బీఆర్‌ఎస్‌ పాలనలో శ్రమ చులకన

శ్రమను, శ్రమ జీవులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చులకనగా చూస్తోందని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు అన్నారు. కార్మిక హక్కులను కాలరాస్– కార్మిక హక్కులను కాలరాస్తున్న కేసీఆర్‌
– వామపక్షాల అభ్యర్థులకే ఓటేయ్యండి : సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు బీఆర్‌ఎస్‌ పాలనలో శ్రమ చులకన
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
శ్రమను, శ్రమ జీవులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చులకనగా చూస్తోందని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు అన్నారు. కార్మిక హక్కులను కాలరాస్తూ.. సమ్మెలు, ఆర్టీసీలో యూనియన్‌లను నిషేధించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబు మాట్లాడారు. కార్మిక సంఘ పోరాటాలకు వామపక్షాలు వెన్నుదన్నుగా ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలకు సీఐటీయూ మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. 30న జరిగే ఎన్నికల్లో సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌) అభ్యర్దులకు కార్మికులు ఓట్లు వేయాలని కోరారు. 55 రోజుల పాటు ఆర్టీసీలో సమ్మె చేశారనే కారణంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ పార్టీ యూనియన్‌తో సహా కార్మిక సంఘాలన్నింటినీ నిషేధించిందని తెలిపారు. కార్మిక హక్కులను కాలరాస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో నిషేధించాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లో వామపక్షాలకు ప్రాతినిధ్యం ఉంటేనే కార్మిక హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. 73 షెడ్యూల్‌ పరిశ్రమల్లో 1.70 కోట్ల మంది కార్మికులకు ప్రతి ఐదేండ్లకు ఒకసారి వేతన సవరణ చేయాల్సి ఉన్నా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. ఆర్టీసీ భవిష్య నిధి రూ. 1200 కోట్లు, సింగరేణిలో రూ.10వేల కోట్లను ప్రభుత్వం జమ చేసుకొని ఆయా సంస్థలతో పాటు కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఆరోపించారు. రిటైరయిన రెండేండ్ల వరకు ఆర్టీసీ కార్మికుల పెన్షన్‌, బెనిఫిట్స్‌ను ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1.30 లక్షల మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించలేదని తెలిపారు. అందుకనే వామపక్షాలు కార్మికుల మేనిఫెస్టో విడుదల చేశాయని తెలిపారు. ఎలక్షన్స్‌ వచ్చేసరికి రూ 400కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామనడం బీఆర్‌ఎస్‌ మోసపూరిత హామీకి నిదర్శనమని చెప్పారు. రాష్ట్ర శాసనసభలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జీఎస్టీ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సీపీఐ(ఎం) ఎమ్మెల్యే సున్నం రాజయ్య మినహా మిగతా సభ్యులందరూ ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉంటే ప్రజలపై భారాలు పడకుండా నియంత్రిస్తారన్నారు. అందుకే వామపక్షాల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులందర్నీ గెలిపించాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) అభ్యర్థులుగా బరిలో ఉన్న సీఐటీయా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌తో పాటు నాయకులు పిట్టల అర్జున్‌, మల్లికార్జున్‌, యర్ర శ్రీకాంత్‌ను గెలిపించాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మా విష్ణు, కళ్యాణం వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు వై.విక్రమ్‌, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ పి.రమ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love