Sunday, May 24, 2026
E-PAPER
Homeకరీంనగర్గ్రామీణ కలలకు కొత్త ఊపిరి…రంగులతో ప్రాణం పోసే కళాకారుడు 

గ్రామీణ కలలకు కొత్త ఊపిరి…రంగులతో ప్రాణం పోసే కళాకారుడు 

- Advertisement -

– గోడలపై శ్యామ్ అద్భుత చిత్రాలు
– ఫోక్ ఆర్ట్‌కు కొత్త అందాలు
నవతెలంగాణ-రాయికల్: ఒక ఖాళీ గోడను చూస్తే చాలామందికి అది కేవలం సిమెంట్ గోడగానే కనిపిస్తుంది.కానీ రాయికల్‌కు చెందిన యువ ఆర్టిస్ట్ శ్యామ్ కళ్లలో మాత్రం అది ఓ కళాఖండంగా మారుతుంది.రంగులను ఆయుధాలుగా,ఊహాశక్తిని ప్రాణంగా మార్చుకొని గోడలపై అద్భుత చిత్రాలను ఆవిష్కరిస్తున్న శ్యామ్..ప్రస్తుతం ఆ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.

దేవతల చిత్రాలు,తెలంగాణ జానపద కళారూపాలు,గ్రామీణ జీవనశైలి,ప్రకృతి దృశ్యాలు, జాతీయ నాయకులు ఇలా ఏ చిత్రం అయినా తన కుంచెతో జీవం పోసినట్లుగా చిత్రీకరించడం శ్యామ్ ప్రత్యేకత.ఆయన వేసిన చిత్రాలను చూసిన వారు “ఇవి కేవలం పెయింటింగ్స్ కావు..మాట్లాడే బొమ్మలు”అంటూ ప్రశంసిస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో గోడ చిత్రాలకు ప్రత్యేక ఆదరణ పెరుగుతుండగా..శ్యామ్ రూపొందిస్తున్న చిత్రాలు మరింత ఆకట్టుకుంటున్నాయి.శివపార్వతుల దివ్య రూపాలు,పల్లె జానపద నృత్యాలు,పండుగ సంబరాలు, అడవి జీవుల దృశ్యాలను ఆయన ఎంతో సహజంగా,భావోద్వేగాలతో చిత్రీకరిస్తున్నారు.ప్రతి చిత్రంలో రంగుల సమతుల్యత,భావ వ్యక్తీకరణ,కళ్లలో కనిపించే జీవం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

చిన్ననాటి నుంచే చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకున్న శ్యామ్..తన అభిరుచినే వృత్తిగా మార్చుకున్నారు.సాధారణ గోడలను కళా ప్రదర్శనశాలలుగా మార్చుతూ గ్రామీణ కళలకు కొత్త ఊపిరి పోస్తున్నారు.ముఖ్యంగా ఫోక్ ఆర్ట్,దేవతల చిత్రాలకు ఆయన ఇస్తున్న రూపకల్పన భక్తి భావాన్ని కలిగించేలా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు.

“చిత్రం వేయడం మాత్రమే కాదు.. దానికి భావం ఇవ్వాలి”అన్న సిద్ధాంతంతో ముందుకు సాగుతున్న శ్యామ్..తన కళ ద్వారా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభకు శ్యామ్ ఓ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -