Monday, May 25, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంశాంఛెజ్..దిగిపో

శాంఛెజ్..దిగిపో

- Advertisement -

స్పెయిన్ ప్రధాని కుటుంబం, సన్నిహితుల అనినీతిపై జనాగ్రహం
మాడ్రిడ్‌లో వేలాది మందితో ప్రదర్శన
సెర్బియాలోనూ అవినీతికి 
వ్యతిరేకంగా 
విద్యార్థుల నిరసన

మాడ్రిడ్ : స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంఛెజ్ కుటుంబసభ్యులు, సన్నిహితులు అవినీతిలో కూరుకుపోయినందున ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాజధాని మాడ్రిడ్‌లో శనివారం వేలాది మంది ప్రదర్శన నిర్వహించారు. ఎరుపు, పసుపు పతాకాలను చేబూనిన ప్రదర్శకులు ‘ఇక చాలు’ అంటూ నినాదాలు చేశారు. ‘అవినీతికి మూల్యం ఉంటుంది. ఇక శిక్ష నుంచి మినహాయింపులు ఉండవు. రాజీనామా చేసి వెంటనే ఎన్నికలు నిర్వహించాలి’ అని రాసి ఉన్న భారీ బ్యానర్‌తో ప్రదర్శన సాగింది. ‘సొసైదాద్ సివిల్ ఎస్పానోలా’ అని పిలిచే 150 పౌర సంఘాల వేదిక ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. దీనికి కన్సర్వేటివ్ పాప్యులర్ పార్టీ, వాక్స్ పార్టీ మద్దతు ఇచ్చాయి. ప్రదర్శనకు 1,20,000 మంది హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వం మాత్రం ఆ సంఖ్యను 40,000గా చూపింది. ప్రధాని శాంఛెజ్ అధికారిక నివాసానికి సమీపంలో ఉన్న ప్లాజా మాంక్లోవా వద్ద ప్రదర్శన ముగిసింది. ప్రదర్శన ముగిసిన తర్వాత కొందరు ఆందోళనకారులు ప్రధాని నివాసం వైపు చొచ్చుకుపోయేందుకు ప్రయత్నిం చారు.

అయితే వారిని పోలీసులు తరిమివేశారు. మొత్తంమీద ప్రదర్శన శాంతియుతంగానే జరిగింది. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశామని, ఏడుగురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యా యని ప్రభుత్వం తెలిపింది. ‘ఇప్పుడు పెడ్రో శాంఛెజ్ చుట్టూ ఎవరూ లేరు. తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారని ఆయన కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు స్పెయిన్ అవినీతి మాఫియా చేతిలో బందీగా ఉంది’ అని వాక్స్ పార్టీ నేత శాంటియాగో అబాస్కల్ విలేకరులకు చెప్పారు. 2018లో శాంఛెజ్ అధికారంలోకి వచ్చారు. అవినీతి ఊబిలో కూరుకుపోయిన కన్సర్వేటివ్ పీపీ ప్రభుత్వంపై చట్టసభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో శాంఛెజ్ అధికార పగ్గాలు చేపట్టారు. అయితే శాంఛెజ్ కూడా అవినీతి మరక అంటిం చుకున్నారు. ఓ అవినీతి కేసులో ఆయన భార్య బెగోనా గోమెజ్ విచారణను ఎదుర్కొంటున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణపై శాంఛెజ్ సోదరుడు డేవిడ్ కూడా విచారణను ఎదుర్కోబోతున్నారు. భార్యపై ఆరోపణలు వచ్చిన తర్వాత 2024 ఏప్రిల్‌లో పదవికి రాజీనామా చేయాలని శాంఛెజ్ యోచించారు. తన కుటుంబంపై మోపిన కేసులు రాజకీయ దురుద్దేశంతో కూడినవని ఆయన ఆరోపించారు. శాంఛెజ్‌కు కుడిభుజమైన రవాణా శాఖ మాజీ మంత్రి జోస్ లూయిస్ అబాలస్ ఓ అవినీతి కేసులో తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. శాంఛెజ్ మిత్రుడైన సోషలిస్ట్ మాజీ ప్రధాని జోస్ లూయిస్ రోడ్రిగుజ్ జపాటెరోపై వచ్చిన ఆరోపణ లను కొద్ది రోజుల క్రితమే న్యాయస్థానం ధృవీకరించి ఆయనను దోషిగా తేల్చింది. దీంతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగింది.

సెర్బియాలోనూ అవినీతికి వ్యతిరేకంగా..
సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో అధ్యక్షుడు అలెగ్జాండర్ వుసిక్ నేతృత్వంలోని ఈ బాల్కన్ దేశంలో భారీ రాజకీయ మార్పుల కోసం విద్యార్థులు పోరాడుతున్నారు. ప్రభుత్వంపై వెల్లువెత్తిన నిరసనలపై ఉక్కుపాదం మోపేందుకు భారీగా భధ్రతాబలగాలను రంగంలోకి దింపాయి. అయినా విద్యార్థులు తమ ఆందోళనల్ని విరమించుకోమని స్పష్టం చేశారు. సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వుసిచ్ 12 ఏండ్ల పాలనకు ముగింపు పలకాలని డిమాండ్ చేస్తూ, విద్యార్థుల నేతృత్వంలోని ఉద్యమం పతాకస్థాయికి చేరింది. శనివారం సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌కు తిరిగి రావడంతో, నిరసనకారుల బృందాలకు, పోలీసు లకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. ప్రజాస్వామ్య అధికారాల తనిఖీ, సమతుల్య తను అధ్యక్షుడు అలెగ్జాండర్ వుసిచ్ దెబ్బతీస్తు న్నారని విమర్శ కులు ఆరోపిస్తున్నారు.సుమారు 18 నెలల క్రితం, ఒక ప్రధాన రైల్వే స్టేషన్‌లో కొత్తగా పునరుద్ధరించిన పైకప్పు కూలిపోయి 16 మంది మరణించిన ఘటన తర్వాత ఈ నిరసన ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఘటనకు అవినీతి, నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు వచ్చాయి.

తాజా నిరసనలో ఏం జరిగింది?
మీడియా నివేదికల ప్రకారం, ఈ ర్యాలీలో పదివేల మందికి పైగా పాల్గొన్నారు. వీరిలో చాలామంది నిరసనకారులు “విద్యార్థులే గెలుస్తారు” (స్టూడెంట్స్ విన్) అనే నినాదంతో ఉన్న టీ-షర్టులు ధరించారు .సెర్బియా జెండాలను, తమ పట్టణం లేదా నగరం పేర్లు ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు. ప్రధాన నిరసన చాలావరకు శాంతియుతంగానే జరిగినప్పటికీ పోలీసుల కవ్వింపులతో ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. వారిని చెదరగొట్టడానికి అల్లర్ల నిరోధక పోలీసులు ముందుకు దూసుకెళ్తూ, బాష్పవాయువు , స్టన్ గ్రెనేడ్లను ప్రయోగించారు. ఈ నిరసన సందర్భంగా పాల్గొన్న ముఖ్యనేతలు మాట్లాడుతూ.. ముందస్తు పార్లమెంటరీ ఎన్నికలు జరపాలని పిలుపునిచ్చారు, ప్రభుత్వంపై నేరాలు, అవినీతి ఆరోపణలు చేశారు. చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -