళానికి నేతృత్వం వహించిన సొలైమణిని 2020 జనవరి 3న బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో జరిపిన డ్రోన్ దాడిలో అమెరికా హతమార్చింది. దీనికి ప్రతీకారంగా ఇవాంకను చంపుతానని ఇరాక్ జాతీయుడైన అల్-సాదీ (32) ప్రతినబూనాడు. ట్రంప్ మొదటిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పుడు ఇవాంక ఆయన సలహాదారుగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

అల్-సాదీని అరెస్ట్ చేసినప్పుడు అతని వద్ద ఇవాంకకు చెందిన న్యూయార్క్ ఇంటి బ్లూప్రింట్ లభించిందని న్యూయార్క్ పోస్ట్ పత్రిక తెలిపింది. 2021లో అల్`సాదీ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో ఇవాంక ఫ్లోరిడా నివాస చిత్రాన్ని పోస్ట్ చేశాడు. ఆ ఇంటిలోనే ఇవాంక, ఆమె భర్త జేర్డ్ కుష్నర్ నివసిస్తున్నారు. ఆ భవనం విలువ 24 మిలియన్ డాలర్లు. ‘ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్నా’ అని ఆ పోస్టులో అల్-సాదీ రాసుకొచ్చాడు. ‘నేను అమెరికా ప్రజలకు ఓ విషయం చెబుతున్నా. ఈ చిత్రం వంక చూడండి. మీ భవంతులు కానీ, మీ సీక్రెట్ సర్వీస్ కానీ మిమ్మల్ని రక్షించలేవు. మేము ప్రస్తుతం నిఘా పనిలో ఉన్నాం. అన్నింటినీ విశ్లేషిస్తున్నాం’ అని కూడా తెలిపాడు. సొలైమణిని గురువుగా భావించే అల్-సాదీ ఆయన మరణం తర్వాత సహాయకులతో మాట్లాడుతూ ట్రంప్ నివాసాన్ని తగలబెడతానని చెప్పాడు. ‘వారు మా ఆవాసాలను ఎలా తగలబెట్టారో అలాగే మేము కూడా ట్రంప్ ఇంటిని తగలబెడతాం. ఇవాంకను మనం చంపాల్సిన అవసరం ఉంది’ అని అన్నాడు. అయితే ఇవాంకను అల్‘సాదీ ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడనేది తెలియడం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -