కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
యువత సాధికారతకు ప్రతీక రోజుగార్ మేళా అని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. కొత్తగా నియమితులైన వారికి వారి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన 218 మంది అభ్యర్థులు ఈ రోజు నియామక పత్రాలు అందుకుంటున్నారని ఆయన తెలియజేశారు. శనివారం కేవలం ‘రోజ్‌గార్ మేళా’కు మాత్రమే కాకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో దేశంలోని యువత సాధించే సాధికారతకు కూడా ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. కొత్తగా నియమితులైన ఉద్యోగులు చిత్తశుద్ధితో దేశానికి సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముందుగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ స్వాగతోపన్యాసం చేస్తూ ప్రభుత్వ సేవలో చేరుతున్న వేలాది మంది యువతకు రోజ్‌గార్ మేళా ఒక కీలక ఘట్టమని అభిప్రాయపడ్డారు.
నియామక పత్రాలను అందుకుంటున్న అభ్యర్థులు కేవలం ఉద్యోగ నియామకాన్ని మాత్రమే కాకుండా, వికసిత భారత్ లక్ష్య సాధనకు తమ వంతు సేవలను అందిం చేందుకు ఒక బాధ్యతా పత్రాన్ని కూడా స్వీకరిస్తు న్నారని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ స్థాయిలో 19వ ‘రోజ్‌గార్ మేళా’ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శనివారం ఢిల్లీ నుంచి ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, గుంతకల్లు , గుంటూరుతో సహా దేశవ్యాప్తంగా 47 ప్రాంతాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా, కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా నియమితులైన ఉద్యోగులకు 51,000 నియామక పత్రాలు పంపిణీ చేయబడ్డా యి. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ శ్రీ సిద్ధార్థ్ కటి, సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్ , రైల్వేలు ఇతర కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.



