Sunday, February 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయందిగివచ్చిన అదానీలు

దిగివచ్చిన అదానీలు

- Advertisement -

లీగల్‌ నోటీసు తీసుకునేందుకు సంసిద్ధత
న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ ఫెడరల్‌ కోర్టుకు తెలియజేసిన అదానీ తరపు న్యాయవాదులు

న్యూయార్క్‌/న్యూఢిల్లీ : సివిల్‌ దావాలో అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ) పంపిన లీగల్‌ నోటీసును తీసుకునేందుకు బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్‌ అదానీ ఎట్టకేలకు అంగీకరించారు. ఈ విషయాన్ని ఎస్‌ఈసీతో పాటు గౌతమ్‌ అదానీ, సాగర్‌ అదానీల తరఫు న్యాయవాదులు న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ ఫెడరల్‌ కోర్టుకు తెలియజేశారు. దీంతో అదానీలకు లీగల్‌ నోటీసులు ఎలా అందించాలన్న విషయంపై జడ్జి రూలింగ్‌ ఇవ్వాల్సిన అవసరం తప్పింది.

అయితే ఎస్‌ఈసీ, అదానీల న్యాయవాదులు సంయుక్తంగా సమర్పించిన దరఖాస్తును సంబంధిత కోర్టు అనుమతించాల్స ఉంటుంది. ముడుపుల పథకానికి సంబంధించి ఇన్వెస్టర్లను మోసం చేశారంటూ వారిపై ఎస్‌ఈసీ అభియోగం మోపిన విషయం తెలిసిందే. ఎస్‌ఈసీ, అదానీల న్యాయవాదుల దరఖాస్తును జడ్జి అనుమతిస్తే కేసు ముందుకు సాగుతుంది. చట్ట ప్రకారం…నోటీసులు అందుకున్న 90 రోజుల లోగా అదానీలు తమ వాదనలు సమర్పించాల్సి ఉంటుంది. వాటిపై ఎస్‌ఈసీ 60 రోజులలో స్పందించాలి. అనంతరం ఎస్‌ఈసీ స్పందనపై 45 రోజుల లోగా అదానీలు సమాధానం ఇవ్వవచ్చు.

ఏం జరిగింది?
అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఏజీఈఎల్‌) గురించి అదానీలు తప్పుదారి పట్టించే ప్రకటనలు చేసి అమెరికా సెక్యూరిటీల చట్టాలను ఉల్లంఘించారంటూ ఎస్‌ఈసీ 2024 నవంబరులో దావా వేసింది. ఎస్‌ఈసీ సివిల్‌ ఫిర్యాదుతో పాటు…సౌర విద్యుత్‌ ప్రాజెక్టులు పొందడానికి అదానీలు, ఇతరులు భారత్‌లో 265 మిలియన్‌ డాలర్ల ముడుపులు అందించారంటూ న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌ పదే పదే ఖండిస్తూ వచ్చింది. ఈ రెండు దావాలపై విచారణ సంవత్సర కాలానికి పైగా ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. అదానీలు భారత్‌లోనే ఉండడం, నోటీసులు తీసుకోకపోవడమే దీనికి కారణం.

ఈ నేపథ్యంలో నోటీసులను ఈ మెయిల్‌ ద్వారా లేదా అదానీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా సంస్థల ద్వారా అందించేందుకు ప్రత్యామ్నాయ పద్ధతులను అనుమతించాలంటూ గత వారం అమెరికా జడ్జిని ఎస్‌ఈసీ కోరింది. నోటీసులను అంగీకరించేందుకు గౌతమ్‌, సాగర్‌ అదానీ అంగీకరించారని ఏజీఈఎల్‌ తెలిపింది. నోటీసుల అందజేతకు ప్రత్యామ్నాయ పద్ధతుల కోసం ఎస్‌ఈసీ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరబోతోంది. ఇదిలావుండగా అదానీ తరఫున వాదించేందుకు వాల్‌ స్ట్రీట్‌ న్యాయవాది రాబర్ట్‌ గుఫ్రా జూనియర్‌ నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సహా పలువురు ప్రముఖులు ఆయనకు క్లయింట్లు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -