పోరాటానికి ఓటేయండి

Vote for the fight– ఇది రాజకీయ దళారీలకు.. ప్రజా పోరాటాలకు మధ్య పోటీ
– బీజేపీకి భయపడి బీఆర్‌ఎస్‌ మాతో పొత్తు పెట్టుకోలేదు..
– కాంగ్రెస్‌కు పదవుల యావ తప్ప విధానాలు పట్ల చిత్తశుద్ధి లేదు : ఖమ్మం, పాలేరు సీపీఐ(ఎం) అభ్యర్థుల నామినేషన్‌ సందర్భంగా బహిరంగసభలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
అవకాశ వాద పార్టీలకు కాకుండా సీపీఐ(ఎం)కు వేసే ప్రతి ఓటు ఆయుధమని, మిగతా పార్టీలకు వేసే ఓటు భేరమని ఆ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. సీపీఐ(ఎం)కు వేసే ఓటు పోరాటానికి, అవకాశవాద పార్టీలను కడిగిపారేసేందుకు అని స్పష్టంచేశారు. వామపక్షాల అవసరమేంటో రుజువు చేసుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఖమ్మం, పాలేరు సీపీఐ(ఎం) అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా స్థానిక పెవిలియన్‌గ్రౌండ్‌లో గురువారం నిర్వహించిన బహిరంగసభలో రాఘవులు ప్రసంగించారు.
శాసనసభలో కమ్యూనిస్టులు లేని లోపం కనిపిస్తోంది..
తెలంగాణ శాసనస భలో కమ్యూనిస్టులు లేని లోపం స్పష్టంగా కనిపిస్తుందని రాఘవులు అన్నారు. ఒక్క కమ్యూనిస్టు ఉన్నా ఆ శాసనసభ రూపు రేఖలే మారిపోతాయని తెలిపారు. శాసనసభ ప్రజావేదికగా కాకుండా బూతుల వేదికగా మారిందని, అస్సలు సమావేశాలే జరపకుండా ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేసే పద్ధతి కొనసాగుతుంద న్నారు. శాసనసభలో కమ్యూనిస్టు ఎమ్మెల్యే ఒక్కరున్నా ప్రజా వేదికగా మారుతుందన్నారు. పరస్పరం నిందించుకునే బూర్జువా పార్టీలకు ముళ్లు కర్రలాగా సీపీఐ(ఎం) పనిచేస్తుంద న్నారు. రాజకీయాలతో మ్యూజికల్‌ చైర్స్‌ ఆడుకునే వాళ్లను గెలిపించుకోవాలా? నిరంతరం ప్రజలు, ప్రజా ఉద్యమాల కోసం పనిచేసే వాళ్లను గెలిపించు కోవాలా? ఆలోచన చేయాలని ఓటర్లకు పిలుపు నిచ్చారు. బీఆర్‌ఎస్‌, బీజేపీని ఓడించమనే సీపీఐ (ఎంఎల్‌) ప్రజాపంథా.. కాంగ్రెస్‌కు ఓట్లేయమనడం సహేతుకం కాదన్నారు. వామపక్షాలకు కాకుండా బూర్జువా పార్టీలకు ఓట్లేస్తామనడం సరికాదన్నారు. రాజకీయాలను ఉద్యమ రాజకీయాలుగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
బీజేపీని ఓడించడమే లక్ష్యం..
దేశంలో బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్న ప్రతి ఒక్కర్ని ఆహ్వానించేలా తమ పార్టీ విధానాన్ని రూపొందించుకొని, అన్ని పార్టీలను ఐక్యం చేస్తున్నామని తెలిపారు. కేరళలో కాంగ్రెస్‌, బెంగాల్‌లో తృణమూల్‌తో తగాదాలున్నా బీజేపీని ఓడించేందుకు సహకరిస్తున్నామన్నారు. తెలంగాణ లోనూ బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు కొంత ప్రయత్నం చేసిందని, అలాంటి స్థితిలో మునుగోడులో బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ గొప్ప పార్టీ అనో.. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం తెస్తుందనో.. ప్రజలకు మేలు చేస్తుందనో.. కాదన్నారు. రాష్ట్రంలో తొమ్మిదేండ్లుగా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసింది సీపీఐ(ఎం) మాత్రమేనని స్పష్టంచేశారు. పోడు భూములు, ఇండ్ల్ల స్థలాల గురించి పోరాటాలు చేస్తుంది సీపీఐ(ఎం) కాదా.. కేసులు పెడుతుంది బీఆర్‌ఎస్‌ కాదా.. అని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్‌కు బీజేపీని ఓడించాలనే చిత్తశుద్ధి లేదు..
బీఆర్‌ఎస్‌కు బీజేపీని ఓడించాలనే చిత్తశుద్ధి లేదన్నారు. బీజేపీని ఓడించడానికి బీఆర్‌ఎస్‌ ఏమైనా పని కొస్తుందేమో.. అనుకున్నామని, కానీ ఇండియా కూటమిలో భాగస్వాములు కాబట్టి సీపీఐ(ఎం)తో ఎలా కలుస్తామని బీఆర్‌ఎస్‌ ప్రశ్నించిందని తెలిపారు. కవిత లిక్కర్‌ స్కాంలో ఇరుక్కొని ఉందని, బీజేపీకి భయపడి కమ్యూనిస్టులతో పొత్తుకు బీఆర్‌ఎస్‌ ముందుకు రాలేదన్నారు. రేపు ఎన్నికలయ్యాక కాంగ్రెస్‌ ఊపు ఉంటే దాని చంకన, లేదంటే బీజేపీ చంకన కేసీఆర్‌ ఎక్కుతాడని విమర్శించారు. గతంలో కాంగ్రెస్‌ మంత్రివర్గంలోనూ బీఆర్‌ఎస్‌ లేదా.. అని ప్రశ్నించారు.
Vote for the fightసమస్త హక్కుల కోసం పోరాడే వాణిగా ఉంటాం: తమ్మినేని
ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపిస్తే సమస్త హక్కుల కోసం పోరాడే వాణిగా ఉంటామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పాలేరు నియోజకవర్గ అభ్యర్థి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పొత్తుల విషయంలో అనుసరించిన మోసపూరిత వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు గడ్డిపోచతోనైనా జట్టు కడతామన్నారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ గెలిచి ఉంటే రాష్ట్ర రాజకీయాలే మారేవని, కానీ వామపక్షాల అండతో దాన్ని అడ్డుకోవడం వల్లనే బీజేపీని అక్కడ ఓడించగలిగామని తెలిపారు. అనంతరం భారీ ప్రదర్శనగా వెళ్లి ఖమ్మం రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో తమ్మినేని నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు ఖమ్మం అభ్యర్థిగా యర్రా శ్రీకాంత్‌ నామినేషన్‌ వేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి అభ్యర్థులు యర్రా శ్రీకాంత్‌, భూక్యా వీరభద్రం, మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్‌, వై.విక్రమ్‌, బుగ్గవీటి సరళ తదితరులు పాల్గొన్నారు.
Vote for the fightకాంగ్రెస్‌కు ఊడిగం చేయాలా?
కాంగ్రెస్‌ అనేక ప్రజా వ్యతిరేక చట్టాలు తెచ్చిందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌ అన్నారు. ‘ఖమ్మంలో ఒక్క స్థానం లేకుండా పొత్తులో ఎక్కడికి పోవాలి, వారికి ఊడిగం చేయడానికి పోవాలా..’ అని ప్రశ్నించారు.
కేరళలో సీపీఐ(ఎం)ను ఓడించాలని.. తెలంగాణలో కమ్యూనిస్టుల ఉనికి లేకుండా చేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నా.. ఆ పార్టీ కన్నా బీజేపీ ప్రమాదకారి కాబట్టి కాంగ్రెస్‌తోపాటు ఇండియా కూటమిలో ఉన్నామని తెలిపారు. అంబాని, అదానీలు తప్ప ఈ దేశంలో ఎవరూ లేనట్టు బీజేపీ వ్యవహరి స్తోందన్నారు.కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తరపున ఇప్పుడు పోటీ చేస్తున్నవాళ్లు గతంలో ఎక్కడున్నారని, రేపు ఏ పార్టీలో ఉంటారో వాళ్లకైనా తెలుసా అని ప్రశ్నించారు. వీళ్లు రాజకీయ దళారీలు తప్ప నాయకులు కాదన్నారు. కాంగ్రెస్‌ హ్యాండ్‌ పార్టీ కాదు.. హ్యాండ్‌ ఇచ్చే పార్టీ అని తెలిపారు. పదవులు, అధికారం తప్ప బీజేపీని ఓడించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదన్నారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి ఒక్క సీపీఐ(ఎం)కు మాత్రమే ఉందన్నారు. ధనవంతులు, కార్మికులు, వ్యవసాయదారులు, కార్పొరేట్లు, ఉత్పత్తిదారులు దోపిడీదారులకు మధ్య పోటీ ఇదని అన్నారు.
బి.వెంకట్‌, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు

Spread the love