Sunday, May 24, 2026
E-PAPER
Homeచైల్డ్ హుడ్కంచె మేసిన చేను

కంచె మేసిన చేను

- Advertisement -

రాజారాం పేట అనే గ్రామంలో కేశవయ్య అనే నిబద్ధత గల రైతు ఉండేవాడు. ఆయనకు వ్యవసాయం అంటే కేవలం జీవనాధారమే కాదు, శ్రమతో కూడిన గొప్ప తపస్సు. తనకున్న ఐదెకరాల భూమిని ప్రాణం పెట్టి సాగు చేసేవాడు. అందులో ఆయన అపురూపంగా పెంచుకున్న మామిడి తోట ఉండేది. ఆ తోటలోని ప్రతి చెట్టునూ కేశవయ్య తన బిడ్డలాగే భావించి, బలవర్ధకమైన ఎరువులు, నీరు అందిస్తూ కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. ఆ ఏడాది ప్రకతి కూడా కేశవయ్య శ్రమకు అనుకూలించింది. తోటంతా పచ్చని ఆకులతో, బంగారు వర్ణంలో మెరుస్తున్న పండ్లతో కళకళలాడుతోంది. పండ్ల బరువుకు కొమ్మలు నేలను తాకుతుంటే, ఆ మధురమైన సువాసన ఊరంతటికీ పాకి, చూసేవారికి నోరూరించేలా ఉంది. పంట చేతికి వచ్చే తరుణం ఆసన్నమైంది.
అదే సమయంలో గ్రామంలో దొంగల బెడద ఎక్కువైంది. గతంలో ఎన్నో రాత్రులు కేశవయ్య స్వయంగా తోటలోనే నిద్రించి కాపలా కాసేవాడు. కానీ ఇప్పుడు వయసు మళ్ళిన కారణంగా ఆయన శరీరం సహకరించడం లేదు. చెమటలు చిందించి పండించిన ఈ పంటను, తన ఆశను కాపాడటానికి తన కన్న కొడుకైన రఘు కంటే నమ్మకస్తుడు ఇంకెవరు ఉంటారని కేశవయ్య భావించాడు. ?ఒక రోజు రఘును దగ్గరకు పిలిచి, ప్రేమగా తల నిమురుతూ, ”నాయనా రఘూ! ఈ తోట కేవలం చెట్ల సమూహం కాదు, మన కుటుంబ గౌరవానికి చిహ్నం. నీ చదువుకు, మన భవిష్యత్తుకు ఇదే ఆధారం. బయటి వ్యక్తులని నమ్మలేక నీకు ఈ బాధ్యత అప్పగిస్తున్నాను. నువ్వు ఒక కంచెలా ఉండి ఈ తోటను దొంగల పాలు కాకుండా కాపాడాలి.” అని అనునయించి చెప్పాడు.

తండ్రి నమ్మకాన్ని చూసి రఘు పైకి తల ఊపినా, అతని మనసులో మాత్రం విలాసవంతమైన జీవితంపై మక్కువ ఎక్కువగా ఉండేది. తండ్రి ఇచ్చే కొద్దిపాటి డబ్బులు తన జల్సాలకు సరిపోవడం లేదనే అసంతప్తి అతనిలో ఉండేది. తోటలో కాపలా ఉన్న సమయంలో రఘు స్నేహితులు అక్కడికి వచ్చి అతనికి ఆశ చూపారు. ”రఘూ! మీ నాన్నకు తెలియకుండా కొన్ని కాయలు మాకు ఇవ్వు, మేము పక్కూరి సంతలో మంచి ధరకు అమ్మి నీకు వాటా ఇస్తాం. ఆ డబ్బుతో నువ్వు రాజులా బతకవచ్చు” అని దుర్బోధ చేశారు. మొదట రఘు మనసులో తండ్రి నమ్మకం గుర్తొచ్చి కొంచెం సంకోచించినా, క్రమంగా ధనాశ అతని నీతిని కప్పేసింది. తన తండ్రి పడిన శ్రమను, పండించిన పంట విలువను విస్మరించాడు. రక్షకుడిగా ఉండాల్సిన వాడే భక్షకుడిగా మారి, చీకటి పడగానే నాణ్యమైన పండ్లను కోసి తన స్నేహితులకు అప్పగించడం మొదలుపెట్టాడు.
వారం గడిచింది. కేశవయ్య తోటను చూసుకోవడానికి వెళ్ళాడు. తీరా చూస్తే, గుత్తులు గుత్తులుగా ఉండాల్సిన పండ్లు మాయమై ఉన్నాయి. కేశవయ్య నివ్వెరపోయాడు. చుట్టూ ఉన్న కంచె ఎక్కడా తెగలేదు, గేటు తాళం వేసే ఉంది. మరి దొంగలు లోపలికి ఎలా వచ్చారు? ఆయన ఆందోళన గమనించిన పొరుగు రైతు రామలింగయ్య అక్కడ ఆగాడు.

మలింగయ్య నిట్టూరుస్తూ, ”కేశవయ్యా! నువ్వు బయటి దొంగల కోసం వెతుకుతున్నావు. కానీ దారి లేని చోట దొంగతనం ఎలా జరుగుతుంది? నిన్న రాత్రి నీ కొడుకు రఘు స్వయంగా గంపల్లో పండ్లు నింపి కంచె దాటిస్తుంటే నా కళ్లతో చూశాను. నువ్వు వాడిని రక్షణగా ‘కంచె’లా ఉంచావు, కానీ ఆ కంచే ఇవాళ నీ చేనును మేస్తోంది” అని అసలు నిజం బయటపెట్టాడు.
ఆ మాటలు విన్న కేశవయ్య నిలువునా నీరైపోయాడు. కన్న కొడుకే వెన్నుపోటు పొడిచాడని తెలిసి ఆయన గుండె చెరువైంది. రఘును పిలిచి ఆవేదనతో.. ”ఒరేరు! బయటి దొంగల నుండి రక్షిస్తావని నిన్ను నమ్మితే, నువ్వే దొంగగా మారావా? నిన్ను నమ్ముకున్నందుకు నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. నీవు చేసిన పని వల్ల, నా ఆశలు, నమ్మకం ముక్కలయ్యాయి” అని వాపోయాడు. తండ్రి పడుతున్న బాధ చూసి రఘు పశ్చాత్తాపపడినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ సంఘటన ద్వారానే, ఎక్కడైనా సరే రక్షించాల్సిన వారే నమ్మకద్రోహానికి పాల్పడితే, ఆ సందర్భాన్ని ”కంచే చేను మేసినట్లు” అని ప్రజలు సామెతగా ఉపయోగించడం మొదలుపెట్టారు.

– డా.పోతగాని సత్యనారాయణ, 9182531202

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -