Wednesday, June 10, 2026
E-PAPER
Homeజాతీయంవిత్తన పరిశ్రమపై పెత్తనం

విత్తన పరిశ్రమపై పెత్తనం

- Advertisement -

త్వరలోనే పార్లమెంటులో బిల్లు
వ్యవసాయ రంగాన్ని కేంద్రం నియంత్రిస్తుందంటున్న నిపుణులు

న్యూఢిల్లీ : హరిత విప్లవ సమయంలో తీసుకొచ్చిన 1966 నాటి విత్తన చట్టం స్థానంలో నూతన బిల్లును రాబోయే పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశపెడతామని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల ప్రకటించారు. భారత రైతులకు అందుబాటులో ఉన్న విత్తనాల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించడమే ఈ బిల్లు ఉద్దేశం. అయితే ఈ బిల్లు విత్తన పరిశ్రమను, తద్వారా దేశంలో వ్యవసాయ రంగాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వానికి విశేష అధికారాలు కట్టబెడుతుంది. బిల్లు ముసాయిదాను గత నవంబరులో ప్రజాభిప్రాయ సేకరణ కోసం అందుబాటులో ఉంచారు. కానీ బిల్లును తీసుకురావడం వెనుక ప్రభుత్వానికి ఉన్న హేతుబద్ధతను, దాని విధాన లక్ష్యాలను వివరించే శ్వేతపత్రాన్ని మాత్రం జత చేయలేదు. విత్తనాల నాణ్యత తక్కువగా ఉన్నదని ఫిర్యాదులు వస్తే వాటిని పరిష్కరించడమే బిల్లు ప్రాథమిక ఉద్దేశమని మంత్రి చెప్పారు.

రాష్ట్ర జాబితాలోనే ‘వ్యవసాయం’
ప్రైవేటు విత్తన పరిశ్రమ చాలా వరకూ ఈ బిల్లును సమర్ధిస్తోంది. వ్యాపారం సులభతరం అవుతుందంటూ కారణం చెబుతోంది. అయితే కొన్ని రైతు సంఘాలు, నేతలు మాత్రం దీనిని వ్యతిరేకించారు. ఈ బిల్లు విత్తన వ్యాపారంపై కార్పొరేట్ నియంత్రణను బలోపేతం చేస్తుందని, పంటల జీవవైవిధ్యం పైన, కమ్యూనిటీ విత్తన బ్యాంకులు సహా సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల పైన ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ మరో ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. విత్తన చట్టాన్ని రూపొందించడానికి రాజ్యాంగం ప్రకారం పార్లమెంటుకు శాసన సంబంధమైన అధికారం ఉన్నదా లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలులో పొందుపరచిన రాష్ట్రాల జాబితా పరిధిలోకి ‘వ్యవసాయం’ కూడా వస్త్తుంది. ఏడో షెడ్యులులో ఉన్న కేంద్ర లేదా ఉమ్మడి జాబితాలోని అంశాలపై మాత్రమే పార్లమెంట్ చట్టాలు చేయగలదు. రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేయాల్సింది రాష్ట్రాలే.

వలస పాలనలోనే తొలి ప్రయత్నం
దేశంలో విత్తన చట్టాన్ని రూపొందించడానికి వలస పాలన కాలంలోనే తొలి ప్రయత్నం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ‘యూరోపియన్ కూరగాయల’ విత్తనాల దిగుమతులకు ఆటంకం ఏర్పడింది. దీంతో బ్రిటిష్ ఇండియాలోని కూరగాయల రైతుల అవసరాలు తీర్చడానికి వలస ప్రభుత్వం క్వెట్టా, కాశ్మీర్‌లలో దేశీయ కూరగాయల విత్తన పరిశ్రమను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను పరిశీలించింది. 1943లో అప్పటి ఇంపీరియల్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ సంస్థ కొత్త వ్యవసాయ విత్తన చట్టాన్ని రూపొందించి అభిప్రాయాల కోసం రాష్ట్రాలకు పంపింది. దీనిపై విస్తృత సంప్రదింపులు జరిగాయి. అయితే స్వాతంత్య్రం ప్రకటించడానికి ముందు వివిధ కారణాలతో ఆ ప్రయత్నం అటకెక్కింది.

రాష్ట్రాలు రూపొందించుకున్న చట్టాలు
భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో విత్తన చట్టాలపై రాష్ట్రాలే చొరవ తీసుకు న్నాయి. ఉదాహరణకు 1952లో జమ్మూ కాశ్మీర్ కూరగా యల విత్తన చట్టాన్ని రూపొందించింది. పండ్ల తోటల విత్తనాలకు సంబంధించి 1956లో హిమాచల్ ప్రదేశ్ ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇటీ వలే 2020లో పంజాబ్ ప్రభుత్వం బంగాళదుంపల విత్తన చట్టాన్ని రూపొం దించింది. 1949లో తూర్పు పంజాబ్, 1949లో ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ ప్రాంతం) సాధారణ చట్టాలను తీసుకొచ్చాయి. రాష్ట్రాలు రూపొందించిన ఈ విత్తన చట్టాలు దేశీయ వ్యవసాయంలో ఉన్న అపార వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. రాష్ట్రాలు తమ రైతులు, స్థానిక వ్యవసాయ ఆర్థిక వ్యవస్థల డిమాండ్లకు అనుగుణంగా వేర్వేరు చట్టాలను రూపొందించాయి. కొన్ని రాష్ట్రాలు కాలక్రమేణా వాటిని సవరించుకుంటూ మెరుగుపరచుకుంటున్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నర్సరీల నియంత్రణ చట్టాన్ని 1973, 2015 సంవత్సరాలలో సవరించింది. అయితే ఇప్పుడు కేంద్రం ప్రతిపాదిస్తున్న నూతన చట్టం రాష్ట్ర చట్టాలను అస్థిర పరచేందుకు, వాటిని రద్దు చేసేందుకు దోహదపడుతుందని వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్రం చేతిలోనే వ్యాపార నియంత్రణ
కొత్త విత్తన చట్టం కార్యరూపం దాలిస్తే విత్తన వ్యాపారాన్ని నియంత్రించే అధికారాలు కేంద్రం చేతితో కేంద్రీకృత మవుతాయి. ఇందుకు విత్తన పరిశ్రమ అనుకూలంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం దానికి ఉండదు. ప్రమాణాలు, ధృవీకరణ అవసరాలు, లేబులింగ్ నిబంధనలు, ధరల నియంత్రణ వంటి వివాదాస్పద అంశాలపై కేంద్రంతో చర్చించుకుంటే సరిపోతుంది. అధికార కేంద్రీకరణ…ముఖ్యంగా లాభదాయక పంటల విషయంలో రాష్ట్రాలకు, సమాఖ్య వాదానికి మంచిది కాదు. బాసుమతి బియ్యాన్ని ఏ రాష్ట్రంలో పండించాలో 2017లో కేంద్రం నిర్దేశించింది. 1966 నాటి చట్టం ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది మధ్యప్రదేశ్ రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు అధికారంలో ఉంటే వైరుధ్యాలు మరింతగా పెరిగే ప్రమాదం ఉంది.

నాడు 
ప్రతిపక్షాల 
వాదనను 
పట్టించుకోని కేంద్రం
రాష్ట్రాలు ఇప్పటికే విత్తన చట్టాలు చేసినందున పార్లమెంట్ కొత్తగా చట్టాన్ని చేయగలదా అనేదే ఇప్పుడు ప్రశ్న. రాష్ట్ర జాబితాను, కేంద్ర జాబితాను, ఉమ్మడి జాబితాను రాజ్యాంగం ఇప్పటికే నిర్దేశించింది. అయితే కేంద్ర, రాష్ట్ర చట్టాల మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు పార్లమెంటరీ చట్టమే చెల్లుబాటు అవుతుంది. 1966లోనే పార్లమెంట్ ఓ విత్తన చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిపై చట్టసభలో చర్చ జరుగుతున్నప్పుడు శాసన అధికార పరిధి సమస్యను ప్రతిపక్షాలు లేవనెత్తాయి. ఏడో షెడ్యులులోని రాష్ట్ర జాబితాలో ‘వ్యవసాయం’ అనే అంశం ఉన్నందున విత్తన చట్టాన్ని రూపొందించే అధికారం పార్లమెంటుకు లేదని అవి వాదించాయి. దీనికి ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేకపోవడంతో చర్చ వాయిదా పడింది. ప్రతిపక్షం లేవనెత్తిన రాజ్యాంగపరమైన సమస్యకు ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోయినప్పటికీ కొన్ని నెలల తర్వాత పార్లమెంట్ ఆ బిల్లును ఆమోదించింది. అప్పటి నుంచీ దీనిపై న్యాయస్థానాలలో వ్యాజ్యాలు నడుస్తూనే ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -