ఇరాన్ నేతలతో పాక్ ఆర్మీ చీఫ్ చర్చలు
టెహ్రాన్ : ఇరాన్, అమెరికా మధ్య పాకిస్తాన్ జరుపుతున్న మధ్యవర్తిత్వ యత్నాలు ముమ్మరమయ్యాయి. టెహ్రాన్ లో పర్యటిస్తున్న పాకిస్తాన్ సైనిక దళాల ప్రధానాధికారి అశిం మునీర్ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ ఘలీబఫ్‌లతో శని వారం సమావేశమయ్యారు. ఇస్లామా బాద్‌లో జరిగిన శాంతి చర్చలలో ఇరాన్ పక్షాన ఘలీబఫ్ కూడా భాగస్వామి అయిన విషయం తెలిసిందే. కాగా పెజెష్కియాన్-మునీర్ మధ్య జరిగిన సమావేశానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కూడా హాజరయ్యారు. మునీర్ శుక్రవారమే టెహ్రాన్ చేరుకున్నారు. అమెరికా చేసిన తాజా శాంతి ప్రతిపాదనలను పరిశీలిస్తున్నానని ఇరాన్ ఇప్పటికే తెలియజేసింది. అయితే శాంతి ఒప్పందం కుదరడానికి ఇప్పటికీ అవరోధాలు ఉన్నాయని, అనేక కీలక అంశాలపై అభిప్రాయబేధాలు కొనసాగుతున్నాయని చెప్పింది. మునీర్ పర్యటనపై ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఖై మాట్లాడుతూ ‘ఈ పర్యటనకు అర్థం మేము కీలక దశకు చేరుకున్నామనో లేదా నిర్ణయాత్మక స్థితికి చేరామనో కాదు’ అని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య అభిప్రాయబేధాలు తీవ్రంగా, విస్తృతంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ఇదిలావుండగా అబ్బాస్ అరాగ్చీ ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్‌బుసైదీతో టెలిఫోన్‌లో సంభాషించారు. అమెరికాతో శాంతి ఒప్పందం కోసం జరుగుతున్న దౌత్య యత్నాలను గురించి వివరించారు. ఉద్రిక్తతల నివారణ కోసం ప్రస్తుతం జరుగుతున్న దౌత్య యత్నాలు, తాజా ప్రాంతీయ పరిణామాలపై ఇరువురు విదేశాంగ మంత్రులు చర్చించారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలు పంచుకున్నారు. అరాగ్చీ ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తో కూడా టెలిఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న శాంతి చర్చలకు అమెరికా మితిమీరి చేస్తున్న డిమాండ్లే అడ్డంకిగా మారాయని ఆరోపించారు. ఇచ్చిన హామీలను విస్మరించడం, పరస్పర విరుద్ధ వైఖరులు అవలంబించడం, సైనిక దురాక్రమణ వంటి చర్యల ద్వారా దౌత్య యత్నాలను అమెరికా నీరుకారు స్తోందని మండిపడ్డారు. ఏ దేశ సార్వభౌమాధికారం పై అయినా దాడులు చేయడాన్ని ఈ సందర్భంగా గుటెర్రెస్ తప్పుపట్టారు. మధ్యప్రాచ్యంలో సుస్థిరత కోసం దౌత్య యత్నాలు కొనసాగించాలని సూచించారు. కాగా ఇరాన్‌తో ఒప్పందం దిశగా కొంత పురోగతి కన్పిస్తోందని, అయితే ఇంకా చాలా పని జరగాల్సి ఉన్నదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో చెప్పారు.
నన్ను నిరంకుశుడు అని పిలవొచ్చు మూగవాడు అనవద్దు : ట్రంప్
తనను క్రూరుడు, నిరంకుశుడు అంటే పట్టించుకోబోనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే తనను తెలివి తక్కువవాడిగా చిత్రీకరించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యూయార్క్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను మనసికంగా దృఢంగానే ఉన్నానని చెప్పుకునేందుకు ఆయన ఈ సందర్భంగా ప్రయత్నించారు. తన గ్రహణశక్తిని విమర్శకులు ప్రశ్నించిన తర్వాత వైద్యులను సంప్రదించానని తెలిపారు. విమర్శకుల అభిప్రాయం తప్పని నిరూపించడానికే గ్రహణశక్తిని పరీక్షించుకున్నానని అన్నారు. ‘నాపై వారు ఓ చెడ్డ ఆరోపణ చేశారు. నేను తెలివితక్కువ వాడినని నిందించారు.
నన్ను అలా పిలిపించుకోవడం కంటే ప్రతిభావంతుడైన నియంత అని పిలిపించు కోవడానికే ఇష్టపడతాను’ అని చెప్పారు. గ్రహణశక్తిని పరీక్షించుకోవడానికి టెస్ట్ ఏమైనా ఉన్నదా అని వైద్యుడిని అడిగానని, ఆయన ఓ పరీక్షను సూచించారని అన్నారు. పెద్ద కుమారుడు డోనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహానికి తాను హాజరు కావడం లేదని ట్రంప్ తెలిపారు. తాను నిర్వర్తిం చాల్సిన బాధ్యతల కారణంగా శ్వేతసౌధంలోనే ఉండాల్సి వస్తోందని చెప్పారు. కాగా పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్‌తో జరుగుతున్న చర్చలే ట్రంప్ నిర్ణయానికి కారణమని భావిస్తున్నారు.
అనుమతితో హార్ముజ్ దాటిన పాతిక ఓడలు : ఐఆర్‌జీసీ
గత 24 గంటల కాలంలో ఇరాన్ అనుమతి తీసుకొని ఇరవై ఐదు నౌకలు హార్ముజ్ జలసంధిని దాటాయని ఐఆర్‌జీసీ తెలిపింది. ఉద్రిక్తతలు సడలాలంటే ఇరాన్ డిమాండ్లకు అమెరికా అంగీకరించక తప్పదని రక్షణ శాఖ ప్రతినిధి రెజా తలై`నిక్ చెప్పారు.



